ఏపీలో చీకట్లు.. బాకీ చెల్లించక కరెంట్ కట్.. జగనన్నా ఏందన్నా?
posted on Feb 5, 2022 @ 11:48AM
వైసీపీ సర్కార్ చేతకానితనం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పుడు చీకట్లో మగ్గిపోవాల్సిన దుస్థితి దాపురించింది. ఏపీ డిస్కంలు తనకు బకాయి పడిన 350 కోట్ల రూపాయల్లో కనీసం 30 కోట్లయినా చెల్లించాలన్న నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (ఎన్టీపీసీ)కి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా మొండికేశాయి. దీంతో ఏపీకి సరఫరా చేస్తున్న 2 వేల మెగావాట్ల విద్యుత్ సరఫరాను కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ ఎన్టీపీసీ నిలిపేసింది. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించడంలో ఏపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో ఎన్టీపీసీ ఈ నిర్ణయం తీసుకుంది. అంతే కాకుండా తన బకాయిల వ్యవహారం పరిష్కారం అయ్యే వరకూ బహిరంగ మార్కెట్ లో అయినా కొనుగోలు చేసుకునేందుకు ఏపీ విద్యుత్ సంస్థలకు ఛాన్స్ లేకుండా బ్లాక్ చేసింది. దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో చీకటి రాజ్యమేలుతోంది. ఏపీలోని పలు ప్రాంతాల్లో రోజుకు 8 గంటల వరకు విద్యుత్ కోతలు అమలవుతుండడంతో అటు ప్రజలు, ఇటు పరిశ్రమలు ఇబ్బందులకు గురవుతున్నారు.
ఏపీకి ఎన్టీపీసీ విద్యుత్ సరఫరాను నిలిపేయడంతో రాష్ట్ర అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ లోటును ఆర్టీపీపీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించారు. ఆర్టీపీపీలో మరో యూనిట్ను ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. అందుకు సరిపడినంతగా బొగ్గు నిల్వలు లేవని ఆర్టీపీపీ స్పష్టం చేసింది. దీంతో ఇంధన శాఖ అధికారులు అయోమయంలో పడిపోయారు. ఆర్టీపీపీలో ప్రస్తుతం ఐదు రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని తెలుస్తోంది.
అనాలోచిత నిర్ణయాలు, అడ్డు అదుపూ లేకుండా జగన్ రెడ్డి సర్కార్ చేసిన ఖర్చులతో రాష్ట్ర ఖజానా ఖల్లాస్ అయిపోయింది. దాంతో రోజువారీ నిర్వహణ కోసం కూడా దొరికిన చోటల్లా అప్పుటు చేసింది. అవీ చాలకపోవడంతో శాఖలు, సంస్థల నుంచి బతిమాలి, బెదిరించి నిధులు తరలించుకుపోయింది. అయినా కరువు తీరలేదు. ఇప్పుడిక అత్యవసర సేవలకు కూడా బిల్లులు చెల్లించే పరిస్థితి లేకుండా చేసుకుంది. అత్యవసరమైన విద్యుత్ సరఫరా బిల్లులు ఎన్టీపీసీకి చెల్లించకపోవడంతో ఏపీ సర్కార్ బండారం బయటపడినట్లయింది. ఖజానాలో కాసులు లేకపోవడంతో బిల్లులు చెల్లించకుండా మొండికేస్తోంది.
పేరుకుపోయిన బిల్లులు చెల్లించాలని ఏపీ డిస్కంలకు రెండు నెలలుగా ఎన్టీపీసీ లేఖలు రాస్తూనే ఉంది. అయినా పట్టించుకున్న దాఖలాలు లేకపోవడంతో ఎన్టీపీసీ కఠిన నిర్ణయం తీసుకుంది. విశాఖ సింహాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 800 మెగావాట్ల విద్యుత్ ను ఏపీ డిస్కంలో తీసుకుంటున్నాయి. ఎన్టీపీసీకి 350 కోట్ల రూపాయలు డిస్కంలు బాకీ పడ్డాయి. కనీసం 30 కోట్లు అయినా చెల్లించమని అడిగితే డిస్కంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించాయి. దీంతో గురువారం నుంచి ఎన్టీపీసీ విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్లు ఒక డిస్కం అధికారి వెల్లడించారు.
ఏపీలో విద్యుత్ డిమాండ్ 170 పాయింట్ 542 మిలియన్ యూనిట్లు ఉంది. పరిశ్రమలు, వ్యవసాయ కనెక్షన్లకు కోత విధించడంతో 24 మిలియన్ యూనిట్లకు డిమాండ్ తగ్గింది. అయినప్పటికీ విద్యుత్ కోతలు తప్పలేదు. జనానికి తిప్పలూ తప్పలేదు. శుక్రవారంనాడు గ్రామీణ ప్రాంతాల్లో వంతుల వారీగా రెండు నుంచి మూడు గంటల పాటు విద్యుత్ కోతలు విధించారు.
దీంతో పాటు పుండు మీద కారం చల్లినట్లు జెన్కోకు చెందిన కృష్ణపట్నం, విజయవాడలోని వీటీపీఎస్ ల బాయిలర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. థర్మల్ కేంద్రా ల నుంచి ఉత్పత్తి పెంచాలంటే ఒక్కొక్కటి 15 నిమిషాలు చొప్పున కనీసం 6 టైం బ్లాక్ లు ముందుగా చెప్పాలట. విద్యుత్ ఉత్పత్తి పెంచాలని ఒత్తిడి చేయడంతో బాయిలర్లలో సమస్యలు తలెత్తాయంటున్నారు. ఈ రెండు ప్లాంట్లలో కలిపి రోజుకు 13 వందల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. అయితే.. ఉత్పత్తి కొనసాగించాలంటే ఆ ప్లాంట్ల వద్ద బొగ్గు నిల్వలు లేవట. వీటీపీఎస్, కృష్ణపట్నం కేంద్రాల వద్ద 1 పాయింట్ 60 లక్షల టన్నులు చొప్పున మాత్రమే బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. కాగా.. కడప ఆర్టీపీపీలో 65 వేల టన్నుల బొగ్గు మాత్రమే ఉందట. థర్మల్ యూనిట్లు పూర్తిస్థాయిలో పనిచేయాలంటే రోజుకు 65 వేల టన్నుల బొగ్గు అవసరం అవుతుందంటున్నారు. ప్రస్తుతం థర్మల్ యూనిట్ల వద్ద రెండు లేదా మూడు రోజులకు సరిపడినంత బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. అంటే ఎన్టీపీసీ నుంచి వెంటనే విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా చర్యలు తీసుకోకపోతే వచ్చే రెండు మూడు రోజుల్లో ఏపీలో మరింతగా విద్యుత్ కోతలు తప్పకపోవచ్చన్నమాట.