తాడిపత్రి లోకి ప్రవేశించిన పెద్దారెడ్డి
posted on Sep 6, 2025 @ 12:26PM
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోలీసు రక్షణ మధ్య శనివారం (సెప్టెంబర్ 6) తాడిపత్రికి చేరుకున్నారు. తాడిపత్రిలో తన భద్రతకు అయ్యే వ్యయం తానే భరిస్తానని పెద్దారెడ్డి దేశ సర్వోన్నత న్యాయస్థానానికి హామీ ఇచ్చి మరీ తాడిపత్రి ఎంటీకి అనుమతి పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మూడు వందల పోలీసులల భద్రతతో ఆయన తాడిపత్రిలో ఎంటర్ అయ్యారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో తాడిపత్రిలో పెద్దారెడ్డి , ఆయన అనచరులు చేసిన దాడులు, దౌర్జన్యాల కారణంగా తీవ్ర ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్నారు. ఆ కారణంగానే ఎన్నికలలో పరాజయం తరువాత ఆయన తాడిపత్రిలోకి అడుగుపెట్టే అవకాశం కూడా లేకపోయింది. ఎన్నికలలో ఓటమి తరువాత ఓ సారి రహస్యంగా తాడిపత్రిలో అడుగుపెట్టినప్పటికీ, వెంటనే పోలీసులు ఆయనను బయటకు తీసుకువెళ్లారు. ఆ తరువాత ఆయన ఎన్నిసార్లు ప్రయత్నించినా తాడిపత్రిలో మాత్రం అడుగుపెట్టలేకపోయారు. భద్రతా కారణాల దృష్ట్యా పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి హైకోర్టు కూడా అనుమతి నిరాకరించడంతో ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. ఆయన పిటిషన్ విచారణ సందర్భంగా పోలీసులు భద్రతా సమస్యలు అని చెప్పడంతో.. తన భద్రతకు అయ్యే వ్యయం అంతా తానే భరిస్తానని పెద్దారెడ్డి సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీకి అనుమతి ఇచ్చింది. దీంతో దాదాపు 15 నెలల తరువాత మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో అడుగు పెట్టగలిగారు.
ఈ 15 నెలలలో జరిగినదేమిటన్నది ఒక్కసారి చూస్తే.. పంతాలు పట్టింపులు ఎంత కష్టనష్టాలు కలిగిస్తాయో తాడిపత్రి ఘటన చూస్తున్నాం.ఇటీవల మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జెసి ప్రభాకర్ రెడ్డి అడ్డుకున్నారు. ఆ ఇరు కుటుంబాల మధ్య ఉన్న వివాదం ఈ పరిస్థితికి కారణం అయింది… ఏడాది కిందట ఏపీలో జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయి కూటమి పాలన ఏర్పడింది. అప్పటి నుంచి సుమారు 15 నెలలుగా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకరరెడ్డి అడ్డుకుంటున్నారు. పోలీసులు కూడా శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా పెద్దారెడ్డికి అనుమతి నిరాకరించారు. దీంతో పెద్దారెడ్డి చేసేది ఏమీలేక హైకోర్టును ఆశ్రయించి తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అనుమతి పొందారు . ఆ తరువాత పెద్దారెడ్డి పోలీసులకు సమాచారం ఇచ్చి తాడిపత్రిలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారు. కోర్టు అనుమతి ఉన్నప్పటికీ స్థానికంగా తెలుగుదేశం కార్యకర్తలు జెసి అభిమానులు, ప్రజలు పెద్దారెడ్డిని తాడిపత్రిలో ప్రవేశించకుండా అడ్డుకున్నారు. పెద్దారెడ్డి తాడిపత్రికి వచ్చే రోజునే జేసీ ప్రభాకరరెడ్డి అమ్మవారి ప్రతిష్ట కార్యక్రమాన్ని చేపట్టారు.
ఈ సందర్బంగా తాడిపత్రి కి చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. ఇరువర్గాలను అదుపు చేసేందుకు పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులే కోర్టును ఆశ్రయించి శాంతిభద్రతల సమస్య ఉందని పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించ వద్ధని కోరారు. దీనికి కోర్టు కూడా సమ్మతి తెలిపింది. దీంతో చేసేది ఏమీ లేక పెద్దారెడ్డి తాడిపత్రిలో ప్రవేశించకుండా వెనుతిరిగారు. పెద్దారెడ్డి ఎలాగైనా తాడిపత్రిలోకి ప్రవేశించాలని పట్టుదలతో సుప్రీంకోర్టును ఆశ్రయించి అనుమతి పొందారు. కోర్టు కూడా పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి ప్రవేశించేందుకు అవసరమైన భద్రతను కల్పించాలని పోలీసులను ఆదేశించింది. దీంతో పోలీసులు శనివారం పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి అనుమతించారు. ఈ సందర్బంగా ఎటువంటి శాంతి భద్రత సమస్య ఎదురుగా కాకుండా భారీగా పోలీసులను రంగంలోకి దింపారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. దీంతో పెద్దారెడ్డి సుమారు 15 నెలల తర్వాత తాడిపత్రిలోకి ప్రవేశించారు. ఎడాదిపైగా తాడిపత్రి కి దూరంగా ఉన్న పెద్దారెడ్డి ఎట్టకేలకు తన సొంత ఇంటికి చేరుకున్నారు. పెద్దారెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాడిపత్రిలోకి అనుమతించలేదని హెచ్చరించిన జేసి ప్రభాకర్ రెడ్డి కూడా పరిస్థితులకు అనుగుణంగా మౌనం దాల్చారు.
ఇంకా కొంత కాలం నియోజకవర్గానికి దూరంగా ఉంటే రాజకీయ మనుగడే ప్రశ్నార్థకమౌతుందన్న భయంతోనే పెద్దారెడ్డి తాడిపత్రి ఎంట్రీ కోసం పట్టుపట్టారని చెప్పాల్సి ఉంటుంది. గత 15 నెలలుగా నియోజకవర్గానికి దూరంగా ఉంటుండటంతో తాడిపత్రిలో వైసీపీ ఇన్ చార్జిగా మరో వ్యక్తిని నియమించాలని జగన్ యోచిస్తున్నట్లు తెలియడంతో పెద్దారెడ్డి తనకు కల్పించే పోలీసు భద్రతకు అయ్యే వ్యయం భరిస్తానని చెప్పి మరీ నియోజకవర్గంలోకి అడుగుపెట్టడానికి కోర్టు అనుమతి పొందారు. ఇంత కష్టపడి తాడిపత్రిలోకి ఎంట్రీ ఇచ్చినా నియోజకవర్గంలో ఆయన రాజకీయం చేయగలిగే పరిస్థితి ఉంటుందా అంటే పరిశీలకులు అనుమానమే అంటున్నారు.