క్రౌడ్ ఫండింగ్ తో ప్రజా సమస్యల పరిష్కారం!
posted on Jun 20, 2024 @ 2:07PM
ఆంధ్రప్రదేశ్ లో అరాచక సర్కార్ కుప్పకూలింది. తెలుగుదేశం ప్రభుత్వం కొలువుదీరింది. ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలతో ముందుగు సాగుతున్నారు. మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బార్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకుని సాధ్యమైనంత వరకూ వాటిని అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.
ఇక ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తనదైన శైలిలో నియోజకవర్గంలో తిష్ట వేసి ఉన్న సమస్యల పరిష్కారానికి చర్యలు ప్రారంభించారు. నరసాపురం ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం రఘురామకృష్ణం రాజు ప్రజా సమస్యలపై, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తిన పాపానికి సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గానికి సేవలందించే విషయంలో తనదైన ముద్ర వేస్తున్నారు.
గతంలో నారాచంద్రబాబునాయుడు ప్రజాభాగస్వామ్యంతో సమస్యలు పరిష్కారం అయ్యేలా జన్మభూమి కార్యక్రమాన్ని అమలు చేశారు. ఆ కార్యక్రమం ద్వారా గ్రామాలలో రోడ్లు, పూడికతీత వంటి ఎన్నో పనులు విజయవంతంగా పూర్తి చేయగలిగారు. ప్రజలు 30శాతం నిధులు భరిస్తే మిగిలినది ప్రభుత్వం ఇచ్చి పనులను వేగవంతంగా పూర్తి చేయడమే జన్మభూమి కార్యక్రమం. ఇప్పుడు తన నియోజకవర్గంలో సమస్యల పరిష్కారానికి రఘురామకృష్ణం రాజు క్రౌడ్ ఫండింగ్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అంటే గ్రామాలలో ప్రజాసమస్యల పరిష్కారానికి అవసరమయ్యే నిధులను క్రౌడ్ ఫండింగ్ ద్వారా అంటే నిధుల సమీకరణ ద్వారా సేకరిస్తారు. అలా వచ్చిన నిధులతో పనులు పూర్తి చేస్తారు. ఉండి నియోజకవర్గంలో ప్రభుత్వ సహకారం అవసరంలేని పనులను ఈ క్రౌడ్ ఫండింగ్ ద్వారా సేకరించిన నిధులతో పూర్తి చేస్తారు. ఇప్పటికే ఉండి నియోజకవర్గంలో ఇందుకు సంబంధించిన కార్యాచరణను ప్రారంభించేశారు. ఎమ్మెల్యే రఘురామకృష్ణం రాజు తన వంతుగా ముందుగా ఐదు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చారు. ఇప్పటి వరకూ నియోజకవర్గంలో సమస్యల పరిష్కారం కోసం రైజ్ చేసిన ఫండ్ కోటి రూపాయల వరకూ చేరిందని చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విధానాన్ని అవలంబిస్తే రాష్ట్రంలో సమస్యలు చాలా వరకూ పరిష్కారం అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.