సెంటిమెంటే ఆశ.. సెంటిమెంటే భయం! కారుకు కొత్తటెన్షన్
posted on Oct 11, 2020 @ 1:22PM
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక సెంటిమెంట్ రాజకీయాల చుట్టే తిరుగుతోంది. సోలిపేట రామలింగారెడ్డి మరణంతో జరుగుతున్న ఉప ఎన్నికలో .. అధికార పార్టీ నుంచి ఆయన సతీమణి సుజాత పోటీ చేస్తోంది. రామలింగారెడ్డి చనిపోయారన్న సానుభూతి తమకు కలిసి వస్తుందని టీఆర్ఎస్ ధీమాగా ఉంది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు వరుసగా ఓడిపోతూ వస్తున్నారు. దీంతో ఆయనపై కూడా ప్రజల్లో సెంటిమెంట్ ఉందని కమలం కార్యకర్తలు చెబుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన చెరుకు శ్రీనివాస్ రెడ్డి.. తన తండ్రి దివంగత చెరుకు ముత్యం రెడ్డి పేరుతో ప్రచారం చేస్తూ సెంటిమెంట్ రాజకీయం చేస్తున్నారు. మంత్రిగా ముత్యం రెడ్డి నియోజకవర్గంలో చేసిన అభివృద్ది పనులు తనకు ప్లస్ అవుతుందని శ్రీనివాస్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. ఇలా మూడు ప్రధాన పార్టీలు సెంటిమెంట్ పండిస్తూనే ప్రచారం చేస్తున్నాయి.
సోలిపేట రామలింగారెడ్డిపై ప్రజల్లో ఉన్న సానుభూతి తమకు లాభిస్తుందని చెబుతున్న అధికార పార్టీని మరో సెంటిమెంట్ భయపెడుతోంది. తెలంగాణ రాష్ట్రంలో జరిగిన గత పరిణామాలు ఆ పార్టీని కలవరపరుస్తున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు చనిపోతే జరిగిన ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పని చేయలేదు. చనిపోయిన నేతల కుటుంబ సభ్యులు పోటీ చేసినా ప్రత్యర్థి పార్టీనే గెలిచింది. నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే పీ. కిృష్టారెడ్డి అనారోగ్యం కారణంగా మృతిచెందారు. నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నికల్లో కిృష్టారెడ్డి కుటుంబసభ్యుడినే కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలపగా.. ఆయనపై అధికార టీఆర్‌ఎస్ పార్టీ భూపాల్‌రెడ్డిని పోటీకి నిలిపి విజయం సాధించింది. సిట్టింగ్ అభ్యర్థి మరణంతో సానుభూతి కలిసొచ్చిందనుకున్న కాంగ్రెస్ పార్టీపై రికార్డు మెజార్టీతో కారుపార్టీ విజయం సాధించింది.
ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీమంత్రి రాంరెడ్డి వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో మృతిచెందారు. అక్కడ కూడా తన భార్య సుచరితా రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం బరిలో నిలబెట్టింది. 2016లో ఉప ఎన్నికలో అప్పటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును టీఆర్‌ఎస్ పోటికి పెట్టింది. సెంటిమెంట్ ను కాదని తుమ్మలకు పాలేరు ప్రజలు భారీ మెజార్టీ కట్టబెట్టారు. దాదాపు 47వేలకు పైగా ఆధిక్యంతో తుమ్మల నాగేశ్వరరావు విజయం సాధించారు. సిట్టింగ్ స్థానం అయిన్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి ఘోరంగా ఓడిపోయారు. ఈ రెండు ఉప ఎన్నికల్లో ఏ ఒక్కచోటైనా సానుభూతి పనికొస్తే కాంగ్రెస్ అభ్యర్థులే విజయం సాధించాలి. కానీ అలా జరుగలేదు.
దుబ్బాక ఉప ఎన్నికలోనూ ఇదే సీన్ రిపీట్ కావొచ్చని కొందరు చెబుతున్నారు. ఆ రెండు స్థానాల్లో వచ్చిన ఫలితమే దుబ్బాకలోనూ పునరావృత్తమైతే అధికార టీఆర్‌ఎస్‌కు ఓటమి తప్పదు. టీఆర్‌ఎస్ నేతలను సైతం ఇదే వెంటాడుతోంది.టీఆర్ఎస్ పార్టీలోనూ అంతర్గతంగా ఇదే చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సుజాత గెలిచినా నియోజకవర్గానికి పెద్దగా ఉపయోగం ఉండదనే ప్రచారాన్ని విపక్ష పార్టీలు నియోజకవర్గంలో జోరుగా నిర్వహిస్తున్నాయి. అయితే స్థానికంగా పార్టీ బలంగా ఉండటంతో పాటు మంత్రి హరీష్ రావు ప్రచారాన్ని ముందుండి నడిపిస్తుండటంతో విజయంపై టీఆర్ఎస్ పార్టీ ధీమాగా ఉన్నట్లు గులాబీ నేతలు చెబుతున్నారు.