ఎవరా నలుగురు? తొలగని సందేహాలు...
posted on Jun 8, 2022 @ 10:54AM
జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో దర్యాప్తు పూర్తయింది. ఇందుకు సంబందించిన పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీపీ ఆనంద్, మీడియాకు వివరించారు. ఈ కేసుకు సంబంధించి చాలా లోతుగా దర్యాప్తు జరిపి ఆరుగురు నిందితులను, అదుపులోకి తీసుకున్నామని సీపీ చెప్పారు. కేసు పూర్వాపరాలను సీపీ పూసగుచ్చినట్లు, ఏ క్షణానికి ఏమి జరిగిందో సవివరంగా వివరించారు. నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుందని సీపీ పేర్కొన్నారు.
కఠిన చట్టాలు పెట్టినందు వల్లే.. అత్యంత జాగ్రత్తగా దర్యాప్తు చేశామన్నారు. కేసు దర్యాప్తులో ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని... బలమైన ఆధారాల సేకరణ వల్లే కొంత ఆలస్యమైందని వివరణ ఇచ్చారు. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదని సీపీ స్పష్టం చేశారు. అయితే నిజంగానే, సీపీ ఆనంద్ చెప్పిన విధంగా, నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం వుందా? కఠిన చట్టాలు పెట్టినందున బలమైన ఆధారాల సేకరణకు కోసమే కేసు దర్యాప్తు కొంత ఆలస్యం అయిందన్న సీపీ వాదనలు నిజమేనా? ‘ఈ ఘటనలో అమాయకులను బలి చేయొద్దన్న ఉద్దేశంతో జాగ్రత్త తీసుకున్నాం. కేసులో ఎవరినీ తప్పించే ప్రయత్నం జరగలేదు’ అన్న సీపీ పలుకుల్లో సత్యముందా? లేక జాప్యానికి ఇంకేదైనా కారణం వుందా? ఇప్పుడు పబ్లిక్’ లో ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
అన్నిటికంటే ముఖ్యంగా, పోలీసులు అదుపులోకి తీసుకున్న ఐదుగురు నిదితుల్లో ఏ-1 సాదుద్దీన్ మాలిక్ (18) మాత్రమే మేజర్.మిగిలిన నలుగురు మైనర్లు..అందుకే, సుప్రీం కోర్టు ఆదేశాలను అనుసరించి, ఆ నలుగురి పేర్లు, ఇతర వివరాలు వేటినీ సీపీ బయట పెట్ట లేదు. అందుకే ఆ నలుగురు ఎవరు? అనేప్రశ్న ఇంకా ప్రశ్నగానే మిగిలిపోయింది. గతంలో దిశ సాముహిక అత్యాచారం కేసులో, మైనర్ నిందితుల పేర్లే కాదు, ఫోటోలు కూడా పత్రికలో పబ్లిష్ చేశారు. అయినా అప్పుడు పోలీసులు పట్టించుకోలేదు. కానీ, ఇప్పడు మైనర్ నిందితుల వివరాల చుట్టూ ఇనుప గోడలు కట్టేయడం ఎందుకు, అనేది సామాన్యుల నుంచి, ప్రజా ప్రతినిధుల వరకు వ్యక్తపరుస్తున్న సదేహం. అయితే, సుప్రీం కోర్టు ఆదేశాలు అలా ఉన్నాయి కాబట్టి, ఎవరూ గట్టిగా ప్రశ్నించ లేక పోవచ్చును కానీ, ఏ చిన్న సమాచారం బయటకు పొక్కకుండా పోలీసులు తీసుకుంటున్న జాగ్రత్తలు, అనుమానాలకు ఆస్కారం కల్పిస్తున్నాయని, పబ్లిక్ టాక్ వినవస్తోంది.
అదొకటి అలా ఉంటే, నిదితుల పై పెట్టిన కేసుల విషయంలోనూ కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీపీ ఆనంద్, నిందితులపై పెట్టిన సెక్షన్ల ప్రకారం జీవిత ఖైదు లేదా మరణ శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది అని పేర్కొన్నారు. అది నిజమే కావచ్చును, కానీ, పోలీసులు పెట్టిన అత్యాచారం (376 డి) గాయపరచడం (366 ఏ)పోక్సో – మైనర్ బాలిక కిడ్నాప్’ తో పాటుగా ఐటీ చట్టం సెక్షన్ 76 పరిధిలో వీడియో సర్క్యులేషన్ కేసు, బాల నేరస్తులకు వర్తిస్తాయా? సీపీ ఆనంద్ చెప్పిన విధంగా మైనర్ నిదితులకు మరణ శిక్ష లేదా జీవిత ఖైదు శిక్ష పడే అవకాశం వుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజమే, నిర్భయ చట్టం పరిధిలో, బాల నేరస్తులకు మరణ శిక్ష, జీవిత ఖైదు శిక్షలు విధించే అవకాశం ఉన్నా, జువేనియల్ జస్టిస్ ఆక్ట్’ (జేజేఎ) ప్రకారం, ఇలాంటి కేసుల్లో 16 -18 సంవత్సరాల మధ్య వయసున్న మైనర్ నిందితులను, మేజర్ నిందితులతో సమానంగా, వారిని విచారించిన పద్దతిలోనే విచారించవచ్చును. కానీ, బాల నేరస్తులకు మరణ శిక్ష, యావజ్జీవ శిక్షలు విధించరాదని ఉందని, మాజీ జేడీ., లక్ష్మినారాయణ,, ఒక టీవీ చానల్’ చర్చలో చెప్పారు. ఈ నేపధ్యంలో ఈ కేసులో మైనర్ నిందితులు నలుగురికి మరణ శిక్ష, యావజ్జీవ శిక్ష పడే అవకాశాలు ఎంత వరకు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
న్యాయస్థానం విచారణ సమయంలో చట్టాల మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ను నిందితుల తరపు న్యాయవాదులు వినియోగించుకుంటే? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, అందుకే, ముందు చూపుతో ఒక ఎస్కేప్ రూట్ ను పోలీసులే తెరిచి ఉంచారా, అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, ఈ కేసు దర్యాప్తు పూర్తయిందని, పోలీసులు చేతులు దులుపు కున్నా, ఈ మొత్తం వ్యవహారంలో వెలుగు చూడని రహస్యాలు ఇంకా ఉన్నాయనే సామాన్యుల సందేహాలు అయితే, ఇంకా ఆలాగే ఉన్నాయి.