గైర్హాజరే జగన్ నిర్ణయం.. వైసీపీ ఎమ్మెలేలు శిరసావహిస్తారా అన్నదే అనుమానం?!
posted on Sep 6, 2025 @ 1:06PM
ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 18 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఎన్నిరోజులు జరుగుతాయి అన్నదానిపై క్లారిటీ అయితే ఇంకా రాలేదు కానీ, వారం రోజుల పాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుగుదేశం కూటమి వర్గాల ద్వారా తెలుస్తోంది. అయినా అసెంబ్లీ ఎన్ని రోజులు నిర్వహించాలి అన్న విషయాన్ని పక్కన పెడితే.. ఈ సారైనా వైసీపీ సభ్యులు, ముఖ్యంగా జగన్ హాజరౌతారా లేదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ, ఆసక్తి నెలకొని ఉంది. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి సర్కార్ కొలువుదీరి 15 నెలలు అయ్యింది. ఈ కాలంలో ప్రభుత్వం అమలు చేసిన సూపర్ సిక్స్ పథకాలకు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తోంది.
అది పక్కన పెడితే.. చంద్రబాబు వైసీపీ అధినేత జగన్ కు ఓ సవాల్ విసిరారు.. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు సిద్ధమా అన్నదే ఆ సవాల్. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదా కోసం పట్టుబడుతూ, అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్న వైసీపీ సభ్యులపై అనర్హత వేటు వేలాడుతోందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మరోసారి కూడా అసెంబ్లీకి గైర్హాజర్ అవ్వాలన్న నిర్ణయం తీసుకుంటే.. జగన్ పై వైసీపీ ఎమ్మెల్యేలు కొందరు తిరుగుబాటు చేసైనా సరే సభకు హాజరు అవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అన్నిటికీ మించి జగన్ స్వయంగా పులివెందులలో ఉప ఎన్నికను ఎదుర్కొంటే పరాభవం తప్పదన్న భయంలో ఉన్నారన్న ప్రచారం సైతం సాగుతోంది. పులివెందుల తెలుగుదేశం ఇన్ చార్జ్ బీటెక్ రవి అయితే ఒక అడుగు ముందుకు వేసి పులివెందులలో ఉప ఎన్నికను స్వాగతిస్తున్నానని కూడా ప్రకటించేశారు. ఈ నేపథ్యంలో అనివార్యంగా.. అంటే కనీసం శాసనసభ సభ్యత్వాలను కాపాడుకుందుకైనా వైసీపీ అసెంబ్లీకి హాజరు కావడానికి నిర్ణయం తీసుకుంటుందని పరిశీలకులు భావించారు.
అయితే జగన్ మాత్రం అందుకు భిన్నంగా నిర్ణయం తీసుకున్నారు. జగన్ ఇటీవల వైసీపీ నేతలతో జరిపిన సమావేశంలో హోదా లేకుండా సభకు వెళ్లడం వల్ల ప్రయోజనం లేదని వ్యాఖ్యానించారు. జగన్ ఈ నిర్ణయం పట్ల పార్టీలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఏది ఏమైనా అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరే వైసీపీ విధానమని జగన్ కుండబద్దలు కొట్టేయడంతో.. ఇప్పుడు ఆయన కాకుండా వైసీపీకి చెందిన మిగిలిన 10 మంది ఎమ్మెల్యేలలో ఎందరు ఆయన నిర్ణయాన్ని సమర్ధించి సభకు హాజరౌతారు? ఎందరు గైర్హాజరౌతారు అన్న విషయంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇక రాజ్యాంగం ప్రకారం స్పీకర్ కు, సభకు సమాచారం ఇవ్వకుండా అరవై పని దినాలు సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు వేయవచ్చు. అసెంబ్లీలో ప్రమాణం చేసిన తర్వాత వైసీపీ సభ్యులు హాజరు కాలేదు. ఒక్క రోజు హాజరు వేయించుకోవడానికి గవర్నర్ ప్రసంగానికి వచ్చారు కానీ.. అది ఉభయ సభల సంయుక్త సమావేశం కావడంతో ఆ హాజరు చెల్లదని తేలింది. ఆ తరువాత తర్వాత కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు రహస్యంగా అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టేసి జారుకున్నారు.
ఈ విషయం స్పీకర్ దృష్టికి రావడంతో దానిపై సీరియస్ అయిన స్పీకర్ అయ్యన్న పాత్రుడు.. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా సంతకాలు పెట్టి వెళ్లిన విషయం తన దృష్టికొచ్చిందని సభలోనే ప్రకటించి అవన్నీ దొంగ సంతకాలంటూ రూలింగ్ ఇచ్చారు. దీంతో తాము దొంగచాటుగా వెళ్లి పెట్టిన సంతకాలు కూడా చెల్లవా? ఈ సారి సభకు హాజరు కాకపోతే అనర్హత వేటు తప్పదా? అన్న భయం వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతోంది. అందుకే పార్టీ అధినేత ఆదేశాలను ధిక్కిరించైనా అసెంబ్లీకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అనర్హత వేటు కోసం భయం వద్దు సభ జరుగుతున్న సమయంలో ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాలలో పర్యటించడం, ప్రభుత్వ తీరును ఎండగట్టడం వంటి కార్యక్రమాలు చేపట్టాలని జగన్ చేసిన దిశానిర్దేశం వైసీపీ ఎమ్మెల్యేలకు అంతగా రుచించడం లేదంటున్నారు.
ఇంత కాలం వైసీపీ ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరైనా.. తమతమ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్యలపై ప్రశ్నలను సభకు పంపారు. అయితే ఈసారి అలా కుదరదని స్పీకర్ అయ్యన్నపాత్రులు స్పష్టం చేశారు. సభకు రాకుండా ప్రశ్నలు అడిగితే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ప్రశ్నలకు సభలో సమాధానం ఇవ్వరు. దీంతో అసలు వైసీపీ వాయిసే వినబడని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక అనర్హత వేటు పడితే... ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీ టికెట్ పై విజయం సాధించడం సాధ్యం కాదన్న భయం కూడా వైసీపీ ఎమ్మెల్యేలలో వ్యక్తం అవుతున్నది. చూడాలి మరి ఈ సారి జగన్ గైర్హాజర్ నిర్ణయానికి ఆయన పార్టీ ఎమ్మెల్యేలు కట్టుబడి ఉంటారో లేదో?