అఖిల పక్షం.. ఒకటే స్వరం!
posted on May 8, 2025 @ 10:05PM
గుర్తుండే ఉంటుంది, గతంలో భారత సైనికులు గుట్టు చప్పుడు కాకుండా పాకిస్తాన్ భూభాగంలోకి చొచ్చుకుపోయి అక్కడి ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిన సమయంలో ప్రతిపక్షాలు ఎలా స్పందించింది గుర్తుండే ఉంటుంది. సర్జికల్ స్ట్రైక్స్ పై అనుమానాలు వ్యక్తం చేశాయి. ఆధారాలు చూపమని డిమాండ్ చేశాయి.
అంతే కాదు. ముఖ్యంగా పుల్వామా బాంబు దాడికి ప్రతీకారంగా మన సైనికులు బాలాకోట్ పై జరిపిన వైమానిక దాడుల విషయంలో అధికార, విపక్షాల మధ్య యుద్ధాన్ని తలపించే విధంగా మాటల తూటాలు పేలాయి. చివరకు అధికార, విపక్ష పార్టీలు పుల్వామా ఉగ్రదాడిని ఉగ్రవాద స్థావరాలపై భారత సైనికులు జరిపిన మెరుపు దాడి అంశాన్నిఎన్నికల అస్త్రం చేసుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సారధ్యంలో ప్రతిపక్ష పార్టీలు అధికార బీజేపీ పుల్వామా బాంబు దాడిలో మరణించిన సాయుధ దళాల త్యాగాలను రాజకీయం చేస్తున్నదనీ, ఎన్నికల ప్రయోజనానికి ఉపయోగించుకుంటోందనీ ఆరోపించాయి. అలాగే ఆ తర్వాత బాలాకోట్ వైమానిక దాడులకు సంబంధించి అధికార విపక్ష పార్టీల మధ్య మాటల తూటాలు పేలాయి. బాలాకోట్‌లో వైమానిక దాడులతో పాకిస్తాన్‌కు జరిగిన నష్టానికి సంబంధించి ప్రధాని మోదీ ప్రభుత్వం ఆధారాలు చూపాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది.
ఇదనే కాదు.. 2016లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాద స్థావరాలపై మోదీ ప్రభుత్వం నిర్వహించిన సర్జికల్ స్ట్రైక్స్ మొదలు ఉద్రిక్తల నడుమ భారత పభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని,ప్రతి చర్యను విపక్షాలు విమర్శిస్తూనే వచ్చాయి. నిజానికి కార్గిల్ యుద్ధం సమయంలోనూ కాంగ్రెస్ పార్టీ. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పాక్ అనుకూల వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించాయనీ, ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికీ బీజేపీ విజయానికి అదీ ఒక కారణంగా, విశ్లేషణలు వినిపించాయి. నిజానికి భారత్, పాక్ శత్రు-మిత్ర సంబంధాల విషయంలో కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉత్తర దక్షిణ దృవాల మధ్య ఉన్నంత వ్యత్యాసం వుంది.
అయితే, గతం ఎలా ఉన్నప్పటికీ పహల్గాం ఉగ్రదాడి విషయంలో.. అలాగే ఉగ్రదాడికి ప్రతికారంగా భారత సైన్యం, భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రతిపక్ష పార్టీలు అన్నీ ప్రభుత్వానికి సంపూర్ణ మద్దదు ప్రకటించాయి. సరే మధ్య మధ్యలో చిన్న చిన్న పొరపొచ్చాలోచ్చినా గురువారం (మే8) ఆపరేషన్ సిందూర్ సమాచారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అఖిల పక్ష సమావేశంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు చెక్కుచెదరని ఐక్యతను ప్రదర్శించాయి. భారత దేశం ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితిలోనూ ఉపేక్షించదని, మరో మారు, ప్రపంచానికి స్పష్టం చేసింది.
గత నెల 22న పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు, జరిపిన పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ సేనలు ఆపరేషన్ సిందూర్ పేరిట గట్టిగా బదులిచ్చిన సంగతి తెలిసిందే. మన భద్రతా బలగాలు మంగళవారం ( మే 6) అర్ధరాత్రి దాటాక అత్యంత కచ్చితత్వంతో ఉగ్ర స్థావరాలపై దాడి చేసి 100 మందికి పైగా ఉగ్ర వాదులను మట్టు పెట్టడం పట్ల దేశమంతా హర్షం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ గురించి వివరించేందుకు ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించింది.
సమావేశం అనతరం మీడియాతో క్లుప్తంగా మాట్లాడిన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, ఆపరేషన్ సిందూర్ విషయంలో ప్రతిపక్షాలన్నీ ప్రభుత్వానికి అండగా ఉన్నాయని అన్నారు. అలాగే, ఉగ్రవాద నిర్మూలన విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి, ప్రతి చర్యకు ప్రతిపక్షాల సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ప్రతిపక్ష పార్టీ నాయకులు పరిస్థితిని అర్థం చేసుకుని పరిణతిని చూపారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారని అన్నారు. ఇతర విషయాలు, వివ్దాలు ఎలా ఉన్నా,దేశ భద్రత, ఉగ్రవాద సమస్య వంటి విషయాల్లో రాజకీయాలకు తావులేదని, అధికార, ప్రతి పక్ష నాయకులు ముక్త కంఠంతో ఒకటే స్వరాన్ని వినిపించారు.