అడగందే కేంద్రమయినా పెట్టదు!
posted on Mar 2, 2016 9:10AM
కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని ఓ కొలిక్కి తీసుకురావడమంటే, ఏదో మీట నొక్కితే జరిగిపోయే వ్యవహారం కాదు. ఆ రాష్ట్రంలోని అధికారులు, నేతలు, ప్రజలు దశాబ్దాల తరబడి నిబద్ధతతో కృషి చేస్తే కానీ సాధ్యమయ్యే విషయం కాదు. అంతిమంగా కేంద్రం నుంచి ఆసరా లేనిదే, అభివృద్ధి అడుగు కూడా ముందుకు సాగదు. ఇలాంటి సందర్భంలో, నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఏమేరకు చేయూతని అందిస్తోంది అంటే... ఠక్కున ఏదీ గుర్తుకురాని పరిస్థితి.
2014లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్డీఏ) అధికారంలోకి వచ్చేందుకు తెలుగుదేశం ఇచ్చిన సహకారం అంతా ఇంతా కాదు. 16 సీట్లతో ఆ కూటమిలో మూడో అతి పెద్ద పార్టీగా తెలుగుదేశం ఉంది. ఎన్నికల సందర్భంగా నరేంద్ర మోదీ వంటి పెద్దపెద్ద నేతలే, విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు తీవ్రంగా అన్యాయం జరిగిందనీ, దాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ సరిదిద్ది తీరతామని హామీని ఇచ్చారు. అసలే విభజన గురించి కోపంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద ఈ హామీలు బాగానే పనిచేశాయి. తమ ఓట్లన్నింటినీ తెదెపా, వైకాపాలకు మాత్రమే వేశారు. 2009లో 33 లోక్‌సభ స్థానాలు కలిగిన కాంగ్రెస్‌కు గుండుసున్నా మిగిల్చారు.
పాలనలో ఒకో రోజూ గడుస్తున్న కొద్దీ, ఒకో బడ్జెట్ వెలువడుతున్న కొద్దీ, ఆంధ్రప్రదేశ్ ప్రస్తావనే కనిపించకుండా పోతో్ంది. చిన్నపాటి హామీలు సైతం వినిపించడం లేదు. ఉదాహరణకు, విశాఖ రైల్వేను ఒక ప్రత్యేక జోన్‌గా ప్రకటించాలని ఎప్పటినుంచో అక్కడి ప్రజలు కోరుతున్నారు. తూర్పుతీరంలోనే అత్యంత ప్రాధాన్యత కలిగిన విశాఖను ప్రత్యేక జోన్‌గా ప్రకటిస్తే, పాలనాపరమైన సౌలభ్యంతో పాటుగా, రద్దీని నియంత్రించేందుకు అవసరమయ్యే చర్యలన్నింటినీ తీసుకునే అవకాశం ఉంది. ఇంత చిన్న హామీని కూడా రైల్వే బడ్జెట్ తీర్చలేదు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక జోన్‌ను అందిస్తామని ‘ఆంధ్రప్రదశ్ పునర్విభజన చట్టం’లో పేర్కొన్నప్పటికీ ఈ కల నెరవేరలేదు.
ఇక మొన్నటికి మొన్న ప్రవేశపెట్టిన సాధారణ బడ్జెట్‌లో గణాంకాలు కూడా, ఆంధ్రప్రదేశ్‌కు అంత అనుకూలంగా లేవు. ప్రత్యేక ప్యాకేజీ ఊసు కానీ, లోటు బడ్జెటును పూడుస్తామన్న హామీ కానీ నెరవేరలేదు. వేల కోట్లు అవసరమయ్యే పోలవరం వంటి ప్రాజెక్టులకి నామమాత్రంగా 100 కోట్లను కేటాయించి ఊరుకున్నారు. మిత్రపక్షం, అందులోనూ కష్టాల్లో ఉంది కాబట్టి పెద్దగా ప్రతిఘటించదులే అన్న ఆలోచనలో అరుణ్‌జైట్లీ ఉన్నారేమో తెలియదు. అందుకే బడ్జెట్లో కనిపించిన చిత్రాలకు బిత్తరపోయిన చంద్రబాబు, ఆర్థికమంత్రికి ఫోన్ కలిపి తన కోపాన్ని వెలిబుచ్చిన తరువాత కానీ పరిస్థితిలో మార్పు కనిపించలేదు. కేంద్ర మంత్రి ఉమాభారతి హడావుడిగా తాము 100 కోట్లు కాదు, 1600 కోట్లు కేటాయించనున్నట్లు పత్రికా ముఖంగా ప్రకటించారు.
ఈ సంఘటనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఓ విషయం అర్థమై ఉంటుంది. వడ్డించేవాడు మనవాడే అయితే... అన్న సామెతను పక్కన పెట్టి, రాష్ట్రానికి రావల్సిన వాటాల విషయంలోనూ, తీరాల్సిన హామీల విషయంలోనూ గట్టిగా పట్టుపట్టి, అవసరమైనప్పుడు గొడవపడితే కానీ పనులు జరిగేట్లు లేవు. నూతనంగా ఏర్పడిన రాష్ట్రం నిలదొక్కుకోవాలంటే ఈ సూత్రం పాటించక తప్పదు మరి!