ఆపరేషన్ లాక్‌డౌన్.. క్లైమాక్స్ ట్విస్ట్ అదుర్స్.. డోంట్ మిస్..
posted on May 25, 2021 @ 11:40AM
అతనికి పోలీసులు చుక్కలు చూపించారు. లాక్‌డౌన్ కావడంతో అడుగడుగునా అడ్డుకున్నారు. మొత్తం పది చోట్ల పోలీసులు అతన్ని పరేషాన్ చేశారు. మొత్తానికి ఎలాగోలా అతను తను అనుకున్నది చేసేశాడు. లాక్‌డౌన్ సమయంలో రోడ్లపై తిరగడం ఎంత కష్టమో చెప్పడానికి అతనే బెస్ట్ ఎగ్జాంపుల్. పోలీసులు ఎంత పర్‌ఫెక్ట్‌గా లాక్‌డౌన్ అమలు చేస్తున్నారో ఈ విషయం చదివితే తెలిసిపోతుంది. క్లైమాక్స్ ట్విస్ట్ మరింత అదిరిపోతుంది. డోంట్ మిస్...
సిద్ధిపేటకు చెందిన అతను పాత బట్టలు వేసుకున్నాడు.. తలకు రుమాలు కట్టుకున్నాడు.. ఓ పాత బైకుపై రోడ్డు మీదకు వచ్చాడు.. మొదట ఓ చెక్ పోస్ట్ దగ్గర పోలీసులు ఆపేశారు. ఎక్కడికి వెళ్తున్నావ్? అంటూ దబాయించారు. మెడికల్ షాప్‌కని చెప్పి బతిమిలాడుకుంటే వదిలేశారు. టార్గెట్ 1 కంప్లీటెడ్.
బైక్‌పై మరింత ముందుకు వెళితే.. మరో చోట పోలీసులు అడ్డుకున్నారు. బయట ఎందుకు తిరుగుతున్నావంటే.. జ్వరం టాబ్లెట్స్ కూడా తెచ్చుకోనివ్వరా అని ప్రశ్నించాడు. అక్కడ డ్యూటీలో ఉన్న ఎస్ఐ కాస్త సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చి వెళ్లనిచ్చాడు. టార్గెట్ 2 కంప్లీటెడ్.
ఇంకోచోట మళ్లీ పోలీసులు. ఈసారి కాస్త బిల్డప్ ఇచ్చాడు. ‘మంత్రి నాకు తెలుసు..కావాలంటే పీఏకి ఫోన్ చేసి మాట్లాడిస్తా అంటూ ఫోజు కొట్టాడు. మనోడి అవతారం చూసి.. మంత్రి తెలుసంటే నమ్మలేదు. గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. పోలీసులు ముందుకు వెళ్లనివ్వలేదు. అతికష్టం మీద ఎలాగోలా అక్కడి నుంచి బయటపడ్డాడు. టార్గెట్ 3 కంప్లీటెడ్.
ఇలా.. ఒకటి, రెండు కాదు.. సిద్దిపేట మొత్తం తిరుగుతూ.. 10 చెక్‌పోస్టులు దాటేశాడు అతగాడు. దాదాపు అన్నిచోట్ల పోలీసులు చుక్కలు చూపించారు. లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నారని అతనికి అర్థమైపోయింది. అందుకే, శభాష్ అంటూ పోలీసులందరినీ అభినందించాడు అతడు.
ఇంతకీ, అతనెవరో చెప్పలేదు కదా. పాత దుస్తులు, తలకు రుమాలు, పాత బైక్‌తో సిద్దిపేట మొత్తం చుట్టేస్తూ.. పోలీస్ చెక్‌పోస్టులన్నిటినీ చెక్ చేస్తూ వెళ్లిన అతను.. అడిషనల్ ఎస్పీ రామేశ్వర్, ఐపీఎస్.
సిద్దిపేటలో లాక్‌డౌన్ అమలు, ప్రజల పట్ల పోలీసుల ప్రవర్తన, ఖాకీల విధినిర్వహణ ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి అదనపు ఎస్పీ రామేశ్వర్ ఇలా సాధారణ పౌరుడి అవతారమెత్తారు. మారువేషంలో స్వయంగా పోలీసుల పనితీరు తెలుసుకున్నారు. లాక్‌డౌన్ అమలు తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. తిరుగు పయనంలో తలకు రుమాలు లేకుండా వచ్చిన అదనపు ఎస్పీ రామేశ్వర్‌ని చూసి పోలీసులే ఆశ్చర్యపోయారు.