జాట్ ఉద్యమం... ఎందుకు!
posted on Feb 20, 2016 @ 1:26PM
పచ్చగా ఉండే హర్యానా రాష్ట్రం ఇప్పుడు రావణ కాష్టంలా రగులుతోంది. తమకోసం రిజర్వేషన్లను కేటాయిస్తారా లేదా అంటూ జాట్ వర్గం మొదలుపెట్టిన ఆందోళన నిజంగానే ఆందోళనకరంగా మారింది. సాక్షాత్తూ రాష్ట్రమంత్రి ఇంటినే తగులబెట్టే స్థాయికి ఉద్యమం చేరుకుంది. ఎన్నికల కోసమో, తాత్కాలికంగా వివిధ వర్గాలను శాంతింపచేయడానికో రిజర్వేషన్లను ఇష్టానుసారంగా ఇచ్చిపడేస్తే ఏం జరుగుతుందో హర్యానాని చూస్తే తెలిసిపోతుంది.
ఉత్తరాదిన అధికసంఖ్యలో కనిపించే జాట్ వర్గంవారు ఎక్కువగా పొలంపనుల మీద ఆధారపడే ప్రజలు. దైర్యసాహసాలలో కూడా వీరికి సాటిలేకపోవడంతో, తరచూ వీరిని క్షత్రియులతో సమానంగా భావించడం జరుగుతుంది. జాట్‌లు హర్యానాలో అధికంగా కనిపిస్తారు. ఈ రాష్ట్రంలో వీరి జనాభా దాదాపు 30 శాతం వరకూ ఉంటుంది. 1991లో రిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమీషన్ చిచ్చు రగులుకోవడంతో తమను కూడా వెనుకబడిన వర్గాలలోకి చేర్చి, రిజర్వేషన్లను కల్పించమంటూ వీరి ఆందోళన మొదలైంది. తమను ‘OBC’ కోటాలో చేర్చమంటూ వీరు చేసుకున్న విజ్ఞప్తులన్నింటినీ సంబంధిత కమీషన్లు కొట్టపారేశాయి. సామాజికంగా పరిశీలిస్తే జాట్ వర్గంవారు వెనుకబడినట్లు కనిపించడం లేదన్నది సదరు కమీషన్ల వాదన.
కాంగ్రెస్‌కు చెందిన ముఖ్యనేత ‘భూపిందర్ సింగ్ హుడా’కు జాట్ ఆందోళన తనకి కలిసివచ్చేదిలా తోచింది. రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్న వారి మనసులని చూరగొంటే ముఖ్యమంత్రి కావడం సులువు అని ఆయనకు అనిపిచింది. ‘మేం కనుక అధికారంలోకి వస్తే మీకు రిజర్వేషన్లను కల్పించి తీరతామంటూ’ ఆయన 2005 ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేశారు. అలా జాట్ల మద్దతుతో 2005లో హుడా హర్యానాకి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు. అదే వాగ్దానాన్ని పొడిగిస్తూ ఆయన 2009లో కూడా ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కానీ ఈసారి జాట్ వర్గీయులు ఊరుకోలేదు. 2010 నుంచి తమ ఆందోళనలను ఉధృతం చేస్తూ ఎలాగైనా సరే తమకు రిజర్వేషన్లకి కల్పించమంటూ ప్రభుత్వాన్ని నిలదీయడం మొదలుపెట్టారు. దాంతో హుడా వారికి ‘ప్రత్యేకంగా’ వెనుకబడిన వర్గం అంటూ ఓ పది శాతం రిజర్వేషన్లను కల్పించారు. ఆ తరువాత వారిని ‘OBC’లలో చేర్చేందుకు కూడా నిర్ణయం తీసుకున్నారు.
జాట్ వర్గంవారి ఉద్యమాన్ని శాంతింపచేసేందుకు హడావుడిగా తీసుకున్న ఈ నిర్ణయాలు రెండూ కూడా న్యాయస్థానాల ముందర తేలిపోయాయి. జాట్‌లు నిజంగా వెనుకబడిన తరగతులుగా తమకు తోచడం లేదంటూ సుప్రీం కోర్టు స్పష్టం చేస్తే, వారికి రిజర్వేషన్లను కల్పించడం ద్వారా 50% పరిమితి దాటిపోయిందంటూ హర్యానా న్యాయస్థానం మండిపడింది. దాంతో ఉద్యమం మళ్లీ మొదటికి వచ్చింది. అందుకనే ఈసారి ఆర్థికంగా వెనుకబడిన తరగతుల కింద మీకు ఎంతోకొంత రిజర్వేషన్లను కల్పిస్తామంటూ హర్యానా ప్రభుత్వం ప్రకటించినా... తమను ‘మిగతా వెనుకబడిన కులాలు(OBC)’ జాబితాలో చేర్చేవరకూ ఊరుకునేది లేదంటూ జాట్ పెద్దలు చెబుతున్నారు. ఇందుకోసం కొనసాగుతున్న ఉద్యమంలో కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసం జరుగుతోంది. ఆందోళనకారులు, లేదా వారి ముసుగులో ఉన్న సంఘవిద్రోహశక్తులు కనిపించిన ప్రతి భవంతికీ నిప్పు పెడుతున్నారు. రోడ్లన్నీ స్మశానాలను తలపిస్తున్నాయి. వందలాది రైళ్లు ఆగిపోయాయి. రవాణా అంతా స్తంభించిపోయింది. పసిపిల్లలకు పాలు సైతం దొరకని పరిస్థితి. కొద్దిసేపటి క్రితమే ఆందోళనకారులు ఏకంగా ఒక రైల్వేస్టేషన్నే తగలబెట్టిన వార్తలు వచ్చాయి. హర్యానాలో పరిస్థితిని చక్కదిద్దేందుకు హెలీకాఫ్టర్ల సాయంతో సైన్యం అక్కడికి చేరుకుంటోందంటే... పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది.
ఒక వర్గం ఓట్లను కూడగట్టుకునేందుకు ముందూవెనుకా ఆలోచించకుండా ఏవేవో హామీలను గుప్పించడం; అధికారంలోకి వచ్చిన తరువాత నిర్దిష్ట ప్రణాళిక లేకుండా కంటితుడుపు చర్యలను చేపట్టడం; ప్రతిపక్షంలో ఉన్నవారేమో ఇదే అదనుగా సంబంధిత వర్గాలను రెచ్చగొట్టడం... ఇదంతా రాజకీయ చదరంగంలో ఓ అలవాటైన ఆటగా మారిపోయింది. కానీ ఇందులో పావులుగా మిగిలిపోతుంది మాత్రం సామన్య జనమే!