సీమాంధ్రలో పోలింగ్ పూర్తి
posted on May 7, 2014 @ 7:59PM
సీమాంధ్ర ప్రాంతంలో పోలింగ్ ముగిసింది. సీమాంధ్రలోని 2 నియోజకవర్గాలలో 4 గంటలకు పోలింగ్ ముగియగా, మరో ఎనిమిది నియోజకవర్గాలకు 5 గంటలకు ముగిసింది. మిగిలిన 165 నియోజకవర్గాలకు సాయత్రం 6 గంటలకు పోలింగ్ ముగిసింది. పోలింగ్ ముగిసిన ఆరుగంటల తర్వాత కూడా సీమాంధ్రలోని దాదాపు అన్ని పోలింగ్ బూత్‌లలో వందలాది మంది ఓటర్లు క్యూలో వున్నారు. క్యూలో నిల్చున్న ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే వరకూ పోలింగ్ కొనసాగుతుంది.
సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా అనేక అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్నాయి. అన్ని అవాంఛనీయ సంఘటనలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయే కారణం కావడం విశేషం. చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వైకాపా కార్యకర్తలు విధ్వంసకాండ సృష్టించారు. జగన్ పోటీ చేసిన పులివెందులలో అయితే మరీ రెచ్చిపోయారు. పోలింగ్ రోజున కూడా ప్రలోభాల పరంపరని కొనసాగించారు. తెలుగుదేశం నాయకుల మీద దాడులు జరిపారు. అనేక చోట్ల రాళ్ళ వర్షం కురిపించారు. కొన్నిచోట్ల పోలింగ్ సిబ్బంది మీద, మరికొన్ని చోట్ల ఓటర్లమీద కూడా దాడులు జరిపారు. చాలా ప్రాంతాల్లో వైసీపీ నాయకుల మీద పోలీసులు కేసులు పెట్టారు.
విశాఖపట్నం జిల్లాలో మావోయిస్టులు ఒక పోలింగ్ కేంద్రం మీద దాడి చేసి రెండు ఈవీఎంలను ఎత్తుకెళ్ళారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తే, ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైనప్పటి నుంచి ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. మధ్యాహ్నం ఎండ బాగా వున్నప్పటికీ క్యూలలో వున్న ఓటర్ల సంఖ్య ఎంతమాత్రం తగ్గలేదు. గుంటూరు, కృష్ణ జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో వర్షం కురిసినప్పటికీ ఓటర్ల సంఖ్య తగ్గలేదు. సాయంత్రం చల్లబడిన తర్వాత క్యూలలో నిల్చున్న ఓటర్ల సంఖ్య మరింత పెరిగింది.
ఈ ఎన్నికలలో 80 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం వుందన్న అభిప్రాయాలను పోలింగ్ ప్రారంభ సమయంలోనే అధికారులు వ్యక్తం చేశారు. వారు ఊహించినట్టుగానే దాదాపు 80 శాతం పోలింగ్ జరిగినట్టు తెలుస్తోంది. ఇంత భారీ స్థాయిలో ఓటింగ్ జరగడం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్నదనేదానికి సూచిక అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.