వల్లభనేని వంశీ అరెస్ట్ రూమర్ల వెనుక పోలీసుల హైడ్రామా!?
posted on Aug 5, 2024 6:28AM
ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం వైసీపీ నేత వల్లభనేని వంశీ పేరు మారుమోగుతోంది. వైసీపీ నేతలు, కార్యకర్తలు వంశీ పేరును రోజూ తలుచుకుంటారో లేదోకానీ... తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు గంట గంటకు తలచుకుంటున్నారు. వంశీ ఎప్పుడు అరెస్టు అవుతారు?.. చేసిన తప్పులకు శిక్ష ఎప్పుడు అనుభవిస్తాడా అని చూస్తున్నారు.
తెలుగుదేశం శ్రేణులు ఇంతలా వంశీపై ఆగ్రహంతో ఉండటానికి ప్రధాన కారణమే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ పై కొందరు నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. హద్దులు దాటి అసభ్యకర పదజాలంతో దూషించారు. వీరిలో కొడాలి నాని, ఆర్కే రోజా, పేర్ని నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీలు ఉన్నారు. కొడాలి నాని, ఆర్కే రోజా, వల్లభనేని వంశీ ముగ్గురూ తెలుగుదేశం నుంచి వైసీపీకిలోకి వెళ్లిన వారే. అధికార మదంతో చంద్రబాబుపై ఇష్టారీతిలో వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో అవమానించారు. ఇక వల్లభనేని వంశీ ఏకంగా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిపైనే నోరు పారేసుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులే కాదు.. ఏపీ ప్రజలు మొత్తం వంశీపై ఆగ్రహంతో ఉన్నారు. అంతేకాదు.. కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ ప్రమేయం కూడా ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ దాడి కేసుకు సంబంధించి పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో కార్యాలయంపై దాడిలో ప్రమేయం ఉన్నవంశీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దర్యాఫ్తు ముమ్మరం చేశారు. వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ప్రధాన అనుచరుడు యూసుఫ్ పఠాన్ ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో యూసుఫ్ ది కీలక పాత్ర ఉందని పోలీసులు గుర్తించారు. ఇక ఇదే కేసులో వంశీ మరో అనుచరుడు రమేశ్ ను అంతకు ముందే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కార్యాలయం పై దాడికేసులో వల్లభనేని వంశీ పైన కేసు నమోదు కావడంతో అతనికోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు. వంశీ అమెరికా పారిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఆయన హైదరాబాద్ లోనే ఉంటున్నారని కొందరు తెలుగుదేశం నేతలు చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం వల్లభనేని వంశీని గన్నవరంలోని ఆయన నివాసం వద్దే అరెస్ట్ చేశారనే వార్తలు గుప్పుమన్నాయి. పోలీసులు వంశీని అరెస్ట్ చేసి గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించినట్లు కొన్ని మీడియా సంస్థల్లో వార్తలు వచ్చాయి. అయితే, కొద్దిసేపటికి అరెస్ట చేసింది వంశీని కాదు.. ఆయన ప్రధాన అనుచరుడిని పోలీసులు తెలిపారు. వంశీని అరెస్టు చేసినట్లు వార్తలు రావడం పెద్దకథే నడిచినట్లు తెలుస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడికేసులో విచారణ వేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే 20 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో వంశీ ఏ71వ నిందితుడుగా ఉన్నాడు. చాలా మంది పరారీలో ఉన్నారు. వాళ్లు పరారవ్వడానికి కొంత మంది వైసీపీ భక్త పోలీసులే కారణమని తెలుస్తోంది. రాబోయే రోజుల్లో కేసులు చాలా సీరియస్ అవుతాయి.. మీరు పారిపోండి అంటూ ముందుగానే వైసీపీ భక్త పోలీసులు నిందితులకు సూచించినట్లు విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వంశీ పరారీలో ఉన్నారు. ఆయన చివరిసారిగా ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు కనిపించారు. ఓట్ల లెక్కింపు రోజు మూడు నాలుగు రౌండ్లలోనే టీడీపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని అర్థమవ్వడంతో.. కౌంటింగ్ కేంద్రం నుంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ వెళ్లిపోవటం కనిపించింది. ఆ తరువాత వల్లభనేని నేరుగా అమెరికాలోని డల్లాస్ వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే, ఇప్పుడు తీరిగ్గా లుక్ అవుట్ నోటీసులు జారీ చేస్తున్నామని పోలీసులు చెబుతుండటం తెలుగుదేశం శ్రేణులను విస్మయానికి గురిచేస్తోంది.
వైసీపీ హయాంలో చంద్రబాబు నాయుడుపైన వైసీపీ కార్యకర్తలు అంగళ్ళలో దాడి చేశారు. అయినా, పోలీసులు చంద్రబాబు నాయుడుపైన, టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు. అప్పుడు అన్నమయ్య జిల్లా ఎస్పీ గంగాధర్ రావు ఉన్నారు. ఆయన ప్రమేయంతోనే స్థానిక పోలీసులు చంద్రబాబు, తెలుగుదేశం నేతలపై కేసులు నమోదు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అలాంటి ఎస్పీలను పక్కన పెట్టకుండా చంద్రబాబు పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ క్రమంలో గంగాధర్ రావును కృష్ణా జిల్లా ఎస్పీగా ప్రభుత్వం నియమించింది. గంగాధర్ రావును కృష్ణా జిల్లాకు పంపించడంపట్ల తెలుగుదేశం నేతలు విస్మయం వ్యక్తం చేశారు. ప్రస్తుతం గన్నవరం తెలుగుదేశం కార్యాలయం దగ్దం కేసులో వల్లభనేని అనుచరులు పారిపోవడానికి ఎస్పీ గంగాధర్ రావు ప్రధాన కారణమని తెలుగుదేశం నేతలు భావిస్తున్నారు. వంశీని సైతం ముందస్తుగా విదేశాలకు పంపించింది కూడా కొందరు వైసీపీ భక్త పోలీసులేనని విమర్శలు ఉన్నాయి. కార్యాలయంపై దాడి కేసులో నిందితులు ఎక్కడ ఉన్నారనే సమాచారం ఉన్నా పోలీసులు వారిని అరెస్టు చేయడం లేదని, ఇంకా వైసీపీకి అనుకూలంగానే పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలుగుదేశం శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ క్రమంలో వారి ఆగ్రహాన్ని చల్లార్చేందుకు అన్నట్లుగా ఒకరిద్దరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. వంశీని అరెస్టు చేశామని మీడియాకు లీకులు వెళ్లడానికికూడా పోలీసులే కారణంగా తెలుస్తోంది. తద్వారా గన్నవరం కార్యాలయంపై దాడికేసులో నిందితులను అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా కృషిచేస్తున్నారని ప్రభుత్వాన్ని, ప్రజలను నమ్మించేందుకు కొందరు వైసీపీ భక్త పోలీసులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్న అనుమానాలు తెలుగుదేశం శ్రేణులు వ్యక్తం చేస్తున్నాయి. మొత్తానికి వైసీపీ భక్త పోలీసులు వల్లభనేని వంశీ అరెస్టు కాకుండా చూడడంకోసం తెరవెనుక పెద్ద డ్రామానే నడుపుతున్నారని ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతుంది.