ఇది వ్యవసాయ బడ్జెట్!
posted on Mar 1, 2016 8:57AM
కొన్ని బడ్జెట్లు సంచనాలకు దారితీస్తాయి. కొన్ని బడ్జెట్లు చాలా సాదాసీదాగా కనిపిస్తూనే పెనుమార్పులను కలిగిస్తాయి. నిన్న జైట్లీ రూపొందించిన బడ్జెట్ కూడా అదే కోవకు చెందినట్లుగా కనిపిస్తుంది. ప్రజాకర్షణకంటే దీర్ఘకాలిక ప్రయోజనాలే ముఖ్యమని గత వారం ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ చెప్పకనే చెప్పింది. ఇప్పుడు సాధారణ బడ్జెట్ కూడా అదే పట్టాల వెంట నడిచింది. ఇన్నాళ్లూ రైతే రాజు, రైతు దేశానికి వెన్నెముక లాంటి ఉపమానాలు వినిపించి ఉసూరుమనిపించిన బడ్జెట్లకు భిన్నంగా అరుణ్‌జైట్లీ వ్యవసాయానికి, వ్యవసాయాన్ని వెన్నంటి ఉండే గ్రామీణానికీ లక్షల కోట్లను అందించారు.
వ్యవసాయం, గ్రామీణ రంగం తదితర తొమ్మిది రంగాలను తాను అధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు అరుణ్ జైట్లీ తన బడ్జెట్ ప్రసంగం ఆరంభంలోనే చెప్పారు. దానికి అనుగుణంగానే వ్యవసాయానికి 9 లక్షల కోట్ల రుణాలను అందించాలనీ, సేంద్రీయ పద్ధతులలో సాగుని ప్రోత్సహించేందుకు ‘పరంపరాగత్ కృషి వికాస్ యోజన’ పేరుతో 5 లక్షల ఎకరాలకు చేయూతనివ్వాలనీ చెప్పుకొచ్చారు. ఒకపక్క వ్యవసాయానికి నేరుగా చేయూతని అందిస్తూనే... భూగర్భ జలాలను పెంపొందించడం, పశువులకు హెల్త్ కార్డులు రూపొందించడం, పంటలకు బీమా సౌకర్యాన్ని కల్పించడం వంటి చర్యల ద్వారా సాగుకి అవసరమయ్యే పరిస్థితులను కల్పించినట్లు అయ్యింది. ఇక రైతులు ఎక్కువగా ఉండే గ్రామీణ ప్రాంతాన్ని బలపరిచేందుకు కూడా మంత్రి తగిన ప్రధాన్యతని ఇచ్చారు. దానికి అనుగుణంగానే గ్రామపంచాయితీలకు 2.87 లక్షల కోట్లను అందచేస్తున్నట్లు తెలిపారు.
అరుణ్జైట్లీ వ్యవసాయానికి, గ్రామీణానికి ప్రకటించిన లక్షల కోట్లు క్షేత్ర స్థాయి వరకూ చేతులు మారకుండా వెళ్తాయా లేదా అన్నదే మొదటి ప్రశ్న! అర్హులైనవారికి ఈ నిధులు చేరతాయా అన్నదే మొదటి సందేహం! పైగా వ్యవసాయానికి ఉన్న ఇబ్బంది కేవలం నీరు, విద్యుత్తు మాత్రమే కాదు. నాసిరకం విత్తనాలు, ఎరువులు; అయినాకాడికి దోచుకునే దళారీ వ్యవస్థ; ఉత్పత్తులను నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడం; వ్యవసాయ అధికారుల నుంచి సరైన దిశానిర్దేశం లేకపోవడం... ఇవన్నీ కూడా రైతు నడ్డి విరిచే సమస్యలుగా ఉన్నాయి. పంట నాసిరకంగా ఉన్నా, టమాటా వంటి పంటలు ఒకేసారి వెల్లువలా పండినా.... అటు రైతుకీ నష్టం కలగకుండా, ఇటు పంట వృధా కాకుండా ఏ ఉత్పత్తిని ఎలా సద్వినియోగం చేసుకోవాలన్న విషయంలో ఎవరికీ ఎలాంటి అవగాహనా లేదు.
అన్నింటికీ మించి... తక్కువ రసాయనిక ఎరువులను ఉపయోగించి, ఎక్కువ పంటను సాధించగలిగే విధంగా రైతులను నిర్దేశించలేకపోవడం. విచక్షణారహితంగా రసాయనికి ఎరువులను ఉపయోగించడం వల్ల రైతు అన్ని విధాలా నష్టపోతూనే ఉన్నాడు. ఎరువుల వాడకం వల్ల అతని జేబుకి ఎలాగూ చిల్లు పడుతుంది, వాటిని ఎడాపెడా వాడితే భూసారమూ తగ్గిపోతోంది, తినే ఆహారమూ విషమైపోతోంది, ఒకవేళ ఎరువులు కల్తీవని తేలితే పంటే నాశనమైపోతుంది. కేంద్ర మంత్రి తన బడ్జెట్లో, సేంద్రీయ పద్ధతిని ప్రోత్సహించేందుకు 5 లక్షల ఎకరాల వరకూ సాయం చేస్తామని చేసిన ప్రకటన బాగానే ఉన్నా కోట్ల కొద్దీ ఉన్న మన వ్యవసాయ భూముల్లో 5 లక్షల ఎకరాలు చాలా తక్కువన్న లెక్కని ఎవరైనా తేల్చగలరు. ఇక హోల్‌సేల్ మార్కెట్లలో అమ్మకాలన్నింటినీ కేంద్రీకృతం చేయడం వల్ల రైతులు అధికంగా లాభపడతారన్న జైట్లీ వాదన కూడా ఆచరణలో ఏ మేరకు సాధ్యమో వేచి చూడాల్సిందే!
ఎలా చూసినా 2016-17 బడ్జెట్ వ్యవసాయిక బడ్జెట్ అని చెప్పుకోక తప్పదు. ఇందులో పేర్కొన్న గణాంకాలు, కేటాయించిన నిధులు వ్యవసాయ రంగంలో అద్భుత మార్పులు తీసుకువస్తాయో రావో ఇప్పుడే చెప్పడం కష్టం. కానీ ప్రజాకర్షణకు విరుద్ధంగా వ్యవసాయానికి పెద్ద పీట వేస్తూ కనీసం డీలా పడిపోతున్న రైతన్నకి బాసటగా అరుణ్‌జైట్లీ నిలిచారనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు.