ఓటేస్తామంటే చాలు ప్రయాణం ఫ్రీ..
posted on May 11, 2024 @ 10:44AM
ఎన్నికల పండగ వచ్చింది.. హైదరాబాద్ ఖాళీ అవుతుంది..! ఎప్పుడూ పండగల సమయంలో ఖాళీ అయ్యే హైదరాబాద్ ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఖాళీ అవుతోంది. డిమాండ్ ను దృష్టిలో పెట్టుకొని ప్రైవేట్ బస్సు టికెట్ల ధరలు ఆకాశాన్నంటేస్తున్నాయి. దసరా, దీపావళి, సంక్రాంతి లాంటి పండగలకు పెంచే దానికంటే అధికంగానే ఉన్నాయి టికెట్ ధరలు. ఒక్కో టికెట్ రెండు వేల రూపాయల నుంచి మూడు వేల రూపాయల ధర వసూలు చేస్తున్నారు. దీంతో రాజకీయ పార్టీలు రంగంలోకి దిగాయి. ప్రతి పార్టీ తమకు ఓటు వేసే వారిని ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి మరీ ఆంధ్రకు తరలిస్తున్నాయి. ఓటేస్తామంటే చాలు ప్రయాణం ఫ్రీ.. అంటున్నాయి పార్టీలు.
ఓటర్లను తీసుకువెళ్ళి, ఓట్లు వేయించుకోవడానికి ఆంధ్ర రాజకీయ పార్టీలు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన ఓటర్లు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లో ఉంటున్నారు. అనధికారిక లెక్కల ప్రకారం 25లక్షల నుంచి 35లక్షల మంది ఏపీ స్థానికత కలిగిన ఓటర్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉంటారనే అంచనాలు ఉన్నాయి. వీరు తమ ఓటు వేయడానికి హైదరాబాద్ నుంచి భారీ ఎత్తున ఆంధ్రకు తరలి వెళుతున్నారు. బస్సులు క్రిక్కిరిసి ఉంటున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి రాజధాని కావడంతో హైదరాబాదులో ఏపీ ప్రజలు లక్షల సంఖ్యలో స్థిరపడిపోయారు. ఉద్యోగం కోసం వెళ్ళిన వలస జీవులు కూడా వారిలో ఎందరో ఉన్నారు. సోమవారం ఎన్నికలు. పైగా వీకెండ్ కలిసి వచ్చింది. దీంతో గ్రామాలకి తరలివస్తున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. అంతే కాదు ఈసారి ఎన్నికలను ఓటర్లు కూడా ఎంతో సీరియస్ గా తీసుకున్నారు. కేవలం హైదరాబాద్ నుంచే కాదు ఇటు కర్ణాటక నుంచి ఆంధ్ర కి వచ్చే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అదనపు బస్సులు సమకూర్చినప్పటికీ రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో ప్రయాణికులకు కొంత ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ జిల్లాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 400 సర్వీసుల్ని తెలంగాణ ఆర్టీసీ నడుపుతోంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని వివిధ ప్రాంతాలకు నిత్యం 300 సర్వీసులు నడుస్తున్నాయి. ఈ బస్సుల్లో రిజర్వేషన్లు పూర్తి కావడంతో పాటు ప్రత్యేక బస్సుల్లోనూ టికెట్లు రిజర్వు అవుతున్నాయి. మే 10వ తేదీన 120, 11న 150, 12వ తేదీన 130 ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సుల్ని విశాఖ, అమలాపురం, కాకినాడ, రాజమ హేంద్ర వరం, పోలవరం, కందుకూరు, కనిగిరి, ఉద యగిరి, ఒంగోలు వైపు ఎక్కువగా నడుపుతున్నారు. తిరుగు ప్రయాణంలో 13, 14 తేదీల్లో ఏపీ నుంచి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను అందుబాటులో ఉంచారు. అటు ఏపీఎస్ ఆర్టీసీ కూడా హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు ప్రత్యేక బస్సుల్ని అందుబాటులోకి తీసుకువస్తోంది.
సార్వత్రిక ఎన్నికలు, వేసవి సెలవుల నేపథ్యంలో రైళ్లలో రిజర్వేషన్ జాబితా భారీగా ఉంటోంది. వెయిటింగ్ లిస్ట్ ఉన్న రైళ్లలో ప్రయాణికుల కోసం 22 రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. కొన్ని రైళ్లకు 10-13 తేదీల మధ్య, మరికొన్నింటికి 11- 14 వరకు ఈ సౌకర్యాన్ని కల్పించినట్టు ప్రకటించారు. సికింద్రాబాద్-విశాఖ, కాచిగూడ-గుంటూరు, వికా రాబాద్-గుంటూరు, విశాఖ-గుంటూరు, సికింద్రా బాద్-విజయవాడ, ధర్మవరం-నర్సాపూర్, తిరు పతి-గుంటూరు, హుబ్లీ-నర్సాపూర్, కాచిగూడ- రేపల్లె, బీదర్-మచిలీపట్నం తదితర రైళ్లలో అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నారు. రద్దీకి అనుగుణంగా కోచ్‌లను ఏర్పాటు చేస్తున్నారు.
- ఎం.కె.ఫజల్