రాజకీయ రోహిణి కార్తె ముందుగానే వచ్చేసింది...?
posted on Jan 26, 2023 6:39AM
శివరాత్రి (ఫిబ్రవరి 18) వచ్చేస్తోంది. శివ శివా అంటూ చలి వెళ్లిపోతుంది. ఇక అక్కడి నుంచి హీట్ పెరిగిపోతుంది. అదే సమయంలో (ఫిబ్రవరి 17) తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు.. అదే రోజున నూతన సచివాలయం ప్రారంభోత్సవం. ఇక అక్కడి నుంచి రాష్ట్రంలో మండే ఎండలకు పోటీగా పొలిటికల్ హీట్ పరుగులు తీస్తుందని అందుకు సంబంధించి సంకేతాలు స్పష్టమవుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ముఖ్యమంత్రి కేసేఆర్ ఆరు నూరయినా, నూరు ఆరైనా.. మూడవ సారి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోవాలని గట్టి పట్టుమీదున్నారు. మరో వంక కేంద్రంలో హ్యాట్రిక్ కోసం ఆరాట పడుతున్న కమల దళం బీజేపీ, రాష్ట్రంలోనూ అధికారాన్ని అందుకునేందుకు అంతే గట్టి ప్రయత్నాలు చేస్తోంది. కేసేఆర్ రాష్ట్రంలో హ్యాట్రిక్ సాధిస్తే, కేంద్రంలో ముచ్చటగా మూడవసారి ప్రధాని పీఠం కోసం నరేంద్ర మోడీ సాగిస్తున్న,హ్యాట్రిక్ యాగానికి బ్రేకులు పడే అవకాశం లేకపోలేదు. అందుకే, కేసేఆర్ అడుగులు జాతీయ రాజకీయాల వైపు పడకుండా అడ్డుకునేందుకు బీజేపీ అగ్రనేతలు మోడీ, అమిత్ షా వ్యుహాలు రచిస్తున్నారు. ఇటు మోడీ షా అటు కేసీఆర్ ఎవరికి వారు వ్యూహ.. ప్రతి వ్యూహాలు రచిస్తూ పొలిటికల్ హీట్‌ను పీక్స్ కు తీసుకుపోతున్నారని విశ్లేషకులు అంటున్నారు.
నిజానికి రాష్ట్రంలో ఇప్పటికే పొలిటికల్ హీట్ సాధారణ ఉష్ణోగ్రతలను దాటేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజకీయ వ్యూహంలో భాగంగా కేంద్రంపై ప్రకటించిన యుద్ధం పతాక స్థాయికి చేరింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి రాష్ట్రంలో ఉనికి లేకుండా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్, గణతంత్ర దినోత్సవాన్ని కూడా రాజకీయ రొంపిలోకి లాగారు. రాజ్యాంగ వ్యవస్థల(గవర్నర్)తోనూ విభేదాలను పెంచుకున్నారు.ఈ విభేదాల కారణంగా, గణతంత్ర దినోత్సవం సైతం రాజకీయ రణతంత్రంగా మారింది. చివరకు గణతంత్ర వేడుకల విషయంలోనూ రాష్ట్ర హై కోర్టు జోక్యం చేసుకోవలసి వచ్చింది. రాజకీయ విభేదాలు రాజ్యాంగ విధులకు అవరోధంగా మారే పరిస్థితి వచ్చిందంటే, రాజకీయ ఉష్ణోగ్రతలు ఏ స్థాయికి చేరుకున్నాయో వేరే చెప్పనక్కర లేదు.
ఈ విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్, బీజేపీతో పోరు విషయంలో ఇక చావో రేవో తేల్చుకునేదుకు సిద్డమయ్యారనే విషయం స్పష్టమైంది. అందుకే ఆయన నిండా మునిగినోనికి చలేంటి అన్న రీతిలో పొలిటికల్ హీట్‌ను మరింత రాజేస్తున్నారు. ఫిబ్రవరిలో కొత్త సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించిన తర్వాత ఏ క్షణమైనా అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికల దిశగా అడుగులు వేసే అవకాశాలను ఒక వైపు పరిశీలిస్తూనే.. ఇంకోవైపు బీజేపీని దీటుగా ఎదుర్కొనేందుకు కేసిఆర్ వ్యూహరచన చేస్తున్నారు. ఇప్పటికే తన ప్రభుత్వం గత తొమ్మిది సంవత్సరాలలో సాధించిన ప్రగతిని, చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు వరుసగా కార్యక్రమాలను నిర్వహిస్తున్న కేసీఆర్.. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలను, బీజేపీ హిందుత్వ రాజకీయాలను, రాహుల్ గాంధీకి దీటుగా ఎండగడుతున్నారు. తగ్గేదే లే అంటూ బీజేపీని టార్గెట్ చేస్తున్నారు.
ఇదలా ఉంటే, ఫిబ్రవరిలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఎన్నికల’ బడ్జెట్ ను ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ క్రతువు ముగిసిన వెంటనే కేసీఆర్ బీఆర్ఎస్ విస్తరణ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారని తెలుస్తోంది. ఫిబ్రవరి 17వ తేదీన కొత్త సచివాలయ భవనాన్ని ప్రారంభించిన తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో లక్షలాది మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ తలపెట్టినట్లు సమాచారం. అంతకు మందే ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్ వస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేపట్టనున్న పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ కార్యక్రమాన్ని రాజకీయంగా కూడా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో భారీ సభ నిర్వహణకు ప్లాన్ చేసింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఈ సభ నిర్వహణకు కమల నాధులు పూనుకున్నారు. ఇక ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఖమ్మంలో నిర్వహించిన తరహాలో, అన్ని జిల్లా కేంద్రాలలో భారీ బహిరణ సభలకు భారాస సిద్డంవుతున్నట్లు తెలుస్తోని. అందుకు కౌంటర్ గా బీజేపీ దండు కూడా తెలంగాణ దండయాత్రకు సిద్దమవుతోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ ఫిబ్రవరిలోనే పొలిటికల్ హీట్ పీక్ కు చేరుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు.