కర్నాటక మాజీ సీఎం యెడ్యూరప్పపై పోక్సో కేసు
posted on Mar 15, 2024 @ 12:10PM
సరిగ్గా సార్వత్రిక ఎన్నికల ముంగిట బీజేపీకి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నాయకుడు, కర్నాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ ఎడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తన సహాయం కోరి వచ్చిన ఓ 17 ఏళ్ల బాలికపై యోడ్యూరప్ప లైంగిక వేధింపులకు పాల్పడ్డారంటూ బెంగళూరు పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది. ఈ కేసులో నేరం రుజువైతే యెడ్యూరప్పకు మూడేళ్లకు పైనే జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఎన్నికల ముంగిట యెడ్యూరప్పపై పోస్కో చట్టం కింద కేసు నమోదు కావడం సంచలనం సృష్టించింది.
కర్నాటకలో బీజేపీ బలోపేతం అవ్వడం వెనుక యెడ్యూరప్ప కృషి ఉందనడంలో సందేహం లేదు. ఎలా చూసినా దక్షిణాది రాష్ట్రాలలో బీజేపీ బలంగా ఉన్న రాష్ట్రం కర్నాటక మాత్రమే. యెడ్యూరప్ప 2008-11 మధ్య కాలంలో కర్నాటక సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో ఆయనపై, ఆయన కుటుంబ సభ్యులపై పలు అవినీతి ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత కూడా 2018లో ఆయన కొద్ది కాలం కర్నాటక సీఎంగా పని చేశారు. తరువాత 2019లో మరోసారి యెడ్యూరప్ప సీఎంగా పని చేశారు. అయితే 2021లో బీజేపీ హై కమాండ్ యెడ్యూరప్పను తొలగించి ఆయన స్థానంలో బసవరాజ్ బొమ్మైని సీఎంగా చేసింది.
ఇక గత ఏడాది జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలోనే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కర్నాటక బలంగా పుంజుకుని అత్యధిక స్థానాలు సాధించాలన్న పట్టుదలతో ఉంది. ఇటువంటి తరుణంలో యెడ్యూరప్పపై లైంగిక వేధింపుల కేసు నమోదు కావడం సంచలనంగా మారింది.
యెడ్యూరప్పపై నమోదైన ఎఫ్ఐఆర్ మేరకు ఒక చీటింగ్ కేసులో యెడ్యూరప్ప సహాయం కోరుతూ ఒక మహిళ తన 17 ఏళ్ల కుమార్తెతో ఆయన వద్దకు వెళ్లింది. ఆ సందర్భంగా యెడ్యూరప్ప ఆ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఇలా ఉండగా తనపై పోస్కో కేసు నమోదుపై యెడ్యూరప్ప ఇప్పటి వరకూ స్పందించలేదు. బీజేపీ వర్గాలు మాత్రం దీనిని పొలిటికల్లీ మోటివేటెడ్ మూవ్ గా ఆరోపిస్తున్నారు. రానున్న లోక్ సభ ఎన్నికలలో ఈ కేసు ప్రభావం కచ్చితంగా కమలం పార్టీమీద పడుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.