బీజేపీకి పవన్ కల్యాణ్ కటీఫ్? స్టాలిన్ ను పొగుడుతూ సిగ్నల్ ?
posted on Sep 3, 2021 @ 11:27AM
భారతీయ జనతా పార్టీకి జనసేన టాటా చెప్ప బోతోందా? పవన్ కల్యాణ్ పొలిటికల్ ఎంట్రీలో కీలక మలుపు జరగబోతోందా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. బీజేపీకి వకీల్ సాబ్ బైబై చెప్పబోతున్నారని కొన్ని రోజులుగా జరుగుతున్న ప్రచారం నిజమయ్యేలా తాజా పరిణామాలు జరుగుతున్నాయి. బీజేపీతో పొత్తును తెగ తెంపులు చేసుకోవడానికి భీమ్లా నాయక్ రంగం సిద్ధం చేసుకున్నారని తెలుస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి స్ఠాలిన్ ను ఆకాశానికెత్తుతూ ట్వీట్ చేయడం ద్వారా పవన్ కల్యాణ్ ఆ దిశగా సంకేతం ఇచ్చారని అంటున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే చీఫ్ అయిన స్టాలిన్.. ప్రస్తుతం యూపీఏ కూటమిలో ఉన్నారు. మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. 2024 ఎన్నికల్లో మోడీని ఓడించేందుకు జరుగుతున్న ప్రయత్నాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు స్టాలిన్. అంతేకాదు గత ఏప్రిల్ లో జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీజేపీ కూటమితోనే పోరాడారు. అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకున్న బీజేపీ... స్టాలిన్ ముఖ్యమంత్రి కాకుండా చేయడానికి చేయాల్సిన ప్రయత్నాలు అన్ని చేసింది. తమిళనాట రజనీకాంత్ పొలిటికల్ ఎపిసోడ్, శశికల రాజకీయ సన్యాసం వెనుక స్ఠాలిన్ ను ఓడించాలనే బీజేపీ ఎత్తుగడ ఉందని అంటారు. కమలనాధులు ఎన్ని కుట్రలు చేసినా బంపర్ మెజార్టీతో గెలిచి సీఎం సీటులో కూర్చున్నారు స్టాలిన్. ఇప్పుడు జాతీయ స్థాయిలో బీజేపీ వ్యతిరేక కూటమి బలోపేతానికి తనదైన శైలిలో పావులు కదుపుతున్నారు.
ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన నాటి నుంచి సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టాలిన్. ఆయన నిర్ణయాలు అందరూ హర్షించేలా.. అధినేత అనేవాడు ఇలా ఉండాలన్నట్లుగా ఉంటోంది. తమిళనాడు అంటేనే వ్యక్తిపూజ ఎక్కువ. రాజకీయాల్లో మరీ ఎక్కువ. అధికారంలో ఉన్న అధినేత అడుగులకు మడుగులు ఒత్తటం తమిళ తంబీల్లో చూస్తుంటాం. అలాంటిది ఇటీవల తన పార్టీ నేతలకు షాకిచ్చారు స్టాలిన్. అసెంబ్లీలో తనను అదే పనిగా పొగడొద్దని చెప్పారు.తనను పొగిడే వారి మీద చర్యలు తప్పదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా స్టాలిన్ సర్కారు అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఇది జరిగిన రెండు రోజులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒక ప్రెస్ నోట్ ను తన చేతి సంతకంతో రిలీజ్ చేశారు. అందులో స్టాలిన్ ను ఆకాశానికి ఎత్తేస్తూ పొగిడేశారు.
బీజేపీకి బద్ద వ్యతిరేకిగా ఉన్న తమిళనాడు సీఎం స్టాలిన్ ను పవన్ కల్యాణ్ ప్రశంసించడం ఇప్పుడు చర్చగా మారింది. ఏపీ రాజకీయాల్లో పవన్ చర్చ మరింత పెరిగేలా చేసింది. స్టాలిన్ ను ఒక రేంజ్ లో పొగిడేసిన పవన్.. ‘మీరు రాజకీయ నేతలందరికి ఆదర్శం. మీ పాలన.. మీ ప్రభుత్వ పనితీరు ఒక్క రాష్ట్రానికే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలకు.. రాజకీయ పార్టీలకు మార్గదర్శకంగా నిలిచారంటూ పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కల్యాణ్ తీరు ఏపీ బీజేపీ నేతలకు కంటగింపుగా మారింది. తమ మిత్రపక్షంగా వ్యవహరిస్తూ.. తమకు ప్రత్యర్థి పార్టీ విధానాల్ని.. ముఖ్యంగా కేంద్ర సర్కారు తీసుకొచ్చిన చట్టాన్ని దెబ్బ తీసేలా ఉండే తీర్మానంపై జగన్ రియాక్టు కావటాన్ని కమలనాథులు జీర్ణించుకోలేకపోతున్నారు. తమకు తోక పార్టీగా ఉండాల్సిన జనసేన అందుకు భిన్నంగా తమకు రాజకీయ ప్రత్యర్థి అయిన డీఎంకేను జనసేనాని పొగడటంపై బీజేపీ నేతలు కోపంతో ఉన్నట్లు చెబుతున్నారు.
స్ఠాలిన్ విషయంలో పవన్ కల్యాణ్ కామెంట్లు తమను దెబ్బ తీసేలా ఉన్నాయని ఏపీ బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. అంతేకాదు స్టాలిన్ పై పవన్ పొగడ్తల విషయంలో బీజేపీ లైన్ ను ధిక్కరించారని చెబుతున్నారు. దీనిపై పవన్ కల్యాణ్ ను వివరణ అడగాలని భావిస్తున్నారని తెలుస్తోంది. అయితే తన స్వేచ్ఛ విషయంలో బీజేపీ నేతలు అడ్డు వస్తే.. వారికి కటీఫ్ చెప్పేందుకు పవన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిజానికి బీజేపీ అగ్రనాయకత్వం తీరుపై గుర్రుగా ఉన్న పవన్.. తను అనుసరించే సిద్దాంతానికి భిన్నంగా బీజేపీ తీరు ఉందన్నట్లుగా ఆయన భావన ఉందంటున్నారు. ఇందుకు తగ్గట్లు సమయానికి తగ్గట్లు తన అభిప్రాయాన్ని ఓపెన్ గా చెప్పేందుకు పవన్ వెనుకాడటం లేదంటున్నారు. అందులో భాగాంగనే స్టాలిన్ ను పొగుడుతూ బీజేపీకి కటీఫ్ చెప్పబోతున్నాననే సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు.