జగన్ ఓటమి ఒక్కటే మార్గం!
posted on Jan 26, 2023 6:18AM
ఇటీవలి కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం టార్గెట్ గా విమర్శలు, విశ్లేషషణలు చేస్తున్న, మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నంతవరకు, రాజధాని సమస్య పరిష్కాం కాదని, రాజధాని లేని రాష్ట్రం అనే తలవంపులు పోవాలంటే, వచ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించి, జగన్ రెడ్డిని ఇంటికి పంపించడం ఒక్కటే మార్గమని కుండ బద్దలు కొట్టారు.
అమరావతికి చెందిన కొందరు రైతులు కడపలో డీఎల్ ను కలిసారు. ఈ సందర్భంగా ఆయన సుప్రీం కోర్టులోనూ జగన్ రెడ్డి ప్రభుత్వానికి చుక్కెదురైనా, ఆయన అమరావతిని రాజధానిగా అంగీకరింఛక పోవచ్చని డీఎల్ చెప్పారు. నిజానికి అమరావతి అభివృద్ధికి జగన్ రెడ్డి చేయగలిగింది కూడా ఏమీ లేదని, రాష్ట్ర ఖజానా నిండుకున్న నేపధ్యంలో మిగిలిన సంవత్సరం పై చిలుకు కాలంలో కోర్టు ఆదేశాలను అనుసరించి అమరావతిని అభివృద్ధి చేయడం అయ్యే పని కాదని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్రభుత్వం కోణంలో అమరావతి రాజధాని కాకపోయినా.. ప్రజలు మాత్రం అమరావతినే రాజధానిగా భావిస్తున్నారని డీఎల్ చెప్పుకొచ్చారు. అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించి గత ప్రభుత్వ హయాంలో తీసుకున నిర్ణయాలను అమలు చేయాలని రాష్ట్ర హై కోర్టు ఇచ్చిన తీర్పు పై సుప్రీం కోర్టుకు వెళ్ళిన జగన్ రెడ్డి ప్రభుత్వానికి అక్కడా మొట్టికాయలు తప్పవని డీఎల్ జోస్యం చెప్పారు. మంత్రులు అమరావతి గురించి ఇష్టానుసారం మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందని, అప్పుడే రాష్ట్రానికి మంచి రోజులోస్తాయని అమరావతి ఏకైక రాజధానిగా నిలుస్తుందని డీఎల్ చెప్పు కొచ్చారు.
ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీ లో చేరిన డీఎల్ ప్రస్తుతం టీడీపీ వైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టం అవుతోంది. తాజాగా కడప జిల్లాకు చెందిన సీనియర్ నేత వీర శివారెడ్డి తనతో పాటుగా డీఎల్ టీడీపీలో చేరుతున్నారంటూ వెల్లడించారు. అయితే, డీఎల్ కు సంబంధించి సీటు పైన హామీ విషయంలో చర్చలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. డీఎల్ మైదుకూరు నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అక్కడ టీడీపీ అభ్యర్ధిగా సీనియర్ నేత సుధాకర్ యాదవ్ ఉన్నారు. టీడీపీ -జనసేన పొత్తులో భాగంగా సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇప్పట్లో తేలే అవకాశం లేదు. సీటు పైన స్పష్టత వచ్చిన తరువాతనే డీఎల్ టీడీపీలోకి వెళ్తారని తెలుస్తోంది.