యుద్ధం మొదలైంది! జమ్మూకాశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ లలో బ్లాకవుట్
posted on May 8, 2025 @ 10:44PM
భారత్ పాకిస్థాన్ మధ్య యుద్ధం మొదలైంది. పాక్ బరితెగింపు కారణంగా ఇరు దేశాల మధ్యా వార్ సైరన్ మోగింది. తొలుత జమ్మూ లక్ష్యంగా పాకిస్థాన్ దాడులకు పాల్పడింది. జమ్మూ విమానాశ్రయం, సహా జమ్మూలోని ఏడు ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని పాక్ చేసిన దాడులకు భారత్ దీటుగా స్పందించింది. దీంతో ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తోందా అన్నట్లుగా పరిస్థితి మారింది. బాంబుల మోతలతో సరిహద్దు ప్రాంతాలు దద్దరిల్లుతున్నాయి. జమ్మూ సహా రాజస్థాన్, పంజాబ్, గుజరాత్ లలో యుద్ధ వాతావరణం నెలకొంది. ఆయా రాష్ట్రాలపై పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత దళాలు చాలా వరకూ కూల్చివేశాయి.
ఆ రాష్ట్రాలలో పూర్తి అంధకారం అలుముకుంది. విద్యుత్ సరఫరా నిలిపివేసి కంప్లీట్ బ్లాక్ అవుట్ ప్రకటించారు. . పాక్ దాడులను భారత సైన్యం గగనతల రక్షణ వ్యవస్థలతో నిర్వీర్యం చేస్తోంది. జమ్మూ యూనివర్సిటీకి సమీపంలో రెండు డ్రోన్లను ధ్వంసం చేసినట్లు సమాచారం. మొత్తంగా ఇప్పటివరకు ఎనిమిది డ్రోన్లను నిర్వీర్యం చేసినట్లు తెలిసింది.
భారత్-పాక్ మధ్య తాజాగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల వేళ జైషే మహ్మద్, లష్కరే తొయిబా వంటి ఉగ్రసంస్థలు దాడులకు పాల్పడవచ్చన్న నిఘా వర్గాల హెచ్చరికలతో జమ్మూకశ్మీర్, పంజాబ్ రాష్ట్రాల్లో హైఅలర్ట్ జారీ చేశారు. దీంతో ఆయా రాష్ట్రాల్లోని ఆలయాలు, నీటి ప్రాజెక్టుల వద్ద భద్రత కట్టుదిట్టం చేశారు. పంజాబ్ అంతటా కరెంట్ బంద్ చేశారు. అలాగే రాజస్దాన్ లోనూ హై అలర్ట్ ప్రకటించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన అత్యవసర మంత్రివర్గ సమావేశం పరిస్థితిని సమీక్షించి తీసుకోవలసిన చర్యలపై చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. సున్నితమైన ప్రాంతాలలో బ్లాక్ అవుట్ ప్రకటించింది.