ఇక గుజరాత్ వంతు?
posted on Feb 22, 2016 @ 2:31PM
ఒకపక్క హర్యానాలో జాట్ వర్గం తమను వెనుకబడిన తరగతుల్లో చేర్చుకుని తగిన రిజర్వేషన్లను కల్పించమంటూ ఆందోళన చేస్తోంది. ఈ ఆందోళనలు హింసాత్మకరంగా మారి 10 మందికి పైగా మృత్యువాత పడ్డారు. జాట్‌ల ఉద్యమంతో హర్యానా అగ్నిగుండంగా మారిపోయింది. రవాణా సంగతి దేవుడెరుగు... దేశ రాజధాని దిల్లీకే ఈ ఉద్యమం వల్ల మంచినీరు సైతం దక్కని దుస్థితి వచ్చింది. పరిస్థితి చేయిదాటిపోవడంతో ఎట్టకేళకు కేంద్రప్రభుత్వం కూడా దిగివచ్చి వారి ప్రతిపాదనలకు సానుకూలంగా స్పందిస్తామంటూ హామీ ఇవ్వవల్సి వచ్చింది.
హర్యానాలో జరుగుతున్న హడావుడి చూసి ఉత్తేజం పొందాడో ఏమోగానీ గుజరాత్‌లోని హార్ధిక్ పటేల్ తన గొంతుని పెంచడం మొదలుపెట్టాడు. గత గురువారం నుంచీ హార్ధిక్ జైల్లోనే ఆమరణ నిరాహారదీక్షను మొదలుపెట్టాడు. హార్ధిక్ దీక్షకు మద్దతుగా గుజరాత్లో ఆందోళనలు మొదలయ్యాయి. అక్కడక్కడా బస్సులను ధ్వంసం చేసిన వార్తలు వినవస్తున్నాయి. పట్టుమని పాతికేళ్లు కూడా లేని హార్ధిక్ పటేల్ తన వర్గానికి రిజర్వేషన్లను కల్పించమంటూ చాలా రోజుల నుంచీ పోరాడుతున్నాడు. అందుకోసం ‘పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి’ అంటూ 2015లో సంఘాన్ని సైతం ఏర్పాటుచేశాడు. ఆ సంఘం తరఫున గత ఏడాదికాలంగా హార్ధిక్ సాగించిన ఆందోళన కేంద్రప్రభుత్వాన్నే వణికించింది. సాక్షాత్తూ ప్రధానమంత్రి మోదీ స్వంత రాష్ట్రమైన గుజరాత్‌లోనే ఆయనను ఇబ్బంది పెట్టింది. హార్ధిక్‌ను చిన్నాచితకా కేసుల కింద అరెస్టు చేసి జైల్లో తోసారు పోలీసులు. ప్రస్తుతానికైతే ప్రభుత్వం కొన్ని పటేల్ వర్గం వారికోస రాయితీలను, స్కాలర్‌షిప్‌లనూ ప్రకటించి ఉద్యమాన్ని శాంతింపచేసింది. కానీ హార్ధిక్ చర్యలను గమనిస్తుంటే ఉద్యమం మళ్లీ ఊపందుకునే సూచనలు కనిపిస్తున్నాయి.
పటేల్ వర్గంవారు వ్యాపారానికి పెట్టింది పేరు. లేదా వ్యవసాయం మీదన్నా ఆధారపడేవారు. ప్రభుత్వ ఉద్యోగాల మీద వారికి ముందునుంచీ శ్రద్ధ తక్కువే. కానీ ప్రపంచీకరణ నేపథ్యంలో వ్యాపారమూ, వ్యవసాయమూ వారిని నష్టాల్లోకి నెట్టసాగాయి. ఆన్‌లైన్ వ్యాపారంతోనూ, సూపర్ మార్కెట్ల ప్రభంజనంలోనూ వారి వ్యాపారాలు దివాళా తీయడం మొదలుపెట్టాయి. పైగా గుజరాత్‌లో కులాల ఓటుబ్యాంకుకి సంబంధించి ఒక ఘోరమైన ప్రయోగం జరిగింది. మాధవరావ్ సోలంకీ అనే పెద్దమనిషి ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు 1980వ దశకంలో KHAM అనే ఒక పద్ధతిని కనిపెట్టాడు. KHAM అంటే క్షత్రియులు, హరిజనులు, ఆదివాసీలు, ముస్లింలు అన్నమాట!
గుజరాత్ జనాభాలో అత్యధికంగా ఉన్న ఈ నాలుగు వర్గాలనూ చేరదీసి వారి సహకారంతో గెలుపుని సాధించడమే మాధవరావ్‌గారి లక్ష్యంగా సాగింది. ఈ ప్రయోగం మాధవరావ్‌ను నేరుగా ముఖ్యమంత్రి కుర్చీ వద్దకు తీసుకువెళ్లింది. కానీ పటేళ్లను శాశ్వతంగా అధికారానికి దూరం చేసింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ కాలం నుంచీ కాంగ్రెస్‌కు అండగా నిలబడిన పటేల్ వర్గం పార్టీలవారీగా చీలిపోయింది. ఇటు వ్యాపారాలు సరిగా లేక, అటు వ్యవసాయం లాభసాటి కాక, రాజకీయాలలోనూ ఇమడలేక... పటేళ్లలో అంతకంతకూ పెరుగుతున్న ఆందోళనకు హార్ధిక్ పటేల్ గొంతుకలా నిలిచాడు. రాష్ట్ర జనాభాలో 15 శాతం ఉన్న తమని పట్టించుకోకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరికలు మొదలుపెట్టాడు. మరి ఆ హెచ్చరికలు ఎంత దూరం వెళ్తాయో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో రాబోయే రోజులలో చూడాల్సిందే!