బుధవారం కేంద్ర కేబినెట్ విస్తరణ! తెలుగువారికి ఛాన్స్ దక్కేనా..?
posted on Jul 6, 2021 @ 4:07PM
కొంత కాలంగా ప్రచారం జరుగుతున్నకేంద్ర మంత్రి మండలి విస్తరణకు ముహుర్తం ఖరారైంది. బుధవారం సాయంత్రం తన మంత్రివర్గాన్ని విస్తరించబోతున్నారు ప్రధాని నరేంద్ర మోడీ. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్రపతి కార్యాలయానికి పీఎంవో నుంచి సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది. మంత్రివర్గంలో మార్పులు చేర్పులపై ఇప్పటికే ప్రధాని మోడీ పూర్తిస్థాయిలో కసరత్తు చేసినట్టు సమాచారం.
మోడీ నేతృత్వంలో రెండోసారి కొలువుదీరిన ఎన్డీయే రెండేళ్ల పాలన పూర్తి చేసుకుంది. సాధారణ ఎన్నికలకు మరో మూడేళ్లు గడువు ఉంది. ఈనేపథ్యంలో మరింత మెరుగైన పాలనకు వీలుగా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ప్రధాని భావిస్తున్నారు. శని, ఆదివారాల్లో ప్రధాని మోదీ హోంమంత్రి అమిత్‌షా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.ఎల్.సంతోష్‌లతో చర్చించి విస్తరణ కసరత్తు పూర్తి చేసినట్టు సమాచారం. ప్రస్తుతం ప్రధాని సహా మొత్తంగా 54 మందితో కేబినెట్ ఉంది. ఇంకా 34 మంత్రివర్గ ఖాళీలు ఉన్నాయి. దీంతో తన మంత్రి మండలిలో మరో 25 మందిని చేర్చుకోనున్నట్టు బీజేపీ వర్గాల్లో టాక్. ఇప్పటికే స్వతంత్ర హోదా, సహాయ మంత్రి పదవి నిర్వహిస్తున్న మంత్రుల్లో ఒకరిద్దరికి కేబినెట్ ర్యాంకు దక్కే అవకాశం ఉంది. ప్రస్తుతం కేబినెట్ ఖాళీలు చాలా ఉండటంతో కొందరు మంత్రులు మూడు, నాలుగు శాఖలు చూస్తున్నారు. ఇప్పుడున్న వారిలో అదనపు బాధ్యతలు మోస్తున్న సీనియర్ మంత్రుల నుంచి అదనపు శాఖలు తప్పించనున్నట్టు సమాచారం.
రాబోయే ఎన్నికలపై ఫోకస్ చేస్తూ విస్తరణ ఉండే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్ శాసన సభకు వచ్చే ఏడాది మార్చిలో ఎన్నికలు రానున్నాయి. ఆ రాష్ట్రంలో ఇటీవలి కాలంలో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువవుతోందన్న ఆందోళన బీజేపీలో నెలకొంది. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి కనీసం ముగ్గురిని, గరిష్టంగా ఐదుగురిని మంత్రిమండలిలో చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మిత్ర పక్షమైన అప్నాదళ్ నుంచి ఆ పార్టీ చీఫ్ అనుప్రియా పటేల్‌కు, లోక్‌జనశక్తి పార్టీలకు చెరో మంత్రి పదవి కేటాయించే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్ నుంచి ఇద్దరికి చోటు దక్కనుంది.
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ ఈసారి కేబినెట్ లో చేరబోతోంది. అయితే తమకు నాలుగు మంత్రి పదవులు ఇవ్వాలని నితీశ్ కుమార్.. ప్రధాని మోడీని కోరుతున్నట్లు సమాచారం. మంత్రివర్గంలో మార్పులు, చేర్పుల్లో భాగంగా పదవులు దక్కే అవకాశం ఉన్నవారి జాబితాలో జ్యోతిరాదిత్య సింథియా, సర్బానంద సోనోవాల్, నారాయణ్ రాణే, పశుపతి పరస్, అనుప్రియ పటేల్, పంకజ్ చౌదరి, రీటా బహుగుణ జోషీ, రామ్‌శంకర్ కథేరియా, వరుణ్ గాంధీ, ఆర్‌సీపీ సింగ్, లల్లన్ సింగ్, రాహుల్ కశ్వన్, సీపీ జోషీ ఉన్నారు. వీరిలో జ్యోతిరాదిత్య సింథియా, రామ్‌శంకర్ కథేరియా, నారాయణ్ రాణేకు పిలుపు రావడంతో ఢిల్లీకి పయనమయ్యారు. మిగిలినవారు ఢిల్లీలోనే ఉన్నారు.
2023లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి మరొకరికి ప్రాతినిధ్యం దక్కే అవకాశం ఉందంటున్నారు. ఏపీ నుంచి బీజేపీకి లోక్‌సభ సభ్యులు ఎవరూ లేరు. రాజ్యసభకు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జీవీఎల్ నరసింహారావు తెలుగువారైనా యూపీ నుంచి పాతినిధ్యం వహిస్తున్నారు. సురేష్ ప్రభు, సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ ఉన్నారు. వీరిలో జీవీఎల్ కు మంత్రి పదవి దక్కకపోతే.. టీడీపీ నుంచి బీజేపీలోకి అడుపెట్టిన ఒకరికి కచ్చితంగా మంత్రి పదవి వస్తుందని ప్రచారం జరుగుతోంది.