జడ్పీ ఛైర్మెన్ రాజీనామా.. వైసీపీలో కలకలం..
posted on Dec 18, 2021 @ 3:58PM
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ముదిరాయి. ఏకంగా జిల్లా పరిషత్ చైర్మెన్ రాజీనామా చేశారు. ఎమ్మెల్యేల మధ్య వర్గ పోరుతో తాను విసిగిపోయానని చెప్పారు. జడ్పీ చైర్మెన్ రాజీనామా చేయడంతో జగన్ పార్టీలో కలకలం రేపుతోంది. కొంత కాలంగా వివాదంగా మారిన కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కథ రాజీనామాతో ముగిసింది. వెంకటసుబ్బారెడ్డి కలెక్టర్ కోటేశ్వరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. వైసీపీలోని బంధుప్రీతికి ఆయన పదవి చేజారి పోయిందని అంటున్నారు. సుబ్బారెడ్డి రాజీనామాతో జడ్పీ చైర్మన్ పదవి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
గతంలో ఎర్రబోతుల వెంకటరెడ్డికి ఛైర్మన్ పదవి ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. కానీ.. కరోనా కారణంగా ఎర్రబోతుల వెంకటరెడ్డి మృతి చెందటంతో ఉపఎన్నికలో ఆయన కుమారుడు పాపిరెడ్డి విజయం సాధించారు. పాపిరెడ్డి కోసమే వైసీపీ అధిష్ఠానం మల్కిరెడ్డి చేత రాజీనామా చేయించినట్లు తెలుస్తోంది. మల్కిరెడ్డి వెంకట సుబ్బారెడ్డితో తక్షణమే రాజీనామా చేయించాలని జిల్లా నాయకులు పట్టుబట్టడటంతో . ఆయన రాజీనామా చేశారు. దీంతో జడ్పీ చైర్మన్‌గా మురిపెం తీరకముందే సుబ్బారెడ్డి పదవికి గండం వచ్చిపడింది.
కర్నూల్ జడ్పీ చైర్మెన్ పగ్గాలు తన అనుచరుడికి ఇప్పించుకోవడానికి ఎమ్మెల్యే కాటసాని చకచకా పావులు కదిపారు. వైసీపీ రీజనల్ కో-ఆర్డినేటర్ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కూడా ఎమ్మెల్యే కాటసానికి మద్దతు ఇచ్చారు. దీంతో సీఎం జగన్ అయినా దయ చూపుతారని మల్కిరెడ్డి ఆశించారు. సీఎంను కలిసేందుకు అమరావతి వెళ్లారు .కానీ ఆయనకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. సీఎం అపాయింట్ మెంట్ లభించకపోవడంతో అవమాన భారంతో మల్కిరెడ్డి కర్నూలుకు తిరిగొచ్చారు. కలెక్టర్ కు రాజీనామా పత్రం సమర్పించారు.
పార్టీ కోసం పని చేసిన తనకు కనీసం ఏడాదైనా చైర్మన్‌గా పార్టీ అవకాశం ఇవ్వలేదని సన్నిహితుల వద్ద సుబ్బారెడ్డి వాపోతున్నారని తెలుస్తోంది. కనీసం ఏడాదైనా పదవిలో ఉంచకుండా నెలన్నరకే మార్చడం ఏమిటని సుబ్బారెడ్డి వర్గం ప్రశ్నింస్తోంది. ఒక్క సర్వ సభ్య సమావేశం జరగక ముందే దేనికి చైర్మన్‌ను ఎలా అత్యవసరంగా మార్చాల్సిన అవసరం ఏంటని పలువురు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేను నమ్మిన పాపానికి మల్కిరెడ్డి ఇపుడు అనుభవిస్తున్నారనే అభిప్రాయం కూడా పార్టీ శ్రేణుల్లో వినిపిస్తోంది. ఈ కొద్ది కాలానికి వేరే వాళ్లను చైర్మన్ పదవిలో కూర్చోబెట్టి ఉంటే నామినేటెడ్ పోస్టుకైనా మల్కిరెడ్డి ప్రయత్నం చేసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. వేరే పదవికీ హామీ ఇవ్వకుండా ఆయన భవిష్యత్తును అంధకారంలో పడేస్తున్నారని మల్కిరెడ్డి అభిమానులు ఆవేదన చెందుతున్నారు.