ఆ ధర్నాలకి పరమార్ధం అదేనేమో
posted on Jan 6, 2015 7:44AM
జగన్ కోర్టు కేసుల్లాగే ఆయన పశ్చిమగోదావరి జిల్లా తణుకులో చేయాలనుకొన్న రెండు రోజుల నిరాహార దీక్ష కూడా వాయిదాలు పడుతోంది. మొదట ఈనెల ఆరు, ఏడు తేదీలలో చేయాలనుకొన్నారు. అంటే ఈరోజు నుండి మొదలవ్వాల్సి ఉందన్న మాట. తెదేపాకు కంచుకోట వంటి పశ్చిమ గోదావరి జిల్లాలో వైకాపా బొత్తిగా పట్టు, బలం లేదు. అటువంటి చోట జగన్ స్వయంగా రైతు సమస్యల కోసం అంటూ నిరాహార దీక్ష చేసి తన పార్టీ బలం పెంచుకోవాలని ఆశిస్తున్నారు. అందువల్ల జిల్లాలో వైకాపా మొట్ట మొదటిసారి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం అవడం చాలా అవసరం. అందుకు ప్రజలు, ముఖ్యంగా రైతుల నుండి భారీ స్పందన కూడా చాలా అవసరం.
ఇంతకు ముందు పంట రుణాల మాఫీ అంశంపై ఆ పార్టీ ఆ జిల్లాతో సహా రాష్ట్రంలో అన్ని జిల్లాలలో చేసిన ధర్నా కార్యక్రమాలకి అంతంత మాత్రంగా స్పందన రావడంతో కొంచెం నిరాశ చెంది ఉండవచ్చును. మళ్ళీ ఇప్పుడు పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా అదే అంశంపై తమకు బొత్తిగా పట్టులేని ప్రాంతంలో ధర్నా కార్యక్రమం నిర్వహించాలనుకోవడంతో దానిని విజయవంతం చేయడం ఆ పార్టీ నేతలకి కత్తి మీద సాము వంటిదేనని చెప్పవచ్చును. పైగా ధర్నా కోసం ఆ పార్టీ ఎంచుకొన్న సమయం కూడా బొత్తిగా సరయిన సమయం కాదు. సంక్రాంతి పండుగ సమయానికి పంటలు చేతికి వస్తున్నందున రైతులందరూ చాలా సంతోషంగా ఉన్న సమయంలో జగన్ రైతుల సమస్యలపై నిరాహార దీక్ష చేసుకొని కడుపు మాడ్చుకొన్నా రైతులు ఎవరూ పట్టించుకోకపోవచ్చుననే ఆలోచన కలిగినందునే, జగన్ తన దీక్షను 21,22 తేదీలకి వాయిదా వేసుకొని ఉండవచ్చును.
కానీ ఆ తరువాత తుళ్ళూరులో పంటలకు ఎవరో నిప్పు పెట్టడం, ప్రభుత్వం భూసేకరణకు పూనుకోవడంతో కొన్ని గ్రామాలలో రైతులు ఆందోళన చేస్తుండటం వంటి పరిణామాలను నిశితంగా గమనించిన వైకాపా, ఆ అంశాలను కూడా చేర్చితే తమ ధర్నా కార్యక్రమం హైలైట్ అయ్యే అవకాశం ఉంటుందనే ఆలోచనతోనే బహుశః తన కార్యక్రమాన్ని ఈనెల 31, ఫిబ్రవరి 1 తేదీలకి వాయిదా వేసుకొని ఉండవచ్చును.
వైకాపా ఈ ధర్నా కార్యక్రమాన్ని మళ్ళీ ఇక వాయిదా వేయకపోవచ్చును. ఎందుకంటే ఆ సమయంలో ఎటువంటి పండుగలు, అసెంబ్లీ సమావేశాలు గానీ లేవు. ఈసారి ధర్నా సమయానికి సంక్రాంతి పండుగ హడావుడి కూడా పూర్తపోతుంది. రైతులు కూడా కొంచెం తీరికగా ఉంటారు. కనుక వారిని ధర్నాకు ఆకర్షించడం తేలికవుతుందని వైకాపా ఆలోచన కావచ్చును. తుళ్ళూరు మండలంలో రాజధాని కోసం భూములు ఇచ్చేందుకు నిరాకరిస్తున్న రైతులను కూడా ఈ ధర్నాకి రప్పించే ప్రయత్నాలు చేయవచ్చును. తద్వారా తమది రైతు సమస్యల కోసం చేస్తున్న నిజమయిన పోరాటమని గట్టిగా చెప్పుకొనే అవకాశం ఆ పార్టీకి ఉంటుంది.
ఒకవేళ తుళ్ళూరు రైతులను కూడా ఈ ధర్నాకు రప్పించగలిగినట్లయితే, స్థానిక రైతులు కూడా ఈ ధర్నా కార్యక్రమం పట్ల అఆసక్తి చూపవచ్చును. అదే జరిగితే, ఈ ధర్నాద్వారా ప్రజలలో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుందని వైకాపా ఆలోచన కావచ్చును. కానీ మొన్న తనను కలిసేందుకు వచ్చిన పెనుమాక, నిడమర్రు రైతులతో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం వారి భూములు లాకొన్నా అదైర్యపడవద్దని, నాలుగేళ్ల తరువాత తను అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ వారి భూములు వారికి తిరిగి ఇస్తానని హామీ ఇవ్వడం ద్వారా తను ముఖ్యమంత్రి కావాలని ఎంతగా తపించిపోతున్నారో మరోమారు బయటపెట్టుకొన్నారు. అవి ఓదార్పు యాత్రలు కావచ్చు లేదా పరామర్శ యాత్రలు కావచ్చు లేదా సమైక్యాంధ్ర ఉద్యమాలు కావచ్చు లేదా ఇటువంటి ధర్నాలు కావచ్చును ఏమి చేసినా వాటి అంతిమ లక్ష్యం మాత్రం తను అధికారంలోకి రావడమేనని ఆయనే స్వయంగా చాటుకొన్నట్లయింది.
పుణ్యం కోసం ప్రజలు ఉపవాసాలు చేయడం అందరికీ తెలుసు. కానీ అధికారం కోసం కూడా ఉపవాసాలు చేయవచ్చనే ఆయన ఆలోచనను మెచ్చుకోక తప్పదు. రైతు సమస్యల కోసమే కడుపు మాడ్చుకొంటున్నానని చెపుతున్న జగన్మోహన్ రెడ్డి ధర్నా పట్ల రైతులు, ప్రజలు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.