Read more!

పొన్నాల బ్యాక్ ఫైరింగ్

 

ఇల్లలకగానే పండుగకాదన్నట్లు పీసీసీ అధ్యక్ష పదవి చేప్పట్టగానే మిటాయిలు పంచుకోవడం కూడా అంత మంచిది కాదని పొన్నాల లక్ష్మయ్య పరిస్థితి చూస్తే భోధపడుతుంది. పీసీసీ అధ్యక్ష కుర్చీలో ఆయన ఇంకా సరిగ్గా కూర్చోక ముందే టీ-కాంగ్రెస్ నేతలు దాని క్రింద మంటలు బెట్టడంతో ఆయన లబోదిబో మంటూ డిల్లీ పరిగెత్తారు. తీరా చేసి అంతదూరం వెళితే అక్కడ కూడా ఆయనకి అధిష్టానం చేత అక్షింతలు వేయించుకోక తప్పలేదు. కాంగ్రెస్ అధిష్టానం తెరాస కాళ్ళు పట్టుకొనయినా దానితో పొత్తులు పెట్టుకొందామని ఆలోచిస్తుంటే ఆయన ఆ పార్టీతో అసలు పొత్తులవసరమే లేదన్నట్లు మాట్లాడటమే అధిష్టానం ఆగ్రహానికి కారణం. ఒకవైపు తెరాస అధ్యక్షుడు కేసీఆర్ తనను ఎంతగా చ్చీదరించుకొంటున్నా దానిని తుడిచేసుకొని పొన్నాల నేటికీ తాను పొత్తుల విషయంలో తెరాస స్పందన కోసం ఎదురు చూస్తున్నాని, ఈరోజు వచ్చినా చర్చలకు సిద్దమేనని ప్రకటించవలసి రావడం చూస్తే పొన్నాల పరిస్థతికి జాలి కలుగుతుంది.

 

కానీ, తెరాస నేతలు తాము కాంగ్రెస్ పార్టీని వదిలించుకొందామని ఎంతగా ప్రయత్నిస్తున్నా కాంగ్రెస్ తమ వెంటపడటం చూసి చిర్రెత్తిపోతున్నారు. అందుకే తెరాస నేత హరీష్ మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీతో పొత్తులు కధ ఎప్పుడో ముగిసిపోయింది. ఇక దాని గురించి ఆలోచించవలసిన అవసరమే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం మేము తనతో చర్చిస్తున్నట్లు చెప్పుకొంటూ మాతో మైండ్ గేమ్ ఆడాలని ప్రయత్నిస్తోంది. కానీ మేము దాని కుయుక్తులకు లొంగే వాళ్లము కాము.” అని దీటుగా జవాబిచ్చారు.

 

దానితో మళ్ళీ సహనం కోల్పోయిన పొన్నాల, “అసలు తెరాస ఏమిచేసిందని మమ్మల్ని ఆక్షేపిస్తోంది? బాధ్యతగల మంత్రి పదవులలో ఉండి కూడా మేము రెండు నెలల పాటు విధులకు దూరంగా ఉండి మా అధిష్టానంపై తీవ్ర ఒత్తిడి తెచ్చి తెలంగాణా సాధిస్తే, ఫాం హౌస్ లో పడుకొనే కేసీఆర్ అదంతా తన ఘనతేనని చెప్పుకోవడం చాల వింతగా ఉంది. తెలంగాణా ఏర్పాటులో మా కాంగ్రెస్ నేతలందరి కృషి, పోరాటాలు ఉన్నాయి. అనేక లక్షలమంది చేసిన పోరాటాలు, ఉద్యమాలు, వందలాది యువకుల బలిదానాల కారణంగా తెలంగాణా ఏర్పడింది తప్ప కేసీఆర్ వల్ల మాత్రం కాదు. అయినా మా కాంగ్రెస్ యంపీలందరూ పార్లమెంటులో తెలంగాణా కోసం పోరాడుతుంటే అప్పుడు కేసీఆర్ ఎక్కడ పడుకొన్నారు?ఎప్పుడూ ఫాం హౌస్ లో పడుకొనే ఆయనకు బయట లోకంలో ఏమి జరుగుతున్నాయో తెలుసా అసలు? తెలంగాణా మా వల్ల, మా పార్టీ వల్ల, ప్రజా ఉద్యమాల వల్లనే వచ్చింది తప్ప ఆయనొక్కరి వల్లే రాలేదని ప్రజలందరికీ కూడా తెలుసు.” అని కేసీఆర్ మీద నిప్పులు చెరిగారు పొన్నాల.

 

తెరాసతో పొత్తులకు సిద్దమే అంటూ ఈవిధంగా మాట్లాడవలసి రావడం చాలా ఆశ్చర్యంగానే ఉంటుంది ఎవరికయినా. తెరాస నేతలు మూకుమ్మడిగా తమ పీసీసీ అధ్యక్షుడిపై దాడి చేస్తుంటే, టీ-కాంగ్రెస్ నేతల్లో ఒక్కరు కూడా ఆయనకు అండగా వచ్చి నిలబడట్లేదు. ఎందుకంటే ఆయన వల్లనే తమకు ఆ పదవి దక్కకుండా పోయిందనే అక్కసు. ఒకవైపు స్వంతపార్టీ నేతలతో, మరోవైపు తెరాసతో ఒంటరిగా పోరాడుతూనే ఎన్నికల పొత్తుల గురించి కూడా మాట్లాడటానికి గొప్పనేర్పు సహనమే కావలి మరి. పీసీసీ పీటమా మజాకా...