వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి
posted on Mar 31, 2011 @ 3:36PM
కడప: వైయస్ఆర్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి వర్గం శాసనసభ్యులు రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్నారని కడప జిల్లా కాంగ్రెసు పార్టీ శాసనసభ్యుడు వీరశివారెడ్డి గురువారం ధ్వజమెత్తారు. జగన్ వెంట నడుస్తున్న వారు ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ కాంగ్రెసు పార్టీతో పాటు ఎంపీ పదవికి రాజీనామా చేసిన విధంగా జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులు కూడా రాజీనామా చేసి పోటీకి సిద్ధపడాలని ఆయన డిమాండ్ చేశారు. కడప పార్లమెంటు, పులివెందుల శాసనసభలకు కాంగ్రెసు అభ్యర్థులను నిలబెడతామని ఆయన చెప్పారు. జగన్ వెంట వెళుతున్న శాసనసభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి గట్టిగా చెప్పామని ఆయన అన్నారు. ఆయన వెంట వెళుతున్న శాసనసభ్యులు పార్టీలోనే ఉంటే మేం జగన్‌ను ఎదుర్కోవడం కష్టం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వారిని పార్టీనుండి సస్పెండ్ చేయకుంటే జగన్‌ను ఎదుర్కొనే శక్తి మాకు ఉండదన్నారు. వారిని సస్పెండ్ చేస్తేనే ప్రచారానికి వెళతామని, తద్వారా విజయాన్ని సాధిస్తామని చెప్పారు.