Read more!

చరణ్ సినిమాలో బాబాయ్‌కి చురకలు?

 

పైకి కనిపించడుగానీ, రామ్ చరణ్‌లో దూకుడు చాలా ఎక్కువ. మాటకి మాట చెప్పడంలో ఉదాహరణగా దాసరిని ఎదిరించిన ఎపిసోడ్ నిలుస్తుంది. అవసరమైతే రోడ్డు మీదకు వచ్చి దొమ్మీ చేయడానికి కూడా సిద్ధమయ్యే రోషమో, పౌరుషమో చరణ్ ఒంటినిండా వుంది. ఆ విషయం కూడా ఒక సందర్భంలో ప్రూవ్ అయింది. పలు సందర్భాలలో ఎమోషన్‌ని ఆపుకోకుండా చరణ్ తన ఆవేశాన్ని బయటపెట్టుకున్న సందర్భాలూ వున్నాయి. ఇప్పుడు రామ్ చరణ్ దృష్టి తన బాబాయ్ పవన్ కళ్యాణ్ మీద పడ్డట్టుంది. తన తండ్రి చిరంజీవికి తలనొప్పిగా తయారయ్యే వ్యవహారాలన్నీ రామ్ చరణ్ చేస్తూ వుండటం, రాజకీయంగా తన తండ్రికి వ్యతిరేకంగా పనిచేస్తూ వుండటం రామ్ చరణ్‌కి నచ్చనట్టుంది.

 

బాబాయ్ మీద తనకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి రామ్ చరణ్ ప్రస్తుతం తాను నటిస్తున్న ‘గోవిందుడు అందరివాడేలే’ సినిమాని ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. కృష్ణవంశీ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో రామ్ చరణ్ బాబాయి పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. రామ్ చరణ్‌కి, శ్రీకాంత్‌కి మధ్య వచ్చే సన్నివేశాల చిత్రీకరణ ఈమధ్యే జరిగింది. ఈ సందర్భంగా ఈ రెండు కేరెక్టర్ల మధ్య వచ్చే సంభాషణలు ఆసక్తికరంగా వున్నట్టు సమాచారం.

 

ఈ సినిమాలో బాబాయ్, అబ్బాయి కేరెక్టర్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటూ వుంటుందట. దారితప్పిన బాబాయ్‌ మీద అబ్బాయ్ సెటైర్లు వేస్తూ వుంటాడట. ఈ రెండు పాత్రల మధ్య జరిగే సంభాషణ సినిమాలో కథానుసారం వున్నప్పటికీ, ఆ సంభాషణలు, అబ్బాయ్ పాత్రధారి రామ్ చరణ్ వేసే చురకలు డైరెక్ట్ గా రియల్ లైఫ్ బాబాయ్ పవన్ కళ్యాణ్‌కి తగిలేలా వున్నాయని సినీ వర్గాల భోగట్టా.