ప్రధాని నోట నరసాపురం లేస్ క్రాఫ్ట్
posted on Dec 29, 2025 8:46AM
ప్రధాని నరేంద్రమోడీ తన మన్ కీ బాత్ కార్యక్రమంలో మరో సారి ఆంధ్రప్రదేశ్ హస్తకళల గురించి ప్రస్తావించారు. ముఖ్యంగా నరసాపురంలోని లేస్ క్రాఫ్ట్ గురించి ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. రెండు శతాబ్దాల చరిత్ర కలిగిన నరసాపురం లేస్ క్రాఫ్ దేశ వ్యాప్తంగా ప్రాముఖ్యత కలిగి ఉందని చెప్పారు. 2000లో నరసాపురం లేస్ పార్క్‌ను ఏర్పాటు చేసినట్లు చెప్పిన ఆయన ఈ కళను సంరక్షించేందుకు, ప్రోత్సహించేందు చొరవ తీసుకున్న డీఆర్‌డీఏ భారతదేశంలోనే తొలి లేస్ పార్క్‌ను నరసాపురంలో అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు.
విశేషమేంటంటే ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఏపీలోని నరసాపురంలో ఆదివారం పర్యటించిన కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. నరసాపురం మండలంలోని పేదవారి లంక గ్రామాన్ని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. తాను దత్తత తీసుకున్న గ్రామంలో ఆమె ఆదివారం పర్యటించారు. ఈ సందర్భంగా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆమె రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తో కలిసి పాల్గొన్నారు. ఆ సందర్భంగా కేంద్రమంత్రి నరసాపురం లేస్ క్రాష్ట్ గురించి ప్రస్తావించి, ప్రశంసించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా తాను దత్తత తీసుకున్న పేదవారి లంక గ్రామంలో పర్యటించిన నిర్మలాసీతారామన్ గ్రామస్థులనుద్దేశించి చేసిన ప్రసంగంలో.. తాను రాష్ట్రానికి కోడలినైనా.. పేదవారి లంక గ్రామానికి మాత్రం కూతురినని చెప్పారు. ఒకప్పుడు ఎలాంటి గుర్తింపూ లేని మారుమూల గ్రామమైన పేదవారి లంక ఈ రోజు దేశంలోనే గ్లోబల్ శిక్షణ కేంద్రంగా గుర్తింపు పొందిందనీ, ముందు ముందు ఏఐ శిక్షణలో దేశంలోనే ఆగ్రగామిగా నిలవనుందని ఆమె అన్నారు. మహిళ ఆర్థిక స్వావలంబన లక్ష్యంగా గ్రామంలో నిర్మించిన చిన్న భవనం ఇప్పుడు పీఎం విశ్వకర్మ యోజన కింద చేపట్టిన ఉపాధి శిక్షణలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. గ్రామంలో 13కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న సముద్ర కోత అడ్డుకట్ట పనుల్ని ఈ సందర్భంగా నిర్మలా సీతారామన్ పరిశీలించారు.