ఏపీలో డొల్ల కంపెనీల కలకలం!.. అందరి చూపు ఆయన వైపు..!!
posted on Feb 5, 2022 @ 11:52AM
డొల్ల కంపెనీ. షెల్ కంపెనీ. సూట్‌కేసు కంపెనీ. ఈ పదాలు వినిపిస్తే చాలు.. తెలుగు వాళ్లు ఉలిక్కిపడుతుంటారు. మిగతా రాష్ట్రాల కంటే మనోళ్లకే వీటి గురించి నాలెడ్జ్ ఎక్కువ. గతంలో ఇలాంటి ఆర్థిక మోసాలతోనే జగనన్న వేల కోట్ల దోచేశారనే ఆరోపణలు ఉన్నాయి. సీబీఐ, ఈడీ కేసులు పెట్టాయి. ఏళ్ల పాటు జైల్లో ఉన్నారు. ప్రస్తుతం ఆయా కేసుల్లో బెయిల్‌పై బయటికొచ్చి.. ఏపీని పాలిస్తున్నారు. బెయిల్‌పై బయటున్న వ్యక్తి రాష్ట్రాన్ని ఏలుతుండటం ఆంధ్రుల దురదృష్టం అంటున్నారు.
లేటెస్ట్‌గా ఏపీలో మరోసారి డొల్ల కంపెనీల కలకలం చెలరేగింది. ఊరూ, పేరు, అడ్రస్ సక్రమంగా లేని 21 షెల్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నట్టు.. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్- ఆర్ఓసీ గుర్తించింది. జస్ట్ కాగితాల్లో మాత్రం ఆయా కంపెనీలు ఉన్నాయని.. వాస్తవంలో వాటి ఉనికే లేదని తేల్చింది. అంటే, అలా దొంగ కంపెనీలతో నల్లధనాన్ని తెల్లగా మార్చేసే ప్రయత్నమేదో జరుగుతోందని అనుమానిస్తోంది. ఆ మేరకు, 21 కంపెనీలకు ఆంధ్రప్రదేశ్ ఆర్‌ఓసీ అధికారులు నోటీసులు జారీ చేశారు.
ఏపీలో వివిధ పేర్లతో 21 డొల్ల కంపెనీలు ఏర్పాటైనట్లు కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ జాబితాను విజయవాడలో ఉన్న ఆర్‌ఓసీ కార్యాలయానికి పంపారు. ఈ కార్యాలయానికి చెందిన అధికారులు సూర్యరావుపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేంద్ర నిఘా వర్గాలు గుర్తించిన జాబితాలో తూర్పుగోదావరి జిల్లా అమలాపురం, తిరుపతిలోని శ్రీసిటీలో ఈ కంపెనీలు ఉన్నట్టు గుర్తించారు. ఈ జాబితాలో ఉన్న సంస్థలతో పాటు వాటికి ధ్రువీకరణ ఇచ్చిన ఐసీఏఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఇండియా), ఐసీఎస్‌ఐ (ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఇండియా) సంస్థలకు ఆర్‌ఓసీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం కంపెనీలు ఏర్పాటు ప్రక్రియంతా ఆన్‌లైన్‌లోనే సాగుతోంది. కంపెనీలను ఆర్‌ఓసీలో నమోదు చేయించుకోవడానికి ముందు వారు ఐసీఏఐ, ఐసీఎస్‌ఐ వంటి ఏజెన్సీల నుంచి ధ్రువీకరణ పొందాలి. ఈ ప్రక్రియ పూర్తయిన కేంద్ర కంపెనీ వ్యవహారాల శాఖ పరిశీలిస్తుంది. ఆ తర్వాత సంబంధిత కంపెనీల దరఖాస్తులు రాష్ట్రంలోని ఆర్‌ఓసీ కార్యాలయానికి ఆన్‌లైన్‌లో చేరతాయి. డొల్ల కంపెనీలుగా భావిస్తున్న 21 సంస్థల్లో కొన్నింటికి ఐసీఏఐ, మరికొన్నింటికి ఐసీఎస్‌ఐ ఏజెన్సీలు ధ్రువీకరణ ఇచ్చినట్టు తెలిసింది. ఈ రెండు సంస్థలతో పాటు 21 అనుమానిత కంపెనీలకు.. విచారణకు హాజరుకావాలని ఆర్‌ఓసీ కార్యాలయం నుంచి నోటీసులు వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
అయితే, ఏజెన్సీలతో పాటు, ఆయా కంపెనీలకు చైర్మన్, బోర్డు డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న వారు హాజరయ్యేందుకు గడువు కోరినట్టు తెలుస్తోంది. కొవిడ్ కేసులు పెరుగుతున్న కారణంగా తాము ఇప్పట్లో విచారణకు హాజరు కాలేమని, నెలాఖరు వరకు సమయం ఇవ్వాలని కోరినట్టు తెలిసింది. కేంద్ర నిఘా వర్గాలు ఇచ్చిన జాబితాలో కంపెనీల్లో ఏపీలో ఉన్న వ్యక్తులతో పాటు చైనాకు చెందిన వ్యక్తులకు భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో ఈ కేసును తామే దర్యాప్తు చేయాలా? లేక మరో విభాగానికి అప్పగించాలా? అని ఆలోచిస్తున్నారట. ఈ కేసులో విదేశీ వ్యవహారాలు ముడిపడి ఉన్నందున దర్యాప్తును అత్యంతగోప్యంగా చేయాలని.. అవసరమైతే జాతీయ సంస్థల సహకారం తీసుకోవాలని ఆర్‌ఓసీ భావిస్తోందని తెలుస్తోంది.
ఇంతకీ.. ఆ డొల్ల కంపెనీలు ఎవరివై ఉంటాయో..? ఆయనకు సంబంధించినవేనా? గత అనుభవాలతో ఈసారి మరింత పక్కాగా ప్లాన్ చేశారా? అయినా, ఆర్ఓసీ గుర్తించే సరికి గతుక్కుమంటున్నారా?