భూముల కొనుగోలు వ్యవహారంలో మంత్రి జయరాం బాధితుడా... లేక..?
posted on Oct 10, 2020 @ 7:36PM
ఏపీ మంత్రి జయరాంకు సంబంధించి గత కొద్ది రోజులుగా పలు వివాదాస్పద వ్యవహారాలు వెలుగు చూస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అయన భూముల కొనుగోలు అంశం రాజకీయంగా తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. ఇప్పటికే ప్రతిపక్ష నేతలు దీని పై ఆధారాలతో సహా ఆరోపణలు చేయగా… నిన్న టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఆ ప్రాంతాన్ని సందర్శించి వాస్తవాలు నిగ్గు తెచ్చే ప్రయత్నం చేసింది. అయితే తాజాగా ఈ అంశం మరో కీలక మలుపు తిరిగింది. ఈ భూముల కొనుగోలు వ్యవహారంలో తమను మోసం చేశారంటూ మంత్రి జయరాం భార్య రేణుక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఇట్టినా కంపెనీ తనకు భూముల్ని అమ్మింది నిజమేనని.. కానీ ఇప్పుడు అమ్మలేదంటున్నారని.. మంత్రి సతీమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఈ కేసు వివరాల్లోకి వెళితే.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీకి చెందిన మంజునాథ్ అనే వ్యక్తి దగ్గర మంత్రి జయరాం కుటుంబసభ్యులు ఆ భూములు కొనుగోలు చేశారు. అయితే మంజునాథ్ ఒకప్పుడు ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీలో ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుండి తప్పుకున్నారు. అయితే.. ఆయన ఇట్టినా ప్లాంటేషన్ బోర్డు.. తనకు ఆ భూముల్ని అమ్మే పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చిందంటూ ఓ లెటర్ తీసుకు వచ్చి.. ఆ కంపెనీకి చెందిన భూముల్ని మంత్రి కుటుంబసభ్యుల పేరు మీద రిజిస్టర్ చేసేశారు. మంత్రిగారే కొనుక్కుంటున్నారు కాబట్టి.. ముందూ వెనుకా ఆలోచించకుండా… అధికారులు కూడా రిజిస్టర్ చేసేశారు.
అయితే ఇప్పుడు మంత్రిగారు భూములు కొన్న వ్యవహారం బయటకు రావడంతో.. మొత్తం వ్యవహారం అంతా రివర్స్ అయింది. అంత పెద్ద మొత్తంలో భూములు కొనుగోలు చేయడానికి డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయని.. అలాగే కొత్తగా వచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా కొనుగోలు చేసేటపుడు పెద్ద మొత్తంలో క్యాష్ చెల్లించారని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ విషయం బయటకు రావడం పలు అనుమానాలకు దారి తీస్తోంది. ఒక పక్క మంత్రి గారు దొంగ పత్రాలతో బెదిరించి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తుండగా.. దీనికి కౌంటర్ ఇవ్వడానికి జయరాం నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన తానే ఒక బాధితుడినన్నట్లుగా చెపుతూ.. మోసపోయానని ఫిర్యాదు చేశారు.
ఇది ఇలా ఉండగా.. ఇట్టినా ప్లాంటేషన్ కంపెనీ ఆ భూముల్ని తనకు కూడా అమ్మిందంటూ కరణం పద్మనాభరావు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేసారు. తనకు విక్రయించిన పొలాన్నే మరొకరికి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. దీంతో ఇట్టినా కంపెనీ ఎండీ, మాజీ డైరెక్టర్ సహా మరో నలుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇంతకూ మంత్రి గారికి నకిలీ డాక్యుమెంట్లతో రిజిస్టర్ చేశారా.. లేకపోతే బెదిరించి ఆ భూముల్ని సొంతం చేసుకున్నారా అన్నది పొలిసు దర్యాప్తులో తేలే అవకాశం ఉంది. ఏడాదికి కేవలం మూడు లక్షల ఆదాయం ఉన్న మంత్రి జయరాం, పదవి చేపట్టిన కొంత కాలానికే.. అంత పెద్ద మొత్తంలో ఆస్తులు ఎలా కొనుగోలు చేశారో చెప్పాలని ఇప్పటికే టీడీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాకుండా వారు ఏసీబీకి కూడా ఫిర్యాదు చేసినా.. ప్రభుత్వం వైపు నుండి మాత్రం కనీస స్పందన కూడా లేదు. అయితే దీని పై.. ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేస్తూ.. మొత్తం కేసును మసిపూసి మారేడుకాయ చేసే ప్రయత్నాలు సాగుతున్నాయని ప్రతిపక్షాల నుండి విమర్శలు వస్తున్నాయి.