పాక్ దాడుల నేపథ్యంలో దేశమంతటా హై అలర్ట్
posted on May 8, 2025 @ 10:16PM
ఢిల్లీ ప్రభుత్వోద్యోగులకు సెలవులు రద్దు
హైదరాబాద్ పాత బస్తీలో వ్యాపారాల మూసివేత
భారత్ లోని పఠాన్ కోట్, జైసల్మేర్ లోని వాయుసేన స్థావరాలే లక్ష్యంగా పాకిస్థాన్ గురువారం (మే8) దాడులకు తెగబడింది. ఈ దాడులను భారత్ దీటుగా తిప్పి కొట్టింది. ఎస్- 400 రక్షణ వ్యవస్థ ఈ డాడులను దిగ్విజయం అడ్డుకుని పాక్ డ్డ్రోన్లను కూల్చివేసింది. అలాగే జమ్మూలోని తొమ్మిది ప్రాంతాలపై కూడా పాకిస్థాన్ ఆత్మాహుతి డ్రోన్లు, మిస్సైళ్లతో దాడులకు దిగింది. దీంతో దేశంలోని ఉత్తర ప్రాంతంలో ఎక్కడికక్కడ విద్యుత్ సరఫరాను ప్రభుత్వం నిలిపివేసి బ్లాక్ ఔట్ పాటిస్తున్నారు. జైసల్మీర్ లోని వైమానికి స్థావరం పై కూడా పాక్ ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. వీటిలో ఎంత మేర నష్టం జరిగిందనే విషయంలో క్లారిటీ రావాల్సి ఉంది. ఇక సరిహద్దులో భారీ ఎత్తున దాడులు, ప్రతిదాడులు జరుగుతున్నాయి. ఉత్తర భారతమంతా ఆర్మీ సైరన్లు మోగాయి. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఇప్పటి వరకూ భారత్ సైనిక దళాలు ఎనిమిది పాకిస్థాన్ మిస్సైళ్లను కూల్చివేశాయి. పాకిస్తాన్ దాడుల కారణంగా ధర్మశాలలో జరగుతున్న ఐపీఎల్ మ్యాచ్ ను మధ్యలోనే నిలిపిసి రద్దు చేశారు. అలాగే ఢిల్లీ ప్రభుత్వం తన ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకూ ఎవరికీ సెలవులు లేవని ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ లోని చార్మినార్ సహా పాతబస్తీలోని వ్యాపార సముదాయలన్నీ మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు. చార్మినార్ చట్టుపక్కల ఉన్న తోపుడుబండ్ల వ్యాపారాలను మూసి వేశారు. పాతబస్తీలో పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు.