సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ సంచలన వ్యాఖ్యలు.. వైసీపీలో కలవరం?
posted on Sep 3, 2021 @ 10:34AM
దేశంలో సోషల్ మీడియా అరాచక శక్తులకు అడ్డాగా మారిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని, ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వాళ్లు అడ్డగోలుగా పోస్టులు పెడుతున్నారని చాలా కాలంగా ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇది మరింతగా శృతి మించింది. ఏకంగా న్యాయమూర్తులనే టార్గెట్ చేసే పరిస్థితికి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు రావడంతో వైసీపీ నేతలు అసహనానికి గురై…కోర్టులు, జడ్జిలపై నేరుగానే విమర్శలు చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. న్యాయస్థానానికి, న్యాయమూర్తులకు దురుద్దేశాలను ఆపాదిస్తూ సోషల్ మీడియాలో రెచ్చిపోవడంతో వైసీపీ నేతలపై పలు న్యాయస్థానాలు సీరియస్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 49 మందికి ‘కోర్టు ధిక్కరణ’ కింద నోటీసులు కూడా జారీ అయ్యాయి. ఆ 49 మందిలో వైసీపీ ఎంపీ నందిగం సురేశ్, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కూడా ఉన్నారు.
తాజాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజేఐ ఎన్వీ రమణ సోషల్ మీడియా, వెబ్ పోర్టళ్ల తీరుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయమూర్తులు చెప్పినా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. శక్తివంతమైన వ్యక్తులు చెబితే మాత్రమే సోషల్ మీడియా సంస్థలు సత్వర చర్యలు తీసుకుంటున్నాయని జస్టిస్ ఎన్వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో నకిలీ వార్తలు పెరిగిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
జవాబుదారీతనం, సరైన నియంత్రణ లేకపోవడంతో వ్యక్తుల పరువుకు నష్టం కలుగుతోందని అభిప్రాయపడ్డారు. ఇది, దేశానికి ఎంతో ప్రమాదకరమని, ప్రజల మధ్య విద్వేషాలకు, దేశంలో అలజడులకు ఇదే కారణమవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మన అభిప్రాయాలను నిర్భయంగా చెప్పుకునే ప్లాట్ ఫామ్ సోషల్ మీడియా అని, మంచికి వాడితే అదో మంచి ఆయుధమని, కొందరు దానిని దుర్వినియోగపరుస్తూ సమాజంలో చిచ్చు పెడుతున్నారని అభిప్రాయపడ్డారు.దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ వ్యాప్తికి తబ్లిగ్ జమాత్ సమావేశాలే కారణమంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వచ్చిన వార్తలకు మతం రంగు పులిమే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది దేశానికే ప్రమాదకరమని జస్టిస్ ఎన్వీ రమణ హెచ్చరించారు.
సోషల్ మీడియా కేసులకు సంబంధించిన వివిధ హైకోర్టుల్లో దాఖలైన పిటిషన్లన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని కేంద్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై ధర్మాసనం స్పందించింది. దీనిపై నిర్ణయం తీసుకునేందుకు కేసును ఆరు వారాల తర్వాత లిస్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సీజీఐ ఎన్వీ రమణ సూచించారు. సోషల్ మీడియా సంస్థలపై సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి .ఆంధ్రప్రదేశ్ లో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.