పీఎంజేజేబీవై కరోనాకు వర్తిస్తుంది ..
posted on May 28, 2021 @ 5:58PM
ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహామ్మారి ఇప్పట్లో వదిలేలా లేదు. ఈ ప్రాణాంతక మహామ్మారి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుందని, శాస్త్ర వేత్తలు,నిపుణులు చెపుతున్నారు. నిజానికి, కొవిడ్ ఎవరిని ఎప్పుడు కాటేస్తుందో, ఏ కుటుంబం ఎప్పుడు ఎలా దిక్కులేని దీనావస్థకు చేరుతుందో, ఊహకు కూడా అందని విషయం. ఈ పరిస్థితిలో ఎవరికి ఏమైనా వారి మీద అధారపడిన వారికి ఒకింత ఆసరాగ నిలిచేది బీమా. ఇందులోనూ. అందరికి అందుబాటులో ఉండేవి, ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై), ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం (పీఎంజేజేబీవై). కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఈ పాలసీలను తీసుకున్న వ్యక్తులు మరణిస్తే.. బీమా పరిహారం నామినీకి అందుతుంది. నిజానికి, ఈ బీమా పథకాలు కొవిడ్ కోసం తెచ్చిన పథకాలు కాదు. సామాన్య పరిస్థితులలో ప్రమాద వశాత్తు మరణించే పేద ప్రజల కుటుంబాలకు భరోసా కలిపించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లోనే ఈ బీమా యోజన తీసుకొచ్చింది. అయితే, ఇంతవరకు ఈ పథకాలు కొవిడ్ మరణాలకు వర్తిస్తాయా లేదా అన్న అనుమనాలున్నాయి. గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-70 ఏళ్ల వ్యక్తులు ఎవరైనా ఈ పాలసీలని తీసుకోవచ్చు. కేవలం సంవత్సరానికి ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన (పీఎంఎస్‌బీవై)వార్షిక ప్రీమియుం కేవలం రూ.12 మాత్రమే, ప్రమాదంలో పాలసీదారుడు మరణిస్తే రూ.2లక్షలు, శాశ్వత వైకల్యం ఏర్పడితే రూ.లక్ష చెల్లిస్తారు. కొవిడ్ మరణాలకూ ఈ పాలసీకి సంబంధం లేదు.
ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా పథకం (పీఎంజేజేబీవై), వార్షిక ప్రీమియం రూ.330. ఆదాయంతో నిమిత్తం లేకుండా గుర్తింపు పొందిన బ్యాంకుల్లో పొదుపు ఖాతా ఉన్న 18-50 ఏళ్ల లోపు వ్యక్తులు ఎవరైనా దీనికి అర్హులు. ఒక వ్యక్తికి ఎన్ని ఖాతాలున్నా.. పాలసీ ఒకటే ఇస్తారు. ఇది ఏటా జూన్ 1 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పథకంలో కొత్తగా చేరితే.. నమోదు చేసిన 45 రోజుల తర్వాత మాత్రమే బీమా వర్తిస్తుంది. ఈ పాలసీ తీసుకున్న పాలసీదారుదారులు ఏ కారణంతో మరణించినా.. రూ.2లక్షల బీమా పరిహారం అందుతుంది. హత్య, ఆత్మహత్యలకూ ఇది వర్తిస్తుంది. కాబట్టి, కొవిడ్-19 కారణంగా మరణించిన వారికీ ఈ బీమా పాలసీ రూ.2లక్షల పరిహారం చెల్లిస్తుంది. పాలసీదారు చనిపోయిన 30 రోజుల్లోగా వారి నామినీలు సంబందిత బ్యాంకు శాఖను సప్రదిస్తే, బ్యాంకు ఆ క్లెయిం ఫారాన్ని సంబంధింత బీమా కంపెనీకి పంపిస్తుంది. కొవిడ్-19 కారణంగా చనిపోయిన వారి క్లెయింలను బీమా సంస్థలు వేగంగా పరిష్కరిస్తున్నాయి.