బీజేపీ, కాంగ్రెస్ ఆహ్వానాలు.. సొంత పార్టీ దిశగానే అడుగులు?
posted on May 25, 2021 @ 11:06AM
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ దారెటు? ఆయన కొత్త పార్టీ పెడతారా లేక ఏదో ఒక పార్టీలో జాయిన్ అవుతారా? కారు సింబల్ పై గెలిచిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. తనను మంత్రివర్గం నుంచి అవమానకరంగా బర్తరఫ్ చేశారనే కోపంతో ఉన్న రాజేందర్... కేసీఆర్ టార్గెట్ గానే అడుగులు వేయబోతున్నారన్నది స్పష్టం. అయితే కొత్త పార్టీతో కేసీఆర్ ను ఢీకొడతారా లేక ఇప్పుడున్న పార్టీల్లోనే ఏదో ఒక దాంట్లో చేరి గులాబీ బాస్ ను ఎదుర్కొంటారా అన్న దానిపై మాత్రం క్లారిటీ రావడం లేదు. బీసీ ఎజెండాతో కొత్త పార్టీ పెడతారని ఈటల అనుచరులు చెబుతుండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఆయనకు గాలం వేస్తున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఉన్న, బీసీ నేతగా ఎదిగిన ఈటల రాజేందర్ ను తమ పార్టీలో చేర్చుకోవడానికి కాంగ్రెస్, బీజేపీలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు ముఖ్యనేతలు ఆయనతో చర్చలు జరిపారని తెలుస్తోంది. రాహుల్ తోనూ మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారట. ఈటల మాత్రం వాళ్లకు ఎలాంటి హామీ ఇవ్వలేదని, కొంత సమయం కావాలని చెప్పినట్లు చెబుతున్నారు. కమలం నేతలు కూడా ఈటల కోసం రంగంలోకి దిగారంటున్నారు. బీజేపీ జాతీయ నేత భూపేందర్ యాదవ్ హైదరాబాద్ వచ్చి రాజేందర్ తో రహస్యంగా చర్చలు జరిపారని సమాచారం. సుమారు రెండు గంటలపాటు ఈటలతో పలు కీలక విషయాలపై సుదీర్ఘంగా చర్చించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఫాంహౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారట. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ను పార్టీలోకి రావాలని బీజేపీ నేతలు ఆహ్వానించారు. తెలంగాణలో బీసీ వాయిస్ తో ఎదగాలని చూస్తున్న కమలనాధులు.. బలమైన బీసీ నేతగా ఉన్న ఈటల రాజేందర్ కు సముచిత స్థానం ఇస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీలో చేరే అంశంపై ఈటల రాజేందర్ స్పష్టత ఇవ్వలేదని, బీజేపీ ఆఫర్ పై తన సన్నిహితులతోనూ ఆయన చర్చించారని తెలుస్తోంది.
బీజేపీ, కాంగ్రెస్ ప్రయత్నాలు కొనసాగుతుండగానే... తన ట్విట్టర్ అకౌంట్ లో మార్పులు చేసి కొత్త సంకేతమిచ్చారు రాజేందర్. సొంత పార్టీ దిశగానే ఆయన ప్రయాణం సాగుతోందని కనిపిస్తోంది. వామపక్ష భావజాలానికి స్ఫూర్తిగా బిగించిన పిడికిలిని తెలంగాణ మ్యాప్‌లో పెట్టుకున్నారు. హిందు ఓటుబ్యాంకును ఆకర్షించడానికి కాషాయం రంగు.. తెలంగాణ రాష్ట్ర సెంటిమెంట్ కోసం తెలంగాణ తల్లి చిత్రాన్ని పెట్టుకున్నారు. రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన ప్రజల త్యాగానికి గుర్తుగా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని పెట్టుకున్నారు. బీసీల గొంతుకగా, ఆ వర్గానికి చెందిన జ్యోతిబా ఫూలే చిత్రాన్ని పెట్టుకున్నారు. దళిత, బహుజనులు ఆరాధ్యునిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఫోటోను పెట్టుకున్నారు. జై తెలంగాణ నినాదానికి స్ఫూర్తిగా నిలిచే ప్రొఫెసర్ జయశంకర్ చిత్రపటాన్ని ఉంచారు. ఆత్మగౌరవం మొదలు అమరుల స్ఫూర్తి వరకు అన్నింటినీ తన ప్రొఫైల్ పిక్చర్‌లో పెట్టుకున్న ఈటల రాజేందర్ తన భవిష్యత్ రాజకీయాలను కూడా ఈ స్ఫూర్తితోనే కొనసాగించాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు.
మరోవైపు మంత్రివర్గం నుంచి ఉద్వాసనకు గురైన ఈటల రాజేందర్ ఇప్పటికీ టెక్నికల్‌గా టీఆర్ఎస్ పార్టీ సభ్యుడిగా, ఆ పార్టీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తనంతట తానుగా పార్టీ నుంచి వెళ్ళిపోయేలా టీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంటే, పార్టీయే గెంటివేసే వరకు వేచి చూడాలని ఈటల ఆలోచిస్తున్నారు. ఇంట గెలిచాకే రచ్చ గెలవాలనే ఆలోచనతో ఆయన ఉన్నారని తెలుస్తోంది. రాజీనామాతో హుజూరాబాద్‌కు ఉప ఎన్నిక తీసుకొచ్చి, అక్కడ గెలిచి టీఆర్‌ఎస్‌కు సవాల్ విసరాలని, ఆపై కలిసివచ్చే వ్యక్తులు, శక్తులతో కలిసి ముందుకు సాగాలనేది ఈటల ఉద్దేశంగా చెబుతున్నారు. ఏదో ఒక పార్టీలో చేరడం కంటే సొంతంగానే అడుగులు వేయాలనే యోచనలోనే ఈటల రాజేందర్ ఉన్నట్లు ఆయన అనుటరులు చెబుతున్నారు.