Read more!

కిరణ్ కుమార్ రెడ్డి కనబడుటలేదు

 

రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నన్నాళ్ళు ఒకవెలుగు వెలిగిన కిరణ్ కుమార్ రెడ్డి, తన పదవి నుండి తప్పుకొనే సమయానికి పూర్తిగా తన ప్రాభవం కోల్పోయారు. అయినప్పటికీ ఆవిషయం గ్రహించకుండా ఆయన ‘జై సమైక్యాంధ్ర పార్టీ’ పెట్టుకొని మరోమారు భంగపడ్డారు. అనేక సర్వేలు చేయించుకొని పరిస్థితులు తనకు చాలా అనుకూలంగా ఉన్నాయని నిర్ధారించుకొన్న తరువాతనే పార్టీ పెట్టినా కూడా అసలు బొత్తిగా జనాధారణ లేకుండా పోవడంతో, ఇంతవరకు ఆయనను అంటిపెట్టుకొని ఉన్నవారు కూడా మెల్లగా జారుకొంటుండటంతో అసలు ఆయన పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం మారిందిప్పుడు.

 

ఎన్నికలకు సరిగ్గా నెలరోజులు కూడా లేని ఈ కీలక సమయంలో కూడా ఆయన తనను ఎవరో హైదరాబాద్ దాటి బయటకు వెళ్ళవద్దని ఆదేశించినట్లుగా పూర్తిగా హైదరాబాదుకే పరిమితమయిపోయారు. ఆయన రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ అధిష్టానానికి అన్ని విధాల సహకరించి రాష్ట్రాన్ని బ్రష్టు పట్టించడమే కాకుండా, తన అనాలోచిత, అహంకార పూరిత నిర్ణయాలతో స్వంత రాజకీయ భవిష్యత్తుని, తనను నమ్ముకొన్నవారి భవిష్యత్తుని కూడా సర్వ నాశనం చేసారు.

 

ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన జైసపా జెండా పట్టుకొని ఒంటరిగా ప్రజలలో తిరుగలేరు. అలాగని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వెళ్ళలేరు కూడా. మళ్ళీ ఎన్నికలు పూర్తయ్యి కాంగ్రెస్ పార్టీ రెండు రాష్ట్రాలలో మరియు కేంద్రంలో ఓడిపోయినపుడు, అది కూడా ఆయన పరిస్థితిలోనే ఉంటుంది గనుక అప్పుడు తాపీగా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరుకొని ఒకరినొకరు ఓదార్చుకొంటారేమో! కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర విభజన వ్యవహారంలో అతితెలివి ప్రదర్శించి బోర్లాపడితే, దానికి సహకరించిన ఆయన బయటకు వచ్చి పార్టీ పెట్టి ప్రజలను మభ్యపెట్టాలని ప్రయత్నించి భంగపడ్డారు. ఇది పూర్తిగా వారి స్వయంకృతాపరాధమే గనుక ఆయన, కాంగ్రెస్ పార్టీ వేరెవరినీ నిందించవలసిన పనిలేదు.