కార్యకర్త ను కొట్టిన విజయ్‌కాంత్?
posted on Mar 31, 2011 @ 3:35PM
చెన్నై: తమిళ హీరో, డిఎండికె అధినేత విజయ్‌కాంత్ ఓ పార్టీ కార్యకర్తను చితకబాదాడు. ఏప్రిల్ 13న ఎన్నికలు ఉన్నందున విజయ్‌కాంత్ తన ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఈ సందర్భంలో విజయ్‌కాంత్ పార్టీకి చెందిన ఓ కార్యకర్తను చితకబాదినట్లుగా తెలుస్తోంది. కార్యకర్తను చితకబాదుతున్న విజయ్‌కాంత్ టీవీ కెమెరాలకు అడ్డంగా దొరికిపోయారు. దీంతో ఆయన ఆ కార్యకర్తకు క్షమాపణ చెప్పక తప్పలేదు. ఇది తమిళనాట తీవ్ర దుమారం లేపుతోంది. అయితే ఇందులో నిజం లేదని విజయ్‌కాంత్ అంటున్నారు. తాను ఏ కార్యకర్తను కొట్టలేదని చెబుతున్నారు. తాను కార్యకర్తను కొడుతున్న దృశ్యాలు కేవలం కల్పితమే అన్నారు. వాటిని మార్ఫింగ్ చేశారని ఆయన ఆరోపిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన కలైంజ్ఞర్ టీవీ, సన్ టీవీలు కలిసి తాను కార్యకర్తను చితకబాదినట్లు మార్ఫింగ్ చేసి తన ఇమేజ్ డామేజ్ చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఇమేజ్ డామేజ్ చేయ ప్రయత్నించాయంటూ ఆయా టీవీలకు విజయ్‌కాంత్ లీగల్ నోటీసులు పంపారు. అధికార పార్టీ తీరుకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు.