కుక్క పిల్లకు బర్త్ సర్టిఫికేట్..
posted on Jan 26, 2023 7:15AM
పెంపుడు కుక్కలను సొంత కుటుంబ సభ్యులుగా చూసే వారు కోకొల్లలు. తమ పెంపుడు శునకాలకు బర్త్ డే చేసే వాళ్లను చూశాం,పెళ్లిళ్లు, పేరంటాలూ ఘనంగా చేయడమూ తెలుసు, సీమంతం వేడుకలు నిర్వహించి మురిసిపోయిన వారినీ చూశాం. ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క చనిపోయినప్పుడు దానికి శాస్త్రోక్తంగా అంత్యక్రియలు నిర్వహించి, తన ఇంటి ఆవరణలో దాని విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఏటా వర్థంతి నిర్వహించి ఊరంతటికీ భోజనాలు పెడుతున్న కుటుంబం గురించి కూడా విన్నాం.
అయితే పెంపుడు కుక్కుకు పుట్టిన సంతానానికి బర్త్ సర్టిఫికెట్ చేయించి.. తమ కుటుంబంలోకి మరో జీవి వచ్చిందంటూ సంబరాలు చేసుకున్న వ్యక్తి ఉదంతం ఇప్పుడు సామాజిక మాధ్యమంలో తెగ వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి ఎవరు, ఎక్కడి వాడు అన్న సంగతి తెలియకపోయినా.. సదరు వ్యక్తి వ్యక్తి తన పెంపుడు శునకానికి పుట్టిన కుక్క బర్త్ సర్టిఫికెట్ పై ఆ కుక్క చేత వేలి (కాలి) ముద్ర కూడా వేయించాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలూ అంతర్జాలంలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.
మనుషుల మధ్య అనుబంధాలు కరవైపోతున్న రోజులలో.. వయస్సు మళ్లిన తల్లిదండ్రులకు ఓల్ ఏజ్ హోంలే బెటర్ అంటున్న తనయులున్న నేటి సమాజంలో.. పెంపుడు కుక్కను కూడా సొంత కుటుంబ సభ్యులలో ఒకరిగా చూసుకుంటూ.. ఆ కుక్కకు పుట్టిన పిల్లను కుటుంబంలోకి వచ్చిన మరో సభ్యునిగా భావించి సంబరాలు చేసుకోవడమే కాకుండా.. బర్త్ సర్టిఫికేట్ చేయించి ఆ బుల్లి జీవిని కుటుంబంలో ఒకటిగా ప్రకటించిన వ్యక్తిని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. జంతు ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా అభివర్ణిస్తున్నారు.