భారతీయ మహిళా దౌత్యవేత్తకు అమెరికాలో ఘోర అవమానం
posted on Dec 17, 2013 @ 9:00PM
అమెరికాలో భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్ గా పనిచేస్తున్న దేవయాని ఖోబ్రాగాదే పట్ల అమెరికా పోలీసులు నాగరిక సమాజం తలదించుకొనే విధంగా అత్యంత అవమానకరంగా వ్యవహరించారు. భారత దౌత్యవేత్త వంటి అత్యున్నత హోదాలో పనిచేస్తున్న ఆమెను వీసా నిబంధనల ఉల్లంఘన కేసులో డిసెంబర్ 12న అరెస్టు చేసిన న్యూయార్క్ పోలీసులు, ప్రజలందరి సమక్షంలో ఆమె చేతులకు బేడీలు వేసి వ్యభిచారులు, మాదక ద్రవ్యాలు సేవిస్తూ పట్టుబడ్డవారితో కలిపి బందించి తీసుకువెళ్ళడమే కాక ఆమె దుస్తులు కూడా విప్పించి తనిఖీలు చేసారు. ఆమె తను భారత డిప్యూటీ కౌన్సిల్ జనరల్ నని ఎంతగా చెపుతున్నపటికీ న్యూయార్క్ పోలీసులు ఏమాత్రం ఖాతరు చేయకుండా కరడు గట్టిన నేరస్తులను విచారించినట్లుగా ఆమె పట్ల చాలా దారుణంగా వ్యవహరించారని తెలిసింది. ఈ అవమానం సరిపోనట్లు న్యూయార్క్ పోలీసులు ఆమెను నేటికీ జైలులో నిర్భందించి ఉంచారు. ఆమెను తక్షణం బేషరతుగా విడుదల చేసి భారత్ టిరిగి వెళ్లేందుకు అనుమతించాలని భారత ప్రభుత్వం గట్టిగా కోరుతోంది.
తాము పై అధికారుల నుండి వచ్చిన ఆదేశాల మేరకే నడుచుకున్నామని న్యూయార్క్ పోలీస్ అధికారులు చెప్పడం వారి అహంకార ధోరణికి అద్దం పడుతోంది. పై అధికారులు చెపినంత మాత్రాన్నవారి ఇంగిత జ్ఞానం పనిచేయడంలేదని ఎవరూ భావించలేరు. అభివృద్ధి చెందిన గొప్ప నాగరిక దేశమని విర్రవీగే అమెరికాలో విదేశానికి చెందిన ఒక అత్యున్నత దౌత్యాదికారిని గుర్తు పట్టలేని దుస్థితిలో ఉందని కూడా ఎవరూ ఊహించలేరు. ఒకవేళ అక్కడి పోలీసుల కళ్ళు మూసుకుపోయాయనుకొన్నప్పటికీ, ఆమె వారికర్ధంయ్యే బాషలోనే తానొక భారత దౌత్యవేత్త అని చెప్పారు. అయినా వారు ఆమె పట్ల అసభ్యంగా, అమానుషంగా ప్రవర్తించడం వారి అగ్రరాజ్యాహంకారానికి పరాకాష్టగా భావించవలసి ఉంటుంది.
ఈసంఘటనపై భారత్ లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భారత్ లోని అమెరికా రాయభారి నాన్సీ పావెల్ ను పిలిపించుకొని భారత విదేశాంగ శాఖ ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహాన్ని, నిరసనను తెలియజేసింది.
ఈ ఘటనపై తమ నిరసన తెలియజేసేందుకు రాహుల్ గాంధీ, స్పీకర్ మీరా కుమార్, నరేంద్ర మోడీలు ప్రస్తుతం మన దేశంలో పర్యటిస్తున్న అమెరికా చట్టసభ ప్రతినిధులతో జరగవలసిన తమ సమావేశాలను రద్దు చేసుకొన్నారు. మనదేశ విమానాశ్రయాలలో అమెరికా దౌత్యవేత్తలకు కల్పిస్తున్న ప్రత్యేక సౌకర్యాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్దమవుతోంది. ఇటువంటివే మరికొని తీవ్ర చర్యలు చేప్పటి అమెరికాకు తన నిరసన తెలియజేయాలని కేంద్రం భావిస్తోంది.
అయితే ప్రతీసారిలాగే షరా మామూలుగా చేయకూడని అవమానమంతా చేసిన తరువాత అమెరికా ప్రభుత్వం క్షమాపణలు చెప్పవచ్చు. కానీ, అమెరికా మళ్ళీ ఎన్నడూ కూడా ఇటువంటి సాహసం చేయని విధంగా భారత్ తగిన బుద్ధి చెప్పవలసి ఉంది. ఇది కేవలం ఒక భారతీయ మహిళకు జరిగిన అవమానం కాదు. యావత్ మహిళా లోకానికి అమెరికా చేసిన అవమానంగా భావించవలసి ఉంటుంది.