బీజేపీకి యూపీ టెన్షన్.. వ్యూహరచనలో మోడీ -షా టీమ్
posted on May 25, 2021 @ 12:02PM
ఆరేడు నెలల్లో ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మణిపూర్ రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో కమలదళంలో ఇప్పటినుంచే గుబులు మొదలయింది. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్, పార్టీ ఇమేజ్ తో పాటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇమేజ్ ని గట్టిగా దెబ్బతీసిన నేపధ్యంలో వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో అన్న భయం సహజంగానే, బీజేపీని కలవరపాటుకు గురి చేస్తోంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్’లో గెలుపు బీజేపీకి ప్రాణవాయువుతో సమానం. 80 లోక్ సభ స్థానాలున్నా ఉత్తర ప్రదేశ్ ‘లో బీజీపీ గెలుపు ఓటములు ఇటు పార్టీకి, అటు ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ భవిష్యత్’కు కూడా అత్యంత కీలకం. ఉత్తర ప్రదేశ్’లో బీజీపీ ఓడిపోవడం అంటూ జరిగితే, 2024 లోక్ సభ ఎన్నికలపై ఆ ప్రభావం చాలా బలంగా ఉంటుంది. అలాగే, మోడీ, అమిత్ షాల నాయకత్వం కూడా ప్రశ్నార్ధకంగా మారుతుంది. మోడీ స్థానంలో నితిన్ గడ్గరీ వంటి మరో నేత తెర పైకి వచ్చినా వస్తారు.
ప్రస్తుతం యూపీలో పరిస్థితి, కమల దళానికి ఏ మాత్రం అనుకూలంగా లేదు. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం వైఫల్యానికి గంగానదిలో తేలిన శవాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి.అలాగే, రాష్ట్రంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి అనేందుకు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలే సాక్ష్యంగా నిలుస్తాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా ప్రజలు బీజేపీని తిరస్కరించారు. ఈ నేపధ్యంలో బీజేపీ మాతృ సంస్థ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ ఎస్ ఎస్) సంఘటనా కార్యదర్శి దత్తాత్రేయ హాస్బోలె గత ఆదివారం, ప్రధాని నరేంద్ర మోడీ, అమిస్తా షా, పార్టీ అధ్యక్షుడు, జేపీనడ్డా. పార్టీ యూపీ ఇన్-చార్జి సునీల్ బన్సల్ సహా బీజేపీ కీలక నేతలతో జరిపిన సమావేశం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే యూపీ సహా నాలుగు రాష్ట్రాల ఎన్నికలు, ఎన్నికల ఫలితాలపై, కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనే విషయంపైనే చర్చించినట్లు సమాచారం.
కరోనా ఫస్ట్ వేవ్’ను సమర్ధవంతంగా ఎదుర్కున్న ప్రధాని మోడీ ప్రభుత్వం, సెకండ్ వేవ్’ను విషయంలో సంపూర్ణంగా విఫలమైందనే అభిప్రాయం సర్వత్రా వ్యాపించింది. ఆసుపత్రి పడకల నుంచి ఆక్సిజన్ వరకు అన్నిటికీ కొరత ఏర్పడడంతో ప్రభుత్వం కరోనా సెకండ్ వేవ్’ను ఎదుర్కునేందుకు అవసరమైన చర్యలు తీసుకోలేదన్న భావన అంతటా వ్యాపించింది. ఒక్క ఉత్తరప్రదేశ్’లో మాత్రమే కాదు, దేశ వ్యాప్తంగా అదే అభిప్రాయం/పర్సెప్షన్ అందరిలో ఏర్పడింది. బీజేపీ కార్యకర్తలు, సంఘ్ పరివార్ సంస్థలు, మోడీ అభిమానులలో కూడా చాలావరకు అదే అభిప్రాయం నాటుకుపోయింది. చివరకు ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ కరోనా సెకండ్ వేవ్ ఉదృతికి కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష ధోరణి, సకాలంలో సరైన చర్యలు తీసుకోకపోవడం కూడా కారణమని అన్నారు.అందుకు ప్రజల నిర్లక్ష్యం తోడై పరిస్థితి అదుపు తప్పిందని వివరణ ఇచ్చారు. అయితే,అంతిమంగా కరోనా పై విజయం సాధిస్తామన్న విశ్వాసాన్ని వ్యక్తపరిచారు.
గత ఆదివారం జరిగిన ఆర్ఎస్ఎస్, బీజేపీ అగ్రనేతల సమావేశంలో రానున్న నాలుగు రాష్త్రాల ఎన్నికలతో పాటుగా ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల శాసన సభ ఎన్నికల ఫలితాలు, వైఫల్యాలపై ప్రధానంగా చర్చించినట్లు పార్టీ వర్గాల సమాచారం.పశ్చిమ బెంగాల్లో సంస్థాగత బలహీనతలను పరిగణనలోకి తీసుకోకుండా,అతిగా ఆశలు పెంచుకోవడం వలన నిరాశకు గురి కావలసి వచ్చిందని, అలాకాకుంటే, బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు దేశ వ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం ఏర్పడేదని, ముఖ్యంగా పార్టీ కార్యకర్తలు, అభిమానుల నైతిక స్థైర్యం మరింత పెరిగేదని అగ్రనేతలు అభిప్రాయ పడినట్లు సమాచారం. అలాగే, సంస్థాగతంగా పార్టీ నిర్మాణం లేకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన నాయకులతో విజయాన్ని సాధించడం అన్ని సందర్భాలలో సాధ్యం కాదని, బెంగాల్ ఫలితాలు మరోమారు నిరుపించాయని పరివార్ పెద్దల సమావేశం నిర్ణయానికి వచ్చింది.
వచ్చే సంవత్సరం ఆరంభంలో నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, పార్టీ మరింత పటిష్ట వ్యూహంతో సిద్ధం కావాలని నిర్ణయించారు. అందులో భాగంగా పార్టీ కార్యకర్తలు , ఇప్పటినుంచే నడుం బిగించాలని ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని, ఆదుకోవడంతో పాటుగా విపక్షాల విమర్శలను తిప్పికొట్టే విధంగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని సమావేశం నిర్ణయించింది. ఈ నేపధ్యంలోనే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా,ఈ మే 30న ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడేళ్ళు పూర్తి చేసుకుంటున్న సందర్భాన్ని పురస్కరించుకుని, వేడుకలకు బదులుగా సేవా కార్యక్రమాలను నిర్వహించాలని, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాశారు.అలాగే, కరోనా కాటుకు తల్లి తండ్రులను కోల్పోయిన అనాధ పిల్లలను ఆదుకునేందుకు బీజేపీ పాలిత రాష్రాలు ప్రత్యేక పథకాలు ప్రకటించాలని కూడా నడ్డా సూచించారు. అదే విధంగా బీజేపీ కార్యకర్తలు, ‘సేవా హీ సంఘటన్’ (సేవే సంఘటన) అన్న ఆదర్శంతో, ప్రభుత్వ ఆసుపత్రులలో మందులు, హాస్పిటల్ బెడ్స్, ఆక్సిజన్ ఏర్పాట్లు చేయాలని నడ్డా తమ లేఖలో పేర్కొన్నారు. మొత్తానికి కమల దళం .. ముందున్న ముప్పును ముందుగానే గ్రహించింది. నష్ట నివారణకు నడుం బిగించింది. ఫలితాలు ఎలా ఉంటాయో ... కాలమే నిర్ణయిస్తుంది.