స్కూల్స్ తెరిస్తే.. తిప్పలు తప్పవు..
posted on Jul 6, 2021 @ 4:24PM
ఓ వంక కరోనా మూడవ వేవ్ ముందుగానే వచ్చేస్తుందని, అనుకున్న విధంగా, నవంబర్ వరకు ఆగదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరో వంక ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా దేశంలో చాలా రాష్రాధంలు లాక్డౌన్ పూర్తి స్థాయిలో ఎత్తేస్తున్నాయి. ఇప్పటికే అనేక రాష్ట్రాలు, ఆ దిశగా అడుగులు చేశాయి. షాపింగ్ మాల్స్, సినిమా హాల్స్ ఇతర వ్యాపార కార్యకలాపాలపై దేశ రాజధాని ఢిల్లీ సహా కొన్నిరాష్ట్రాల్లో ఆంక్షలు చాలా వరకు సడలించారు. మరోవంక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్కూల్స్, కాలేజీలు, విద్యాసంస్థలను తెరిచే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది మార్చి 24 నుంచి దేశవ్యాప్తంగా విద్యాసంస్థలు బంద్ అయ్యాయి. అయితే గత ఏడాది అక్టోబర్‌లో అన్‌లాక్ ప్రక్రియ మొదలైన నేపధ్యంలో కొన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు తెరిచినప్పటికీ, ఆ తరువాత కరోనా వ్యాప్తి కారణంగా తిరిగి మూతపడ్డాయి. అనంతరం సెకెండ్ వేవ్ కారణంగా విద్యాసంస్థలు మరోమారు మూతపడ్డాయి. అయితే ఇప్పుడు స్కూళ్లు తెరిచే విషయమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. బీహార్‌లో విద్యాసంస్థలను 50 శాతం విద్యార్థుల సామర్థ్యంతో తిరిగి ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో, తెలంగాణలో ఆన్‌లైన్ తరగతులు ప్రారంభమయ్యాయి. తెలంగాణలో , ప్రైవేటు, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాల వత్తిడి మేరకు ఎనిమిది, తొమ్మిది, పదో తరగతి విధ్యార్ధులకు రెగ్యులర్ తరగతులు నిర్వహించాలని ప్రభుత్వం భావించినా విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. అలాగే, డిగ్రీ పరీక్షల విషయంలోనూ వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యర్ధులు సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించారు.
ఆంధ్ర ప్రదేశ్’లో అయితే, పరిస్థితి పూర్తి అగమ్యగోచరంగా వుంది. కోర్టులకు వెళ్ళకుండా ఏ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపలేని స్థితిలో ఉంది. ఇంటర్ పరీక్షల విషయంలో సుప్రీం కోర్టు చీవాట్లు పెడితేనే గానీ, రద్దు చేయలేదు. ఇక స్కూల్స్, కాలేజీల ఓపెనింగ్ విషయంలో ఏం చేస్తుందో చూడవలసి ఉంది.ఇప్పటికైతే ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదు.
గుజరాత్’ లో రాష్ట్రమంత్రి వర్గం భేటీలో విద్యాసంస్థలు తెరవడంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. ఇక ఢిల్లీ విషయానికొస్తే మూడంచెల విధానంలో విద్యాసంస్థలను తెరవనున్నారు. మూడవ దశలో విద్యార్థులు నేరుగా పాఠశాలలకు వెళ్లే ప్రక్రియ ప్రారంభం కానుంది. రాజస్థాన్‌లో స్కూళ్లు తెరిచినప్పటికీ, విద్యార్థులను తరగతులను హాజరయ్యేందుకు ఇంకా అనుమతించడం లేదు. ప్రస్తుతానికి ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు.మొత్తానికి కరోనా దేశ వ్యాప్తంగా విద్య వ్యవస్థను చిన్నాభిన్నం చేసింది . అందుకే, పరిస్థిటి మరింతగా దిగజారి పోకముందే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కేంద్ర ప్రభుత్వం నిర్దిష్ట మార్గదర్శకాలను విడుదల చేయాలని నిపుణులు, తల్లి తండ్రులు సూచిస్తున్నారు.ముఖ్యంగా థర్డ్ వేవ్ పిల్లలపై ప్రభావం చూపుతుందని కొందరు శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్న నేపధ్యంలో, సెకండ్ వేవ్ విషయంలో చేసిన తప్పులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.