ఉచితాలపై వివరణ ఇవ్వాల్సిందే.. అది పార్టీల బాధ్యత.. సీఈసీ
posted on Nov 4, 2022 @ 3:11PM
కేంద్ర ఎన్నికల సంఘం గుజరాత్ ఎన్నికల ప్రకటన వేళ కీలక కామెంట్స్ కొన్ని చేసింది. ఉచిత హామీలు ఇపుడు దేశంలోని అనేక పార్టీలు ఇస్తున్నాయని వాటి విషయంలో హామీలు ఎలా తీరుస్తారు అన్నది తమకు చెప్పాలని ఈ మేరకు అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసినట్లుగా చెప్పారు. ఈ విధంగా చెప్పడం ఆయా పార్టీలు అభ్యర్ధుల కనీస బాధ్యత సీఈసీ రాజీవ్ కుమార్ అన్నారు.
గుజరాత్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం రాజకీయ పార్టీలకు ఉచితాలపై షాక్ ఇచ్చింది. ఉచిత హామీలు ఇచ్చి ఊరుకుంటే సరిపోదు.. వాటిని అమలు చేయడం కూడా ఆయా హామీలు ఇచ్చిన పార్టీల బాధ్యత అని స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎలా నెరవేరుస్తారన్నది కూడా స్పష్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది.
దీనిపై అన్ని రాజకీయ పార్టీలకూ ఇప్పటికే లేఖలు రాసినట్లు పేర్కొంది. హామీలు ఇచ్చిన పార్టీలు వాటిని ఎలా నెరవేరుస్తారన్న విషయాన్ని ఆర్థిక నిపుణులకు, మీడియాకు, ఓటర్లకు చెప్పాల్సి ఉందని అది ఆయా పార్టీల బాధ్యత అని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన సంగతి విదితమే. రాష్ట్రంలో రెండు విడతలుగా ఎన్నికలు జరుగుతాయి. డిసెంబర్ 1న తొలి విడత, 5న రెండో విడత పోలింగ్ జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 182 స్థానాలు ఉన్నాయి. వాటిలో 89 స్థానాలకు తొలి విడతలో, మిగిలిన 93 స్థానాలకు రెండో విడతలో పోలింగ్ జరుగుతుంది.
ఇక ఒక్క ఓటరు కోసం తాము పదిహేను మంది పోలింగ్ సిబ్బందిని గిర్ అడవులకు పంపిస్తున్నట్లుగా సీఈసీ చెప్పడం విశేషం. అలాగే మరో 272 మంది కోసం అలియాబెట్ లో ఒక షిప్ కంటైనర్ నే పోలింగ్ బూత్ గా వాడుతున్నట్లుగా చెప్పారు.