కేటీఆర్, సంతోష్‌ల దగ్గర వేల కోట్లు.. డొంక లాగిన రేవంత్‌రెడ్డి..
posted on Jul 13, 2021 @ 7:56PM
విమర్శలు చేయడంలో రేవంత్‌రెడ్డి తర్వాతే ఎవరైనా. సూదుల్లాంటి మాటలతో కుళ్లబొడవడంలో ఆయన ఎక్స్‌పర్ట్. సెటైర్లు వేయడంతో అంతకుమించినోడు లేడంటారు. అలాంటి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక మరింత దూకుడు పెంచారు. కేసీఆర్ ప్రస్తావన వస్తే చిచ్చరపిడుగులా మరింత చెలరేగి పోతున్నారు. అటు సీఎం కేసీఆర్‌ను మాటలతో కుమ్మేస్తూనే.. ఇటు కాంగ్రెస్ పార్టీని కంచుకోటలా మార్చేస్తున్నారు.
విమర్శలే కాదు.. తెలంగాణ అభివృద్ధిపైనా దృష్టి సారించారు పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి. మేధోవర్గంతో మంతనాలు జరుపుతున్నారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం తీవ్రంగా తపిస్తున్న.. అసలైన బంగారు తెలంగాణను కాంక్షిస్తున్న.. పాత కాంగ్రెస్ నేతలను మళ్లీ కలుస్తున్నారు. వారి ఇంటికెళ్లి మరీ పార్టీలోకి ఆహ్వానిస్తూ.. కలిసి పని చేద్దామంటూ చేతులు కలుపుతున్నారు. ఇటీవల కాంగ్రెస్ తీరుతో విసిగి వేసారి పోయి.. ఇక తాను పార్టీలో ఉండలేనంటూ.. ఇక వీడుకోలంటూ.. పార్టీని వదిలి వెళ్లి.. ప్రస్తుతానికి తటస్థంగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఇంటికి వెళ్లి మరీ కలిశారు రేవంత్‌రెడ్డి. ఆయన్ను తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు. రేవంత్ చర్చలు ఫలించి.. కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి సమ్మతించడం ఆసక్తికరం.
కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో రాజకీయాల కంటే.. రాష్ట్రాభివృద్ధిపైనే ఎక్కువ చర్చించామని రేవంత్‌రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారని.. ధనిక రాష్ట్రమైన తెలంగాణను అప్పుల రాష్ట్రంగా మార్చారని మండిపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి వదిలిన ఓ డైలాగ్ ఇంట్రెస్టింగ్‌గా మారింది. అప్పుల కోసం కేసీఆర్ ఎక్కడికీ వెళ్లాల్సిన అవసరం లేదని.. మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్‌లను అడిగితే 10 పైసల వడ్డీకే వేల కోట్లు ఇస్తారన్నారు రేవంత్‌రెడ్డి. అంటే, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల అవినీతికి డబ్బు పోగేసినట్టు పరోక్షంగా సెటైర్లు వేశారు పీసీసీ చీఫ్.
రేవంత్‌రెడ్డికి పీసీసీ రావడం సంతోషంగా ఉందన్నారు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి. కాంగ్రెస్ చేపట్టే నిరుద్యోగ దీక్షలో పాల్గొంటానని ప్రకటించారు. త్వరలోనే కాంగ్రెస్‌లో చేరుతానంటూ సంకేతాలు ఇచ్చారు మాజీ ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి.