హుజూరాబాద్ ఉప ఎన్నికకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్?
posted on Sep 3, 2021 @ 11:55AM
రాష్ట్రం అంతటా వర్షాలు దంచి కొడుతున్నాయి. వాతావరణం చల్లబడింది. అయితే హుజూరాబాద్ నియోజక వర్గంలో మాత్రం ఎన్నికల వేడి భగ్గుమంటోంది. మండు వేసవిని మరిపిస్తోంది. రోజులు గడించే కొద్ది వేడి మరింతగా పెరుగుతోంది, మాటలు గీత దాటుతున్నాయి. రాష్ట్రంలో ఇంతలా రాజకీయ వేడిన రాజేసిన హుజూరాబాద్ ఉపఎన్నిక నిర్వహణపై ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఇప్పటికే, ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాజకీయ పార్టీల అభిప్రాయాలను సేకరించిన కేంద్ర ఎన్నికల సంఘం.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితితో పాటుగా ఎన్నికల నిర్వహరణ ఏర్పాట్లు, సంసిద్ధత అడిగి తెలుసుకుంది.
గత నెలలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి కరోనా కారణంగా చూపించి, ఎన్నికలు ఇప్పట్లో నిర్వహించే పరిస్థితి లేదని కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపిన తెరాస ప్రభుత్వం బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మాత్రం రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులో ఉన్నాయని స్పష్టం చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంసిద్దత వ్యక్తం చేసింది. దీంతో ఇక హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడన్న ఉత్కంఠకు తెరపడినట్లే అంటున్నారు. రోజుల్లోనే ముహూర్తం ఖరారు కావడం, షెడ్యూలు విడుదల ఖాయమని అంటున్నారు.
గత అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్ నుంచి గెలిచిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఈ ఏడాది జూన్‌లో రాజీనామా చేయటంతో ఖాళీ అయిన స్థానానానికి నిబంధనల మేరకు ఈ ఏడాది డిసెంబరు 12 లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంది. అయితే, పొరుగు రాష్ట్రం ఏపేలోని బుద్వేల్ శాసనసభ నియోజకవర్గం సిట్టింగ్ శాసన సభ్యుడు వెంకట సుబ్బయ్య మృతితో ఖాళీ అయిన స్థానానికి, సెప్టెంబర్ 28 లోగా ఉపఎన్నిక జరగవలసివున్ననేపధ్యంలో సెప్టెంబర్’లోనే ఉపఎన్నిక జరుగుతుందని లేదంటే, అక్టోబర్, నవంబర్ మాసాలలో ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్ లోనే ఉప ఎన్నిక ముహూర్తం ఖరారయ్యే పక్షంలో ఈవారంలోనే షెడ్యూలు విడుదలయ్యే అవకాశం ఉందని అధికార వర్గాల సమాచారం.
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎప్పుడు జరిగినా, చాలా పెద్ద సంఖ్యలో అభ్యర్ధులు బరిలో నిలిచే సంకేతాలు స్పష్టమవుతున్నాయి. ఇప్పటికే, తమకు జరుగతున్న అన్యాయయానికి నిరసనగా, వివిద సంఘాలు తమ ప్రతినిధులను పెద్ద సంఖ్యలో బరిలో దించుతున్నట్లు ప్రకటించాయి.మరో వంక, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో నిరుద్యోగులు పోటీ చేస్తే ఆర్థిక సహాయం చేస్తామంటూ వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రకటించారు. గత (2018) ఎన్నికల్లో మొత్తం పది మంది సభ్యులు మాత్రమే పోటీ చేశారు. అయితే ఈ సారి ఈ సంఖ్య ఎందాకా పోతుందో ఇప్పుడే చెప్పడం కష్టం. ఒక వేళ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్ధుల సంఖ్య 384 దాటితే, ఈవీఎంల స్థానంలో పేపర్ బ్యాలెట్ ఉపయోగించక తప్పదని అధికారులు అంటున్నారు. గతంలో 1996 లోక్‌సభ ఎన్నికల్లో నల్గొండ లోక్‌సభ నియోజకవర్గంలో 477 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో 50 పేజీల బ్యాలెట్ పత్రాన్ని రూపొందించి పోలింగు నిర్వహించారు. 2019లో నిజామాబాద్ లోక్‌సభ ఎన్నికల్లో 185 మంది అభ్యర్థులు పోటీ చేయటంతో ఎం3 రకం ఈవీఎంలతో పోలింగు నిర్వహించారు.తొలిసారిగా ఆ అత్యాధునిక ఈవీఎంలను నిజామాబాద్‌లోనే వినియోగించటం విశేషం. ఈ నేపధ్యంలో హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఈవీఎంలా? బ్యాలెట్ బాక్సులా? ఏ పద్దతిలో జరుగుతుంది అనేది, నామినేషన్ల ఉపసంహరణ తరవాతనే తెలుస్తుంది.
నియోజక వర్గంలో ఎన్నికల ప్రచారం రోజు రోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. బీజేపీ తమ అభ్యర్ధిని ఇంకా అధికారకంగా ప్రకటించక పోయినా మాజీ మంత్రి ఈటల రాజేందర్ ప్రచారంలో పరుగులు తీస్తున్నారు. ఆయనకు పోటీగా మాజీ మిత్రుడు, మంత్రివర్గ సహచరుడు, ఈ అన్నిటినీ మించి సహా బాదితుడు మంత్రి హరీష్ రావు, తెరాస అభ్యర్ధి గెల్లు శ్రీనివాస యాదవ్ విజయం కోసం సర్వతానై ప్రచారం సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు అభ్యర్ధిని ప్రకటించలేదు .. కారణాలు ఏవైనా ప్రచారంలోనూ పెద్దగా శ్రద్ద చూపడం లేదు. ఎన్నికల కమిషన్ ముహూర్తం ఖరారు చేసిన తర్వాతగానీ, కాంగ్రెస్ వ్యూహం ఏమిటన్నది తెలియదు. అది తెలిస్తే ప్రధాన పోటీ ద్విముఖమా ? త్రిముఖమా అన్నది తేలదు.