ఒమిక్రాన్ హాట్ స్పాట్ గా హైదరాబాద్! ఆంక్షలు విధించాలన్న హైకోర్ట్..
posted on Dec 23, 2021 @ 10:49AM
తెలంగాణలో ఒమిక్రాన్ కేసులు వేగంగా పెరిగిపోతున్నాయి. బుధవారం ఒక్కరోజే 14 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదు కావడంతో... హైదరాబాద్ హాట్ స్పాట్ గా మారిందనే ఆందోళన వ్యక్తమవుతోంది.ఇప్పటి వరకు వైరస్ బాధితుల్లో 6 రిస్క్ దేశాల నుంచి, 31 మంది నాన్ రిస్క్ దేశాల నుంచి రాగా... మరొకరు కాంటాక్ట్ వ్యక్తి వైరస్ సోకింది. ఇప్పటికే ప్రైమరీ కాంటాక్టుగా ఉన్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ డాక్టర్ కు ఒమిక్రాన్ సోకింది. అతని కాంటాక్టులకు పరీక్క్షలు చేయించారు. వాళ్ల రిపోర్టులు రావాల్సి ఉంది. సెకండరీ కాంటాక్ట్ వ్యక్తులకు ఒమిక్రాన్ నిర్దారణ అయితే వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది.
కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టులో గురువారం విచారణ జరిగింది. ఒమైక్రాన్ వైరస్ తీవ్రత దృష్ట్యా న్యూ ఇయర్ వేడుకలు, క్రిస్మస్ వేడుకలకు ఆంక్షలు విధించాలని న్యాయస్థానం తెలిపింది. జనం గుంపులు గుంపులుగా గుమి గూడకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి, పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. రెండు రోజుల్లో ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టు పేర్కొంది. ఎయిర్ పోర్ట్‌లో ఉన్న విధంగానే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే జనాలకు తగిన పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటు చేయలని ధర్మాసనం ఆదేశించింది.
మరోవైపు జిల్లాలోనూ ఒమిక్రాన్ భయాందోళనలు పెరిగిపోయాయి. జనాలు సెల్ఫ్ లాక్ డౌన్ విధించుకుంటున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలో ప్రజలు సెల్ఫ్ లాక్ డౌన్ ప్రకటించారు. ఇటీవల దుబాయ్ నుంచి గూడెం సొంత గ్రామానికి వచ్చిన వ్యక్తికి ఒమైక్రాన్ నిర్దారణ అయింది. తాజాగా అతని తల్లి, భార్యకు కూడా కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. దీంతో గ్రామంలో 10 రోజుల పాటు లాక్ డౌన్ విధించారు. ఎల్లారెడ్డి పేట మండలం, నారాయణపురంలో ఓ శుభకార్యంలో బాధితుడు పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న 53 మంది నమూనాలను వైద్యాధికారులు సేకరించి, వారిని ఇళ్ళ నుంచి బయటకు రావద్దని ఆదేశించారు.