ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ గా కొమ్మినేని రాజీనామా.. జగన్ పొమ్మన్నారా? గెంటేశారా?
posted on Jan 13, 2024 @ 2:22PM
సరిగ్గా ఎన్నికల వేళ జగన్ కుఅత్యంత ఆప్తులుగా గుర్తింపు పొందిన వారు, ఆయన్నో దేవుడిగా అభివర్ణిస్తూ భజన చేసిన వారు, దగ్గర బంధువులు ఇలా ఒక్కరొక్కరుగా ఆయనకు దూరం అవుతున్నారు. అలా అని వారంతట వారు స్వచ్ఛందంగా దూరం అవుతున్నారని చెప్పడానికి వీళ్లేదు. జగన్ స్వయంగా మెడబట్టి గెంటేయడమో, లేదా.. వారిపట్ల అవమానకరంగా ప్రవర్తించడం వల్లో.. లేదా నా భక్తులే కదా ఏం చేసినా చేయకపోయినా పంచన పడి ఉంటారన్న భావనతో చులకనగా చూడడమో తట్లుకోలేక దూరం అవుతున్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలు పెడితే ఈ జాబితా రోజురోజుకూ పెరుగుతూ ఉంది.
అయితే రాజకీయాలకు సంబంధం లేకుండా.. టికెట్ల కేటాయింపు, సీట్ల మార్పు వంటి వాటితో ఏం సంబంధం లేని, నమ్మిన బంటు లాంటి కొమ్మినేని ఉరుములేని పిడుగులా రాజీనామాస్త్రం సంధించడంపై సర్వత్రా విస్మచం వ్యక్తం అవుతోంది. జర్నలిజం విలువలకు తిలోదకాలిచ్చి మరీ జగన్ పూజ, భజన చేసిన సోకాల్డ్ సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు, జగన్ మెచ్చి ఇచ్చిన పదవికి రాజీనామా చేశారు. ఔను ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా చేశారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. అంతే కాదు తన రాజీనామా వెంటనే అమలులోకి వస్తుందని కూడా చెప్పేశారు. అంటే ఆయన ఇలా రాజీనామా చేయగానే.. జగన్ అలా ఆమోదించేశారన్నమాట.
కొమ్మినేని వంటి వ్యక్తి ప్రభుత్వ విధానాలు నచ్చకో, జగన్ వైఖరి పట్ల అసహనంతోనో రాజీనామా చేశారంటే నమ్మశక్యంగా లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జర్నలిస్టుగా ఆయన ప్రస్థానం గురించి తెలిసిన వారు కూడా ఆయన మెడపట్టుకు గెంటేసినా చూరుపట్టుకు వేళాడే రకమని, అటువంటి వ్యక్తి వ్యక్తిగత కారణాలంటూ రాజీనామా చేశారంటే నమ్మడం కష్టమేనని చెబుతున్నారు. జగన్ కు ఆయన రాజీనామా చేసిన విషయాన్ని వెల్లడిస్తూ కేబినెట్ హోదాతో కూడిన ప్రెస్ అకాడమీ చైర్మన్ గా నియమించిన జగన్ కు కొమ్మినేని చెప్పిన కృతజ్ణతలు కూడా మొక్కుబడిగా ఉన్నాయే తప్ప మనస్ఫూర్తిగా చెప్పినట్లు లేవని అంటున్నారు. మొత్తం మీద కొమ్మినేని రాజీనామాకు కారణాలు ఇవీ అని ఇతమిథ్థంగా తెలియకపోయినప్పటికీ.. జగన్ ఆయనను తప్పుకోమని ఆదేశించి ఉంటారనీ, అందుకే రాజీనామా అంటూ కొమ్మినేని ప్రకటించారని చెబుతున్నారు.