ఊరిస్తున్న బడ్జెట్!
posted on Feb 29, 2016 @ 9:30AM
మన దృష్టిలో ఆర్థికశాఖామంత్రి అంటే ఓ అద్భుత మేధావి. ఆయన ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్ అంటే ఓ మంత్రదండం. ఆ మంత్రందండంతో మన జీవితాలు ఒకంతైనా మారతాయని చిన్న ఆశ. మంచికో చెడుకో కానీ... నిజంగానే కొన్ని బడ్జెట్లు మన దేశాన్ని మార్చివేసిన సందర్భాలు ఉన్నాయి. విదేశీ పెట్టుబడులు, ఆర్థిక సరళీకరణలు, ఆదాయపు పన్ను రాయితీలు మన మీద గణనీయంగా ప్రభావం చూపించాయి. అందుకే నేడు మన ఆర్థిక శాఖ మంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న బడ్జెట్ కూడా ఎలా ఉండబోతోందా అంటూ దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
బడ్జెట్ అనగానే వేతనజీవులు ముందుగా ఎదురుచూసేది, ఆదాయపు పన్నుకి సంబంధించిన పరిమితినే. అందుకు అనుగుణంగానే ఈసారి 3,00,00 వరకూ ఆదాయం కలిగి ఉన్నవారిని ఆదాయపు పన్ను నుంచి మినహాయించాలని అరుణ్ జైట్లీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ ఒక్క మాటా ఆర్థిక శాఖ మంత్రి నోట వెలువడితే చూద్దామని మధ్యతరగతి వర్గాల ఆశ. అంతేకాదు! ఏడవ పే కమీషన్ చేసిన సిఫారుసులను ఆర్థిక మంత్రి ఆమోదించవచ్చన్న సంకేతాలు కూడా వెలువడుతున్నాయి. ఇదే కనుక జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పండుగే!
వ్యాపారస్తులకు, పెట్టుబడిదారులకు కూడా అరుణ్‌జైట్లీ కొన్ని రాయితీలు ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో భాగంగా కార్పొరేట్ పన్నుని ప్రస్తుతం ఉన్న 30 శాతం నుంచి ఎంతో కొంత తగ్గించే ప్రతిపాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రపంచస్థాయిలో తనకంటూ ఓ స్థానం ఏర్పరుచుకుంటుంన్న ఔషధ రంగానికి కూడా ఆర్థిక మంత్రి కొన్ని వరాలను ప్రకటించవచ్చు. ఇక కాలుష్యాన్ని నియంత్రించే చర్యలలో భాగంగా సాంప్రదాయేతర ఇంధన వనరులైన సౌర, పవన విద్యుత్తులకు తగిన విధంగా ప్రోత్సహిస్తారని అంతా ఆశిస్తున్నారు. ఇందులో భాగంగానే విద్యుత్‌తో నడిచే వాహనాలకి సంబంధించిన ముడిభాగాల మీద తగిన రాయితీలను ఇవ్వనున్నారన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక దేశం ఎంతగా వెలిగిపోతున్నా, నానాటికీ క్షీణించిపోతున్న వ్యవసాయ రంగానికి ఆర్థిక మంత్రి ఏం చేయనున్నారన్నది ఆసక్తికరమైన అంశం. కరవుకాటకాలు, అప్పులు, తగ్గిపోతున్న జలవనరులు, దళారుల పీడన, రియల్ ఎస్టేట్... ఇలా వ్యవసాయ రంగాన్ని కుదేలు చేస్తున్న చీడ సామాన్యమైనది కాదు. దేశం వెన్నెముకగా చెప్పుకునే రైతే ఇప్పుడు డీలాపడిపోయి ఉన్నాడు. ఏదో తూతూమంత్రంగా చర్యలు కాకుండా వ్యవసాయరంగానికి జవసత్వాలు అందించే పక్కా ప్రణాళికలు ఈ బడ్జెట్‌లో లభించున్నాయో లేదా చూడాల్సిందే!
ఒకపక్క దేశ ఆర్థిక లక్ష్యాలను సాధించడంతో పాటు క్యాబినెట్ కలలను నెరవేర్చే బాధ్యత కూడా అరుణ్ జైట్లీ భుజస్కంధాల మీద ఉంది. స్వచ్ఛ భారత్, మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా... వంటి పథాకలన్నింటికీ ఊపునిచ్చేందుకు ఈ బడ్జెట్ ఎంతమేరకు ప్రయత్నిస్తుందో చూడాలి.ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రజల మీద పెనుభారాన్ని మోపకుండానే ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను కూడా ఆర్థికమంత్రి అన్వేషించాల్సి ఉంటుంది. ఇందుకోసం పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ పెట్టుబడులకు ఆహ్వానం, పరోక్ష పన్నుల పెంపు, విలాస వస్తువుల మీద పన్నుల పెంపు... తదితర మార్గాలు ఉండనే ఉన్నాయి. మన ఊహలన్నీ ఏ మేరకు నిజం కానున్నాయో త్వరలోనే తేలిపోనుంది.