రోడ్లనూ వదలని జగన్ సర్కారు.. అప్పు కోసం అప్పనంగా...
posted on Oct 8, 2021 9:29AM
ఈ తరం పిల్లలకు తెలియక పోవచ్చును. కానీ, ప్రస్తుతం 50 ప్లస్’లో ఉన్న అందరికీ, ఈ ఆట/పాట తెలిసే ఉంటుంది. నిజానికి, ఇది ఆట కాదు, మనుషుల మనస్తత్వం ఎలా ఉంటుందో చక్కగా చెప్పే చేతివేళ్ల పాఠం. మన చేతి ఐదు వేళ్ళలో మొదటి బొటనవేలు, తిందాం ..తిందాం అంటుంది ... దాని పక్కన ఉన్న చూపుడు వేలు, ఏమి పెట్టి తిందాం అంటుంది .. మధ్య వేలు అప్పు చేసి తిందాం అంటుంది ..ఆ పక్కన ఉన్న ఉంగరం వేలు అప్పెట్ల తీరుద్దాం అంటుంది..చిట్ట చివరి చిటికిన వేలు ..ఇంచక్కా ఎగేసి పోదాం అంటుంది. ఇప్పుడీ కథ ఎందుకంటే, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, ఇదిగో ఇలాంటి అప్పు సూత్రాన్నే పాటిస్తోంది కాబట్టి.
ఏ పూటకు ఆ ఆపూట ఎక్కడో అక్కడ పుట్టిన కాడికి అప్పుచేసి, కాలక్షేపం చేస్తోంది . అందుకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దినదిన ప్రవర్థమానంగా దిగజారి పోతోంది. ఇప్పటికే.. కూచమ్మ కూడా బెడితే మాచమ్మ మాయం చేసింది అన్నట్లుగా, గత తెలుగుదేశం ప్రభుత్వం, అంతకు ముందు ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వాలు కూడ బెట్టిన సంపదను, జగన్ రెడ్డి ప్రభుత్వం శక్తి వంచన లేకుండా, వీలైతే అమ్మడం, కాదంటే కుదువ పెట్టడం ద్వారా ఖర్చు ఖాతాలో చేర్చేసింది. గుళ్ళు గోపురాలు దేవుని భూములు, హుండీలు ఏదీ వదలకుండా అందిన కాడికి పప్పు బెల్లాల పందారం పద్దులో చేర్చింది. ఇక ఇప్పుడు, సర్కార్ వారి చూపు, రోడ్లు భవనాల శాఖ భూముల మీద పడింది. సర్కార్ చూపు పడిన తర్వాత ఇక చెప్పేదేముంది, రాజు తలచుకుంటే దెబ్బలకు, సర్కారు వారు తలచుకుంటే అప్పులకు కొదవేముంటుంది. కాకపొతే, చెప్పిన అబద్ధం చెప్పకుండా, అందమైన అబద్ధాలు చెప్పగలిగితే చాలు, ఇట్టే పనై పోతుంది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వానికి, ఆదేమంత పెద్ద విషయం కాదని రెండున్నరేళ్ళ చరిత్ర చెపుతోంది.
సో.. రోడ్లు భవనాల శాఖపై కన్నుపడిందే తడవుగా, రాష్ట్రంలో రహదారులను అందంగా తీర్చి దిద్దుదామనే, ఓ అందమైన అబద్ధాన్ని అతికించి, ప్రభుత్వం రూ.2000 కోట్ల రుణాన్ని తీసుకురమ్మని ఆంధ్రప్రదేశ్ రోడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఆర్’డీసీ)ని పురమాయించింది.ఇందుకోసంగా, రోడ్లు భవనాల శాఖ వద్ద ఉన్న, అస్తుల్లోంచి రూ.3,786 కోట్ల విలువచేసే ఆస్తులను, ఏపీఆర్’డీసీకి బదలాఇస్తూ జగన్ రెడ్డి ప్రభుత్వం జీవో 46 జారీ చేసింది. అంటే, రూ.3,786 విలువచేసే రోడ్లు భవనాల శాఖ ఆస్తులను కుదువ పెట్టి రూ.2000కోట్లు రుణం సంపాదించే బాధ్యతను, ఏపీ-ఆర్డీసీకి ప్రభుత్వం అప్పగించింది. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏమంటే, ఇదే కారణం (రాష్ట్ర రోడ్లను అందంగా తీర్చి దిద్దిడం) చూపి ప్రభుత్వం ఇప్పటికీ అప్పులు చేసినట్లు అధికార వర్గాల సమాచరం.
అదలా ఉంటే, ఏపీ రోడ్ల అభివృద్ధి కార్పొరేషన్ ఇప్పటికే ఆరు వేల కోట్ల రూపాయల అప్పుల్లో కూరుకుపోయింది. అది తీర్చే మార్గం లేక, దిక్కులు చూస్తోంది. ఈ నేపధ్యంలోనే ఏపీ - ఆర్డీసీ అదనపు ఆదాయం సమకూర్చుకునేందుకు, రాష్ట్ర మంత్రి వర్గం ఇటీవల, ఏపీ- ఆర్డీసీకి రాష్ట్ర రహదారులపై టోల్ వసూలుకు అధికారం ఇచ్చింది. అలాగే, ఖాళీ స్థలాలు లీజుకు ఇవ్వడం, రోడ్ సైడ్ హోర్దింగులను అనుమతించడం వంటివి అదనపు ఆదాయ మార్గాలుగా గుర్తించారు. ఆ ప్రయత్నాలు అలా జరుగుతుండగానే, ఇప్పుడు ఈ కొత్త అప్పు పుట్టుకొచ్చింది. ఇలా.. ఒక్కొక్క సంస్థ ఆస్తులు అప్పుల పద్దులో చేరిపొతే చివరకు.. వడ్డీలతో కలిపి తడిసి మోపెడయ్యే అప్పులు తీర్చేది ఎలా అంటే.. ఎగేసి పోదాం అన్న చిటికిన వేలి సమాధానమే సర్కారు వారి సమాధానంగా ఉంది.