ఈ నెల 13న పోలింగ్ ... కిక్కిరిసిపోతున్న బస్టాండ్లు
posted on May 11, 2024 @ 10:29AM
ఈ నెల 13న ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, హైదరాబాద్ నుంచి ఆంధ్ర ప్రదేశ్ వాస్తవ్యులు భారీ ఎత్తున సొంత రాష్ట్రం ఏపీకి తరలివస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని స్వగ్రామాలకు, సొంత పట్టణాలకు తరలివస్తున్న వారితో హైదరాబాద్ నుంచి వస్తున్న బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి.
హైదరాబాద్ లో లక్షల సంఖ్యలో ఏపీ ప్రజలు ఉన్నారు. వారందరూ ఏపీలో ఓటు హక్కు కలిగి ఉండడంతో సొంత ఊరి బాటపడుతున్నారు. ఎన్నికలకు మరో రెండ్రోజుల సమయమే ఉండడంతో బస్సులు, రైళ్లలో, సొంత వాహనాల్లో హైదరాబాద్ నుంచి పయనమవుతున్నారు.
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సందర్భంగా టిఎస్‌ఆర్‌టిసి సంస్థ ప్రత్యేక బస్సులు నడుపనుంది. టిఎస్‌ఆర్‌టిసి సంస్థ దాదాపుగా రెండు వేల ప్రత్యేక బస్సులు నడుపనుంది. . హైదరాబాద్‌లో ప్రయాణికులతో బస్టాండులు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి.
ఓటేసేందుకు ఏపీ ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. దీంతో హైదరాబాద్, విజయవాడ బస్టాండ్లు ప్రయాణికుల రద్దీతో సందడిగా మారాయి. అయితే సరిపడా బస్సులు లేక ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. ఏపీలోని ఇతర ప్రాంతాలకు సరిపడా బస్సుల్లేవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఓట్ల పండుగ వచ్చింది. ఐదేళ్లకొకసారి వచ్చే ప్రజాస్వామ్య పండుగలో మేము సైతం భాగస్వామ్యులు కావాలని ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. ఓటేసేందుకు తమ సొంత ఊర్లకు తరలివెళ్తున్నారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఏపీ ప్రజలంతా స్వస్థలాలకు క్యూ కట్టడంతో రైళ్లు, ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో సీట్లన్నీ నిండుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లోని బస్టాండ్‌లలో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు సరిపడా బస్సులు లేకపోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శని, ఆదివారాల్లో పెద్ద సంఖ్యలో తరలివెళ్లనుండటంతో రద్దీ మరింత పెరిగే అవకాశం కన్పిస్తోంది.
స్వగ్రామాలకు వెళ్లేందుకు కొందరు సొంత వాహనాల్లో వెళ్తుంటే, ఇంకొందరు ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, రైళ్లను ఎంచుకుంటున్నారు. దీంతో హైదరాబాద్ నగరమంతా దాదాపుగా ఖాళీ అవుతోంది. పదిరోజుల నుంచే బస్సుల్లో సీట్లన్ని నిండుకున్నాయి. ముందస్తు బుకింగ్‌లు అయిపోవడంతో ప్రత్యమ్నాయ మార్గాలవైపు చూస్తున్నారు. ప్రైవేటు వాహనాల్లో వెళ్దాం అనుకుంటే దొరికిందే అనువుగా ఛార్జీలు అధికంగా పెంచేశారని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న ప్రయాణికులతోపాటు, ఏపీలోనే ఇతర ప్రాంతాలకు వెళ్లే వారితో విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ కిక్కిరిసిపోయింది. ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలకు వెళ్లేందుకు సరిపడా బస్సులు అందుబాటులో లేవని ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు. తక్షణమే ఆర్టీసీ అధికారులు స్పందించి అదనపు బస్సులను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.ఓటింగ్ శాతాన్ని పెంచాలని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘాలు ప్రయత్నిస్తుంటే, ప్రభుత్వ అధికారులు మాత్రం ఆ దిశగా అడుగులు వేయడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓటర్లు ఓటు వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వాలు వారికి రవాణా సదుపాయాలు కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు.