ఎన్జీటీ బోనులో జగన్ సర్కార్! రుషికొండ తవ్వకాలపై సీరియస్..
posted on Dec 23, 2021 @ 11:06AM
విశాఖపట్నం రుషికొండ వద్ద ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ చేపట్టిన సమీకృత పర్యాటక సముదాయం ప్రాజెక్టు నిర్మాణం పనులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది. రుషికొండ వద్ద ప్రస్తుతం ఉన్న నిర్మాణాలు తీసేసి, కొండవాలును తొలగించి చదును చేస్తున్న క్రమంలో వాస్తవ పరిస్థితులు తెలుసుకునేందుకు నలుగురు సభ్యులతో స్వతంత్ర కమిటీ ఏర్పాటుకు ఆదేశించింది. ఈ కమిటీలో కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (సీపీసీబీ), రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి (ఏపీపీసీబీ), రాష్ట్ర పర్యావరణ ప్రభావ అంచనాల ప్రాధికార సంస్థ (ఎస్ఈఐఏఏ), జిల్లా కలెక్టర్ ఉండాలని పేర్కొంది. ఈ కమిటీకి నోడల్ ఏజెన్సీగా ఎస్ఈఐఏఏ సమన్వయం చేయాలని సూచించింది. ఈ కమిటీ సభ్యులు త్వరలోనే క్షేత్రస్థాయిలో పరిశీలన చేస్తారు.
రుషికొండ వద్ద నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తవ్వేస్తున్నారని, బృహత్తర ప్రణాళికను పట్టించుకోవడం లేదని, దీంతో పర్యావరణానికి తీరని హానీ కలుగుతోందని ఎంపీ రఘురామకృష్ణ రాజు ఎన్జీటీలో ఫిర్యాదు చేశారు. దీంతో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రంగంలోకి దిగింది. ఈ నెల 17న ప్రాథమిక విచారణ చేపట్టింది. ఈ కేసులో ప్రతివాదిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని చేర్చింది. ఏపీ నగరాభివృద్ధి సంస్థ చట్టం ప్రకారం బృహత్తర ప్రణాళికలో పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ప్రభుత్వమే ఇలా హాని తలపెట్టడంపై ఎన్జీటీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నలుగురు సభ్యుల స్వతంత్ర కమిటీ రెండు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టం చేసింది.
విదేశీ, స్వదేశీ పర్యాటకులను ఆకట్టుకునేందుకు సముద్రానికి అభిముఖంగా 65 ఎకరాల్లో సమీకృత పర్యాటక సముదాయం నిర్మించేందుకు ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ముందుకొచ్చింది. సముద్రం అందాల్ని కొండపై నుంచే పర్యాటకులు వీక్షించేందుకు రుషికొండ ప్రాంతం అనువుగా ఉందని భావించడంతో సమీకృత పర్యాటక సముదాయం నిర్మించాలని ఏపీటీడీసీ నిర్ణయించింది. రుషికొండ ప్రాంతంలో ప్రస్తుతం హరిత బీచ్ రిసార్ట్, ఓ ప్రైవేట్ హొటల్ ఉన్నాయి. కొత్త ప్రాజెక్టు కోసం హరిత రిసార్ట్, ప్రైవేట్ హొటల్ ను తీసేసి, రుషికొండ కొండవాలును తొలగించి చదునుగా చేయాల్సి ఉంది. రుషికొండ పర్యాటకుల సముదాయ భవనాల్లో అతిథిగృహాలు, ఆడిటోరియం, కన్వెన్షన్ సెంటర్లు, భోజన హొటళ్లు, ఉల్లాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఏపీటీడీసీ కార్యాచరణ రూపొందించింది.
నిజానికి రుషికొండ వద్ద ఏపీటీడీసీ చేపట్టిన ప్రాజెక్టు విషయంలో పర్యావరణ నిపుణులు మొదటి నుంచీ అనుమానాలు వ్యక్తం చేస్తుండడం గమనార్హం. సీఆర్జెడ్, పర్యావరణ, అటవీశాఖ అనుమతులు తీసుకున్నప్పటికీ ప్రస్తుతం రుషికొండ వద్ద జరుగుతున్న పనులు పర్యావరణానికి తీవ్ర విఘాతం కలిగేలా ఉన్నాయని వారు భావిస్తున్నారు. రుషికొండ కింద నుంచి పైవరకు సగానికి పైగా తొలిచేయడమే ఇలా నిపుణుల అనుమానాలకు తావిస్తోంది. ఒకప్పుడు ఎంతో పచ్చగా కనిపించే రుషికొండపై ఇప్పుడు ఆ పచ్చదనమే కనిపించకుండా చేసిన పరిస్థితులు ఉన్నాయి. కొండ చుట్టూ తవ్వడంతో మరోపక్కన బండరాళ్లు రోడ్డు మీదకి దొర్లిపడే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సీఆర్ జెడ్ అనుమతులను పైకి చూపించి, నిబంధనలకు వ్యతిరేకంగా కొండను తొలిచే పనులు జరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. సముద్రం పక్కనే ఉన్న రుషికొండను ఇలా తొలిచేస్తే కొత్త సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. రుషికొండలో తవ్వేసిన మట్టిని సముద్ర తీరంలో డంప్ చేయడం పట్ల కూడా పర్యావరణ వేత్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తుండడం గమనార్హం.
రుషికొండ వద్ద ఏపీటీడీసీ చేస్తున్న పనులపై స్వతంత్ర కమిటీ ఎలాంటి నివేదిక ఇస్తుందో.. తదుపరి పరిణామాలో ఎలా ఉంటాయన్నది వేచి చూడాల్సిందే.