అమరావతి పేరెత్తవా వీర్రాజు? బెజవాడ బీజేపీ సభ అట్టర్‌ఫ్లాప్!
posted on Dec 28, 2021 @ 5:24PM
'థు' అంటారో.. 'థు' 'థు' అంటారో అనుకున్నారంత. అంతన్నారు.. ఇంతన్నారు.. విజయవాడ సభతో జగన్ దుమ్ముదులిపేస్తామన్నారు. కానీ, రహస్య స్నేహితుడిని నోటికొచ్చినట్టు తిట్టడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు నోరు రాలేనట్టుంది. పైపైన నాలుగు మాటలు అనేసి మైకు పక్కనపెట్టేశారు. ఎప్పటిలానే టీడీపీపై నోరు పారేసుకున్నారు. ఈసారి కమ్యూనిస్టులపై వీర్రాజు వారు వీరంగం వేయడం ఇంట్రెస్టింగ్ పాయింట్. టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు ఏపీని అభివృద్ధికి దూరం చేశాయని సోము వీర్రాజు అన్నారు. ప్రత్యేక హోదాను వద్దన్నదీ చంద్రబాబేనట. ఇలా సాగింది సోము స్పీచ్. ఇంతకీ, విజయవాడ సభలో టీడీపీ టాపిక్ ఎందుకో ఆయనకే తెలియాలంటున్నారు. విజయవాడలో బీజేపీ సభ పెట్టింది టీడీపీని తిట్టడానికో.. వైసీపీని తిట్టడానికో..? ఎప్పటిలానే అలవాటు ప్రకారం ఫ్లోలో వీర్రాజు నోటి నుంచి రొటీన్ డైలాగ్స్ వచ్చాయంటున్నారు.
ఇక, టీడీపీతో పాటు.. కమ్యూనిస్టుల వెనకా పడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు వీర్రాజు. యూనియన్ల పేరుతో పాఠశాలలను సర్వనాశనం చేసింది కమ్యూనిస్టులే. పేదపిల్లల ఆహార నిధులనూ దోచుకున్నారు. ట్రేడింగ్ పార్టీలకు ఏజెంట్లు కమ్యూనిస్టు పార్టీలు.. ఇలా విశాఖలో మినహా ఏపీలో అంతగా యాక్టివ్‌గా లేని కామ్రేడ్ల గురించి ఏవేవో ఆరోపణలు చేశారు వీర్రాజు. ఏ రహస్య స్నేహితుడికి అనుకూలంగా ఇలా టీడీపీ, కమ్యూనిస్టులపై విరుచుకుపడ్డారో? అంటున్నారు.
నిధులిస్తున్నది కేంద్రమేనని.. పథకాలన్నీ కేంద్రానివేనని.. బీజేపీదే అధికారమని.. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతున్నదీ బీజేపీనే అని.. ఇలా చెప్పుకుంటూ పోయారే కానీ.. మిగతా బీజేపీ నాయకుల్లా సోము వీర్రాజు నేరుగా జగన్‌రెడ్డిని అటాక్ చేసింది లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక, విజయవాడలో బీజేపీ భారీ బహిరంగ సభ అంటే.. బెజవాడ దద్దరిల్లేలా "జై అమరావతి" నినాదాలు చేస్తారని అనుకున్నారంతా. కానీ, బీజేపీ నేతల నోటినుంచి.. స్పష్టంగా చెప్పాలంటే రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు.. అసలేమాత్రం అమరావతి పేరే ఎత్తకపోవడం.. రాజధాని ఊసే ప్రస్తావించకపోవడం దారుణమైన విషయం అని మండిపడుతున్నారు. అమరావతి సమీపంలో మీటింగ్ పెట్టి.. కీలకమైన రాజధాని టాపిక్ మాట్లాడకపోవడాన్ని అంతా తప్పుబడుతున్నారు. అమిత్‌షా అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా.. సోము వీర్రాజు లాంటి నేతలు మారరా? అమరావతికి అంతఃకరణశుద్ధితో మద్దతు పలకరా? రాజధాని అంశం లేకుండా.. విజయవాడ సభకు ఇక అర్థం ఏముంటుంది? జగన్‌ను దోషిగా నిలబెట్టకుండా.. టీడీపీ, సీపీఐ, సీపీఎంలను టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసం? అంటూ నిలదీస్తున్నారు రాజధాని ప్రజలు. అందుకే, బీజేపీ నైజం తెలిసే.. భారీ బహిరంగ సభ అని ప్రగల్బాలు పలికినా.. జనం ఎవరూ రాలేదని.. వచ్చిన ఆ వందల మంది కూడా బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులేనని పెదవి విరుస్తున్నారు. వైసీపీకి బీజేపీ 'బి' టీమ్ అని.. జగన్-వీర్రాజు-విష్ణువర్థన్‌రెడ్డిలు అంతా ఒకే బ్యాచ్ అని తెలిసే.. ప్రజలు బీజేపీని ఎప్పుడో పక్కనపెట్టేశారని.. అంటున్నారు. అందుకే, జనాదరణ లేక బెజవాడ బీజేపీ సభ వెలవెలపోయిందని చెబుతున్నారు. ముందు బీజేపీ మారాలి.. లేదంటే వీర్రాజు-విష్ణులను మార్చాలి.. అమరావతికి ముక్తకంఠంతో జై కొట్టాలి.. అని జనాలే డిమాండ్ చేస్తున్నారు.