ఫలితాల వరకూ ఆగక్కర్లేదు.. పల్నాడు గెలుపు ఎవరిదో తెలిసిపోయింది!
posted on May 18, 2024 @ 3:42PM
పల్నాడులో ఎన్నికల హింస పోలింగ్ ముగిసిపోయినా కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. 2019 ఎన్నికలలో పల్నాడులో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. నరసరావు పార్లమెంటు స్థానంతో పాటు మాచర్ల, వినుకొండ, పెదకూరపాడు, నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల, చిలకలూరి పేట అసెంబ్లీ స్థానాలలో విజయం కేతనం ఎగురవేసింది.
ఆ ఎన్నికలలో కోడెల శివప్రసాదరావు వంటి సీనియర్ మోస్ట్ నేతలు సైతం పరాజయం పాలయ్యారు. ఆ తరువాత వైసీపీ వేధింపులు తట్టుకోలేక కోడెల శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అదలా ఉంచితే 2019 ఎన్నికలలో విజయం తరువాత పల్నాడు పూర్తిగా వైసీపీ కోటగా మారిపోయింది. అక్కడ వైసీపీ ఆడిందే ఆట, పాడిందే పాట చందంగా తయారైంది.
2019 లగాయతు.. ఇప్పటి వరకూ పల్నాడులో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలకు వైసీపీ మూకలు నరకం అంటే ఏమిటో చూపాయి. నిత్యం వేధింపులు, దాడులతో చెలరేగిపోయాయి. పల్నాడులో స్థానిక ఎన్నికలన్నీ ఏకపక్షంగానే మారిపోయాయి. దౌర్జన్యాలు, దాడులు, గృహదహనాలే కాకుండా హత్యలతో కూడా వైసీపీ మూకలు చెలరేగిపోయాయి. అయితే తలుపులు మూసి ఉంచితే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందన్నట్లుగా ఈ ఎన్నికలలో తెలుగుదేశం క్యాడర్ ధైర్యంగా నిలబడింది. వైసీపీ దాడులు, దౌర్జన్యాలను ప్రతిఘటించింది.
ఎన్నికలలో బూత్ ఆక్రమణలు, రిగ్గింగును గట్టిగా నిలువరించింది. తెలుగుదేశం ప్రతిఘటనతో వైసీపీ మూకలు వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఐదేళ్ల దారుణ అణచివేత తరువాత కూడా వైసీపీ శ్రేణులు పుంజుకుని ధైర్యంగా నిలబడగలగడం విస్మయపరిచింది. చావో రేవో అన్నట్లుగా వారు తెగించి పార్టీ కోసం నిలబడ్డారు. ఎక్కడా వెనుకడుగు వేయలేదు. దీంతో వైసీపీ మూకలు ఎంతగా దౌర్జన్యాలకు పాల్పడినా పోలింగ్ మాత్రం భారీగా జరిగింది. పోలింగ్ తరువాత పల్నాడు వైసీపీ నేతలు మీడియా మైకుల ముందుకు వచ్చి ఎన్నికలలో అక్రమాలు జరిగాయి. అధికారులు, పోలీసులు తెలుగుదేశం కూటమికి పూర్తిగా సహకరించారు అంటూ ఏడుపు ముఖాలతో ఆరోపణలు గుప్పించడంతోనే ఇక్కడ పోలింగ్ సరళి, ప్రజల మద్దతు ఎవరివైపు ఉందో అందరికీ అర్ధమైపోయింది.
దీంతో కనీసం కౌంటింగ్ అయినా సజావుగా జరగకుండా చేయాలన్న వ్యూహంతో వైసీపీ మూకలు ఎన్నికల అనంతరం కూడా హింసాకాండను కొనసాగించారు. తెలుగుదేశం శ్రేణులు దానినీ ధైర్యంగా ఎదుర్కొన్నాయి. వైసీపీకి సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన సోదరుడు పరారై అండర్ గ్రౌండ్ కు వెళ్లిపోయారంటే పల్నాడులో వైసీపీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిపోయిందో అవగతం చేసుకోవచ్చు. సర్వేలతో, జూన్ 4న వెలువడే ఫలితాలతో సంబంధం లేకుండానే పల్నాడులో ఫలితమేమిటన్నది వైసీపీ నేతల భాష, బాడీ లాంగ్వేజ్ రాష్ట్రం మొత్తానికీ అర్ధమయ్యేలా చేసింది.